T20 WC: వరల్డ్‌కప్‌ టోర్నీ నుంచి శ్రీలంక అవుట్‌?! | T20 WC 2024: SL vs NEP Match Abandoned, Sri Lanka Super 8 Hopes Upending | Sakshi
Sakshi News home page

కొంపముంచిన వర్షం.. వరల్డ్‌కప్‌ టోర్నీ నుంచి శ్రీలంక అవుట్‌?!

Jun 12 2024 10:05 AM | Updated on Jun 12 2024 10:28 AM

T20 WC 2024: SL vs NEP Match Abandoned, Sri Lanka Super 8 Hopes Upending

శ్రీలంక జట్టు (PC: SLC X)

టీ20 ప్రపంచకప్‌-2024 సూపర్‌-8కు అర్హత సాధించాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో శ్రీలంకను దురదృష్టం వెంటాడింది. నేపాల్‌తో బుధవారం ఉదయం జరగాల్సిన మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దైంది.

ఫలితంగా లంక సూపర్‌-8 అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. కాగా ఈ ఐసీసీ టోర్నీకి అమెరికాతో కలిసి వెస్టిండీస్‌ ఆతిథ్యం ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో లాడెర్‌హిల్‌ వేదికగా గ్రూప్‌-డిలో భాగమైన శ్రీలంక- నేపాల్‌ మధ్య బుధవారం మ్యాచ్‌ జరగాల్సింది.

టాస్‌ పడకుండానే రద్దు
అయితే, ఎడతెరిపిలేని వర్షం కారణంగా కనీసం టాస్‌ కూడా పడకుండానే మ్యాచ్‌ రద్దై పోయింది. దీంతో ఇరు జట్ల ఖాతాలో ఒక్కో పాయింట్‌ చేరింది. కాగా టీ20 వరల్డ్‌కప్‌ తొమ్మిదో ఎడిషన్‌లో ఇప్పటికే రెండు మ్యాచ్‌లు ఆడిన శ్రీలంక.. రెండింటిలోనూ ఓటమి పాలైంది.

ఇక ఇప్పుడు వర్షం కారణంగా ఒక పాయింట్‌ ఖాతాలో వేసుకోగలిగింది. కాగా హసరంగ బృందానికి గ్రూప్‌ దశలో ఇంకా ఒకే ఒక్క మ్యాచ్‌ మిగిలి ఉంది. తదుపరి నెదర్లాండ్స్‌తో జరిగే మ్యాచ్‌లో శ్రీలంక తప్పక గెలవాలి.

అలా అయితేనే సూపర్‌-8 ఆశలు సజీవం
అయినప్పటికీ సూపర్‌-8 చేరాలంటే ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. ఇప్పటికే రెండింట ఒక విజయం సాధించిన బంగ్లాదేశ్‌.. తదుపరి నేపాల్‌, నెదర్లాండ్స్‌తో మ్యాచ్‌లలో ఓడిపోవాలి.

అంతేకాదు.. నేపాల్‌ తమకు మిగిలిన రెండు మ్యాచ్‌లలో సౌతాఫ్రికా, బంగ్లాదేశ్‌ను ఓడించాలి. అదే విధంగా.. నెదర్లాండ్స్‌ తదుపరి తమ రెండు మ్యాచ్‌లలో ఓడిపోవాలి. అప్పుడే శ్రీలంక సూపర్‌-8 ఆశలు సజీవంగా ఉంటాయి. 

అలా కాకుండా నెదర్లాండ్స్‌ చేతిలో గనుక ఓడితే ఇంటిబాట పట్టాల్సిందే! ఇక ఈ గ్రూపులో ఉన్న సౌతాఫ్రికా ఇప్పటికే మూడు విజయాలతో సూపర్‌-8కు అర్హత సాధించిన విషయం తెలిసిందే.

చదవండి: అతడు మా జట్టులో ఉండటం అదృష్టం: ఆసీస్‌ కెప్టెన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement