T20 WC 2022: ఇంగ్లండ్‌ విధ్వంసకర బ్యాటర్లను టీమిండియా బౌలర్లు అడ్డుకోగలరా..? మరీ అంత టెన్షన్‌ ఎందుకు?

T20 WC 2022: Can India Bowlers Defend Dangerous England Batting Line Up - Sakshi

టీ20 వరల్డ్‌కప్‌-2022లో టీమిండియా సెమీస్‌ మ్యాచ్‌కు సమయం దగ్గర పడుతున్న కొద్దీ అభిమానుల్లో ఎన్నడూ లేని నెర్వస్‌నెస్‌ మొదలైంది. గతంలో మెగా టోర్నీల ఫైనల్‌ మ్యాచ్‌ల్లోనే నింపాదిగా వ్యవహరించిన భారతీయ అభిమానులు.. ఈ సారి సెమీస్‌ మ్యాచ్‌కే తెగ టెన్షన్‌ పడిపోతున్నారు. ఇందుకు.. టీమిండియా ఐసీసీ ట్రోఫీ గెలిచి తొమ్మిదేళ్లవుతుందన్న కారణమొకటైతే, రెండోది ఇటీవలి కాలంలో ఇంగ్లండ్‌ జట్టు భీకర ప్రదర్శన.

వాస్తవంగా చెప్పాలంటే.. ఐసీసీ ట్రోఫీ గెలవలేకపోతున్నామన్న కారణం కంటే, అరివీర భయంకరమైన ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌ లైనప్‌ టీమిండియా అభిమానులను అధికంగా భయపెడుతుంది. తమదైన రోజున అడ్డూ అదుపూ లేకుండా శివాలెత్తిపోయే ఇంగ్లీష్‌ బ్యాటర్లను టీమిండియా బౌలర్లు నిలువరించగలరా అన్న సందేహం వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. 

జోస్‌ బట్లర్‌, అలెక్స్‌ హేల్స్‌, ఫిలిప్‌ సాల్ట్‌, హ్యారీ బ్రూక్‌, లియామ్‌ లివింగ్‌స్టోన్‌, మొయిన్‌ అలీ, బెన్‌ స్టోక్స్‌ లాంటి విధ్వంసకర బ్యాటర్లకు టీమిండియా బౌలర్లు అడ్డుకట్ట వేయగలరా అని ఫ్యాన్స్‌ సందేహా పడుతున్నారు. మేటి బౌలింగ్‌ను సైతం తునాతునకలు చేసే ఈ బ్యాటింగ్‌ యోధుల ధాటికి అంతంతమాత్రంగా ఉన్న ఉన్న భారత బౌలింగ్‌ తట్టుకోగలదా అన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.

బుమ్రా లాంటి బౌలర్‌ ఉంటే, టీమిండియా పరిస్థితి కాస్త మెరుగ్గా ఉండేదని అనుకుంటున్నారు. షమీ, అర్షదీప్‌, భువీ, అశ్విన్‌, హార్ధిక్‌లతో కూడిన భారత బౌలింగ్‌ లైనప్‌ బలంగానే కనిపిస్తున్నప్పటికీ.. మెరుపు ఇన్నింగ్స్‌లతో రెచ్చిపోయే ఇంగ్లండ్‌ బ్యాటర్లకు కళ్లెం వేయగలదా లేదా అని లోలోపల మధన పడిపోతున్నారు. మ్యాచ్‌కు వేదిక అయిన అడిలైడ్‌ స్పిన్నర్లకు అనుకూలిస్తుంది ​కాబట్టి ఇంగ్లండ్‌ బ్యాటర్ల పప్పులేమీ ఉడకవని తమకు తామే సర్ధి చెప్పుకుంటున్నారు.  ఒకవేళ స్పిన్నర్లు తేలిపోయినా పేసర్లు అర్షదీప్‌, షమీ, భువీ, హార్ధిక్‌ మంచి ఫామ్‌లోనే ఉన్నారని, వీరి ధాటికి ఇంగ్లండ్‌ బ్యాటర్లు తట్టుకోలేరని ధైర్యం చెప్పుకుంటున్నారు.

వాస్తవానికి ప్రస్తుత ప్రపంచకప్‌లో​ఇంగ్లండ్‌ బ్యాటర్ల ఫామ్‌ టీమిం‍డియా అభిమానులు భయపడేంత ఏమీ లేదన్నది కాదనలేని నిజం. ఒకటి, అరా ఇన్నింగ్స్‌ల్లో బట్లర్‌, హేల్స్‌ రాణించారే తప్పిస్తే.. అరివీర భయంకరులుగా చెప్పుకునే బ్యాటర్లంతా దాదాపు ప్రతి మ్యాచ్‌లో తస్సుమినిపించారు. ఐర్లాండ్‌ చేతిలో చావుదెబ్బ తిన్న ఇంగ్లండ్‌.. ఏదో అదృష్టం కలిసి వచ్చి, బౌలర్ల పుణ్యమా అని అతికష్టం  మీద సెమీస్‌కు అర్హత సాధించింది. ఇంగ్లీష్‌ జట్టు ఈ ఫామ్‌ను చూసి టీమిండియా అభిమానులు కంగారు పడనక్కర్లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  ​ 

మీ అభిప్రాయం చెప్పండి

Loading...

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top