T20 WC 2022 PAK VS NED: పాకిస్తాన్‌ బౌలర్‌ రాకాసి బౌన్సర్‌.. బద్ధలైన బ్యాటర్‌ ముఖం

T20 WC 2022: Netherlands Batter Bas De Leede Gets Hit Badly By Haris Rauf Bouncer - Sakshi

టీ20 వరల్డ్‌కప్‌-2022 గ్రూప్‌-2లో భాగంగా పాకిస్తాన్‌తో ఇవాళ (అక్టోబర్‌ 30) జరిగిన మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ బ్యాటర్‌ బాస్‌ డి లీడ్‌ తీవ్రంగా గాయపడ్డాడు. నెదర్లాండ్స్‌ ఇన్నింగ్స్‌ 6వ ఓవర్‌లో పాక్‌ పేసర్‌ హరీస్‌ రౌఫ్‌ విసిరిన రాకాసి బౌన్సర్‌.. బాస్‌ డి లీడ్‌ హెల్మెట్‌ లోపలికి చొచ్చుకుపోయి ముఖాన్ని బద్ధలు కొట్టింది. ఈ దెబ్బకు విలవిలలాడిపోయిన డచ్‌ బ్యాటర్‌ కొద్దిసేపు ఏం జరుగుతుందో అర్ధంకాక అలాగే క్రీజ్‌లో కూలబడిపోయాడు. 

142 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన బంతి బాస్‌ డి లీడ్‌ ముఖానికి బలంగా తాకడంతో రక్తం ధార కట్టింది. దీంతో బ్యాటర్‌తో సహా గ్రౌండ్‌లో ఉన్న వారంతా ఆందోళన చెందారు. కుడి కంటి కింది భాగంలో తగిలిన ఈ గాయం బాస్‌ డి లీడ్‌ ముఖాన్ని చీల్చేసింది. బంతి ఏమత్రం అటుఇటు అయినా లీడ్‌ కంటిని కోల్పోయే వాడు. దీంతో అతను బతుకు జీవుడా అని మైదానాన్ని వీడాడు. లీడ్ గాయం తీవ్రత కారణంగా తిరిగి బరిలోకి కూడా దిగలేదు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో ట్రెండింగ్‌ ఉంది. 

ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌పై పాకిస్తాన్‌ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. డచ్‌ జట్లు నిర్ధేశించిన 92 పరుగుల సునాయాస లక్ష్యాన్ని పాక్‌ ముక్కి మూలిగి 13.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. తొలుత పాక్‌ బౌలర్లు షాదాబ్‌ ఖాన్‌ (3/22), మహ్మద్‌ వసీం జూనియర్‌ (2/15), షాహీన్‌ అఫ్రిది (1/19), నసీం షా (1/11), హరీస్‌ రౌఫ్‌ (1/10) సత్తా చాటడంతో  నెదర్లాండ్స్‌ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 91 పరుగులు చేయగా, ఛేదనలో పాకిస్తాన్‌ నానా కష్టాలు పడి అతి కష్టం మీద లక్ష్యాన్ని చేరుకుంది.

సునాయాస లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాక్‌కు ఆరంభంలోనే గట్టి షాక్‌ తగిలింది. కెప్టెన్‌ బాబర్‌ ఆజమ్‌ 4 పరుగులు మాత్రమే చేసి రనౌటయ్యాడు. అయితే మహ్మద్‌ రిజ్వాన్‌ (49), ఫఖర్‌ జమాన్‌ (20) బాధ్యతాయుతంగా ఆడి జట్టును లక్ష్యం దిశగా నడిపించారు. 30 పరుగుల వ్యవధిలో ఈ ఇద్దరూ ఔట్‌ కావడంతో పాక్‌ నెమ్మదిగా లక్ష్యం దిశగా సాగింది. ఈ క్రమంలో షాన్‌ మసూద్‌ (12) ఔట్‌ కాగా.. ఇఫ్తికార్‌ అహ్మద్‌ (6), షాదాబ్‌ ఖాన్‌ (4) జట్టును విజయతీరాలకు చేర్చారు. ఈ విజయంతో పాక్‌ ప్రస్తుత ప్రపంచకప్‌లో బోణీ కొట్టడంతో పాటు ఆసీస్‌ గడ్డపై తొలి విజయాన్ని నమోదు చేసింది.
  
 

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top