పసికూనపై ప్రతాపం.. ఎట్టకేలకు తొలి విజయం.. ఏం లాభం? | T20 WC: New Zealand Hammer Uganda By 9 Wickets Register 1st Win Fans Reacts | Sakshi
Sakshi News home page

పసికూనపై ప్రతాపం.. 40 పరుగులకే ఆలౌట్!.. ఏం లాభం?

Jun 15 2024 9:51 AM | Updated on Jun 15 2024 10:37 AM

T20 WC: New Zealand Hammer Uganda By 9 Wickets Register 1st Win Fans Reacts

టీ20 ప్రపంచకప్‌-2024 టోర్నీలో న్యూజిలాండ్‌ ఎట్టకేలకు బోణీ కొట్టింది. ఉగాండాను చిత్తుగా ఓడించి తొలి గెలుపు నమోదు చేసింది.

ఈ మెగా ఈవెంట్లో అఫ్గనిస్తాన్‌, వెస్టిండీస్‌, ఉగాండా, పపువా న్యూగినియాలో కలిసి గ్రూప్‌-సిలో ఉన్న  న్యూజిలాండ్‌.. తొలి రెండు మ్యాచ్‌లలో పరాజయం పాలైంది.

మొదట అఫ్గనిస్తాన్‌ చేతిలో 84 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిన కేన్‌ విలియమ్సన్‌ బృందం.. తదుపరి వెస్టిండీస్‌ చేతిలో 13 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఈ క్రమంలో సూపర్‌-8 అవకాశాలు సంక్లిష్టమయ్యాయి.

మరోవైపు.. అఫ్గనిస్తాన్‌, వెస్టిండీస్‌ వరుస విజయాలతో రాణించి.. సూపర్‌-8 బెర్తును ఖరారు చేసుకోవడంతో న్యూజిలాండ్‌ కథ ముగిసిపోయింది.

ఈ క్రమంలో మిగిలిన రెండు నామమాత్రపు మ్యాచ్‌లలో విజయం సాధించాలని పట్టుదలగా ఉన్న కివీస్‌.. తాజాగా శనివారం నాటి మ్యాచ్‌లో పసికూన ఉగాండాపై ప్రతాపం చూపింది.

ట్రినిడాడ్‌ వేదికగా టాస్‌ గెలిచిన న్యూజిలాండ్‌ తొలుత బౌలింగ్‌ ఎంచుకుంది. పేసర్లు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ టిమ్‌ సౌతీ(3/4), ట్రెంట్‌ బౌల్ట్‌(2/7), లాకీ ఫెర్గూసన్‌(1/9).. స్పిన్నర్లు మిచెల్‌ సాంట్నర్‌(2/8), రచిన్‌ రవీంద్ర(2/9) ఆకాశమే హద్దుగా చెలరేగారు.

దీంతో ఉగాండా 18.4 ఓవర్లలో కేవలం 40 పరుగులే చేసి ఆలౌట్‌ అయింది. ఉగాండా ఇన్నింగ్స్‌లో టాప్‌ స్కోర్‌ 11గా నమోదైంది. ఇక అత్యంత స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌ 5.2 ఓవర్లలో పని పూర్తి చేసింది.

ఓపెనర్‌ ఫిన్‌ అలెన్‌ 17 బంతుల్లో కేవలం తొమ్మిది పరుగులే చేసి అవుట్ అయ్యాడు. మరో ఓపెనర్‌ డెవాన్‌ కాన్వే(15 బంతుల్లో 22), రచిన్‌ రవీంద్ర(1)తో కలిసి అజేయంగా నిలిచి.. కివీస్‌ విజయాన్ని ఖరారు చేశాడు.

ఫలితంగా వికెట్‌ నష్టానికి 41 పరుగులు చేసిన న్యూజిలాండ్‌ వరల్డ్‌కప్‌-2024లో పాయింట్ల ఖాతా తెరిచింది. తదుపరి జూన్‌ 17న పపువా న్యూగినియాతో కివీస్‌ జట్టు తలపడనుంది. ‌ 

కాగా ఉగాండాపై న్యూజిలాండ్‌ విజయం నేపథ్యంలో అభిమానులు మిశ్రమంగా స్పందిస్తున్నారు. ఇప్పటికైనా ఒకటి గెలిచిందని కొంతమంది సంతోషిస్తుంటే.. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభమని మరికొందరు విమర్శిస్తున్నారు. ‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement