టీ20 ముంబై లీగ్ 2026లో ఇవాళ (జూన్ 3) ఓ ఆసక్తికర సమరం జరిగింది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైన మ్యాచ్‌లో నార్త్ ముంబై పాంథర్స్, బాంద్రా బ్లాస్టర్స్ జట్లు తలపడగా.. అజింక్య రహానే నేతృత్వం వహిస్తున్న ముంబై పాంథర్స్ సూపర్ ఓవర్‌లో విజయం సాధించింది. నిర్ణీత ఓవర్లలో ఇరు జట్లు సమాన స్కోర్లు చేయగా.. సూపర్ ఓవర్‌లో ముంబై పాంథర్స్ పైచేయి సాధించింది.
నరాలు తెగే ఉత్కంఠ నడుమ సాగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బాంద్రా బ్లాస్టర్స్.. కెప్టెన్ సువేద్ పార్కర్ (110) శతక్కొట్టుడుతో నిర్ణీత 20 ఓవర్లలో 228 పరుగుల భారీ స్కోర్ చేసింది. అనంతరం బరిలోకి దిగిన పాంథర్స్ టీమ్.. బ్లాస్టర్స్‌కు ధీటుగా పోరాడి స్కోర్‌ను సమం చేసింది.
16 ఓవర్ల వరకు ఓటమి ఖాయమనుకున్న పాంథర్స్ అనూహ్యంగా పుంజుకొని చివరి 4 ఓవర్లలో బౌండరీలు, సిక్సర్లతో విరుచుకుపడి స్కోర్‌ను సమం చేసింది. వైభవ్ మాలి (32), రాహుల్ సావంత్ (10), తనుశ్ కోటియన్ (32 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్‌లతో విరుచుకుపడ్డారు. ముఖ్యంగా తనుశ్ చివరి ఓవర్లో బౌండరీ, సిక్సర్ సహా చివరి బంతికి రెండు పరుగులు సాధించి మ్యాచ్ టై కావడంలో కీలకపాత్ర పోషించాడు.
అనంతరం సూపర్ ఓవర్‌లో వైభవ్ మాలి మరోసారి రెచ్చిపోవడంతో (2 సిక్సర్లు, ఫోర్) తొలుత బ్యాటింగ్ చేసిన పాంథర్స్ 6 బంతుల్లో 20 పరుగులు చేసింది. ఛేదనలో మోహిత్ అవస్థి అద్భుతంగా బౌలింగ్ చేయడంతో బ్లాస్టర్స్ జట్టు 7 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. కాగా, ఈ టోర్నీలో రహానే, శివమ్ దూబే, శ్రేయస్ అయ్యర్ లాంటి ఐపీఎల్ స్టార్లు పాల్గొంటున్న విషయం తెలిసిందే.


