సూపర్‌ సుమీత్‌.. | Sakshi
Sakshi News home page

సూపర్‌ సుమీత్‌..

Published Sun, Feb 25 2024 11:28 AM

Sumit Nagal is an Indian professional tennis player - Sakshi

దాదాపు నాలుగున్నరేళ్ల క్రితం.. న్యూయార్క్‌లో టెన్నిస్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ యూఎస్‌ ఓపెన్‌ తొలి రౌండ్‌ మ్యాచ్‌. ఆల్‌టైమ్‌ గ్రేట్‌ ప్లేయర్‌ రోజర్‌ ఫెడరర్‌ బరిలోకి దిగాడు. అతని ఎదురుగా ఉన్న 22 ఏళ్ల కుర్రాడికి అదే తొలి గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ. క్వాలిఫయింగ్‌ ద్వారా మెయిన్‌ డ్రాకి అర్హత సాధించాడు. అంతకు ముందెప్పుడూ అతను అంత పెద్ద స్టేడియంలో ఆడలేదు. సహజంగానే ఎవరూ ఆ మ్యాచ్‌లో ఫెడరర్‌ ప్రత్యర్థి గురించి పట్టించుకోలేదు. కానీ ఒక సెట్‌ ముగిసే సరికి అందరిలో చర్చ మొదలైంది. ఆ యువ ఆటగాడు తొలి సెట్‌ను 6–4తో గెలుచుకొని అందరినీ ఆశ్చర్యపరచాడు. ఒక్కసారిగా షాక్‌కు గురైన ఫెడరర్‌ కోలుకొని ఆ తర్వాత తన స్థాయి ప్రదర్శనతో మ్యాచ్‌ను గెలుచుకున్నాడు. కానీ గ్రాండ్‌స్లామ్‌లో ఒక కొత్త ఆటగాడు అలా అందరూ గుర్తుంచుకునేలా పరిచయమయ్యాడు. 

ఆరంభం గుర్తుంచుకునేలా ఉన్నా.. ఆ తర్వాత ఆ కుర్రాడి కెరీర్‌ తీవ్ర ఒడిదుడుకులకు లోనైంది. ఆటలో ఓటములతో పాటు గాయాలు, ఆర్థిక సమస్యలూ చుట్టుముట్టాయి. టెన్నిస్‌ను కొనసాగించేందుకు కనీస స్థాయిలో కూడా డబ్బుల్లేని స్థితి. ఆటను వదిలిపెట్టేందుక్కూడా అతను సిద్ధమయ్యాడు. కానీ అతనిలోని పట్టుదల మళ్లీ పోరాడేలా చేసింది. సన్నిహితుల సహకారం మళ్లీ ఆటపై దృష్టి పెట్టేలా చేసింది. దాంతో వరుసగా చాలెంజర్‌ టోర్నీల్లో విజయాలు.. ఇప్పుడు సింగిల్స్‌లో వరల్డ్‌ టాప్‌–100 ర్యాంకింగ్స్‌లోకి ప్రవేశించిన అరుదైన భారత ఆటగాళ్ల జాబితాలో చోటు. ఆ కుర్రాడి పేరే సుమీత్‌ నగాల్‌. ఎన్నో ప్రతికూలతలను అధిగమించి ప్రస్తుతం భారత నంబర్‌వన్‌గా కొనసాగుతున్న ఈ  ఆటగాడు మరిన్ని పెద్ద ఘనతలు సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. 

మొహమ్మద్‌ అబ్దుల్‌ హాది 
‘నా బ్యాంకు ఖాతాలో 80 వేల రూపాయలు మాత్రమే ఉన్నాయి. ఏడాదంతా కలిపి 24 టోర్నీలు ఆడినా వచ్చే డబ్బు ఖర్చులకే సరిపోవడం లేదు. నా జీతం, కొన్ని సంస్థలు చేసే ఆర్థిక సహాయం మొత్తాన్ని కూడా టెన్నిస్‌లోనే పెట్టేశా. అంతర్జాతీయ టెన్నిస్‌లో విజయాలు, రికార్డుల సంగతి తర్వాత.. కనీసం ఒక ఆటగాడిగా కొనసాగాలన్నా ఏడాదికి రూ. 80 లక్షల నుంచి రూ.1 కోటి వరకు ఖర్చవుతుంది. ఫిజియో, స్ట్రెంత్‌ అండ్‌ కండిషనింగ్‌ కోచ్‌లను పెట్టుకునే స్థాయి లేక కేవలం ఒకే ఒక ట్రావెలింగ్‌ కోచ్‌తో టోర్నీలకు వెళుతున్నా. మన దేశంలో టెన్నిస్‌కు ఉన్న ఆదరణ, ప్రోత్సాహం చాలా తక్కువ!’ కొన్నాళ్ల క్రితమే సుమీత్‌ నగాల్‌ వెలిబుచ్చిన ఆవేదన అది. ఆ మాటల్లో ఆశ్చర్యమేమీ లేదు. అంతర్జాతీయ టెన్నిస్‌ చాలా ఖర్చులతో కూడుకున్న వ్యవహారం.

శిక్షణ, సాధన మొదలు ప్రపంచవ్యాప్తంగా వేర్వేరు టోర్నీల్లో ఆడాలంటే చాలా డబ్బు కావాలి. టోర్నీల్లో ఆడితేనే ఫలితాలు, ర్యాంకింగ్స్‌ వస్తాయి. స్థాయి పెరిగేందుకు అవకాశం ఉంటుంది. అందుకే జూనియర్‌ స్థాయిలో మంచి ఫలితాలు సాధించిన తర్వాత కూడా ఆర్థిక సమస్యల కారణంగానే చాలామంది ముందుకు వెళ్లకుండా ఆగిపోతారు. నగాల్‌ తన కెరీర్‌లో ఇలాంటి దశను చాలాసార్లు ఎదుర్కొన్నాడు. అయితే ఎన్ని ఇబ్బందులు ఎదురైనా టెన్నిస్‌ను అమితంగా ప్రేమిస్తూ ఆటపైనే దృష్టి పెట్టాడు. అందుకే ఇప్పుడు అతను సాధించిన రికార్డు, గెలిచిన టోర్నీలు ఎంతో ప్రత్యేకం. కెరీర్‌ ఆరంభంలోనే వేగంగా ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 130కి చేరి ఆపై రెండేళ్ల వ్యవధిలో 638కి పడిపోయిన నగాల్‌.. ప్రస్తుతం టాప్‌–100లోకి రావడం అతని ఆటలోని పురోగతిని చూపిస్తోంది. 

ప్రతిభాన్వేషణతో వెలుగులోకి వచ్చి..
నగాల్‌ది సాధారణ కుటుంబ నేపథ్యం. ఢిల్లీకి దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఝఝర్‌ అతని స్వస్థలం. తండ్రి ఉపాధ్యాయుడు. తల్లి గృహిణి. ఆరంభంలో తన ఈడు పిల్లల్లాగే క్రికెట్‌నే అతను ఎక్కువగా ఇష్టపడ్డాడు. మిత్రులతో కలసి గల్లీ క్రికెట్‌ ఆడుతూ వచ్చాడు. అయితే ఎనిమిదేళ్ల వయసులో టీమ్‌ ఈవెంట్‌ కాకుండా ఒక వ్యక్తిగత క్రీడాంశంలో అతడిని చేర్పించాలనే తండ్రి ఆలోచన నగాల్‌ను టెన్నిస్‌ వైపు నడిపించింది. రెండేళ్లు స్థానిక క్లబ్‌లో అతను టెన్నిస్‌ నేర్చుకున్నాడు. అయితే పదేళ్ల వయసులో ఒక ఘటన నగాల్‌ కెరీర్‌ను మార్చింది.

అప్పటికే భారత టాప్‌ టెన్నిస్‌ ప్లేయర్‌గా గుర్తింపు తెచ్చుకున్న మహేశ్‌ భూపతి తన అకాడమీలో శిక్షణ ఇచ్చేందుకు ప్రతిభాన్వేషణ కార్యక్రమం నిర్వహించాడు. చాలా మందితో పాటు అతను కూడా సెలక్షన్స్‌కు హాజరయ్యాడు. అందరిలాగే హిట్టింగ్‌ చేస్తూ వచ్చాడు. కానీ భూపతి దృష్టి నగాల్‌పై పడలేదు. చాలాసేపటి తర్వాత ఆ పదేళ్ల కుర్రాడు ధైర్యం చేసి నేరుగా భూపతి వద్దకే వెళ్లాడు. ‘సర్, కాస్త నా ఆట కూడా చూడండి’ అని కోరాడు. ఆశ్చర్యపడ్డ భూపతి అతనిలోని పట్టుదలను గమనించి ప్రత్యేకంగా నగాల్‌తో ప్రాక్టీస్‌ చేయించాడు. వెంటనే అతని ఆట ఆకట్టుకోవడంతో తన ఎంపిక పూర్తయింది. ‘నేను ఆ ఒక్క మాట ఆ రోజు అనకుండా ఉంటే నన్ను ఎవరూ పట్టించుకోకపోయేవారేమో. ఎందుకంటే అంత డబ్బు పెట్టి మావాళ్లు  టెన్నిస్‌ నేర్పించలేకపోయేవారు’ అని నగాల్‌ గుర్తు చేసుకుంటాడు.

అది ఆ అకాడమీకి మొదటి బ్యాచ్‌. బెంగళూరులో రెండేళ్ల శిక్షణ తర్వాత భూపతి అకాడమీ కార్యకలాపాలు ఆగిపోయినా.. అప్పటికే మెరుగుపడ్డ నగాల్‌ ప్రదర్శన అతనికి సరైన దిశను చూపించింది. కుటుంబ మిత్రుల సహకారంతో విదేశాల్లో మరింత మెరుగైన శిక్షణతో అతని ఆట రాటుదేలింది. క్రికెట్‌పై తన చిన్ననాటి ఇష్టాన్ని వదులుకోని నగాల్‌.. తర్వాతి రోజుల్లో ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ఆడేందుకు వెళ్లి మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌ నెట్స్‌లో క్రికెట్‌ ఆడి తన సరదా తీర్చుకోగలిగాడు. 

జూనియర్‌ గ్రాండ్‌స్లామ్‌తో..
18 ఏళ్ల వయసులో నగాల్‌ ప్రొఫెషనల్‌గా మారాడు. హైదరాబాద్‌లో జరిగిన ఐటీఎఫ్‌ టోర్నీలో విజయం సాధించి కెరీర్‌లో తొలి టైటిల్‌ని అతను తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత కొద్ది రోజులకే ఒక మేజర్‌ టోర్నీ విజయం నగాల్‌కు గుర్తింపు తెచ్చింది. 2015 జూనియర్‌ వింబుల్డన్‌ డబుల్స్‌లో (భాగస్వామి వియత్నాం ఆటగాడు హోంగా నామ్‌) నగాల్‌ విజేతగా నిలిచాడు. జూనియర్‌ గ్రాండ్‌స్లామ్‌ నెగ్గిన ఆరో భారత ఆటగాడిగా పేరొందాడు. కెరీర్‌లో ఎదిగే క్రమంలో మూడేళ్ల వ్యవధిలో 9 ఐటీఎఫ్‌ ఫ్యూచర్‌ టైటిల్స్‌ను అతను తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే చెప్పుకోదగ్గ మలుపు ఏటీపీ చాలెంజర్‌ టోర్నీ రూపంలో వచ్చింది. 2017లో బెంగళూరులో నగాల్‌ తన తొలి చాలెంజర్‌ టైటిల్‌ సాధించాడు. ఆ తర్వాత రెండేళ్లకు అర్జెంటీనాలో బ్యూనస్‌ ఎయిరీస్‌ టోర్నీ రెండో టైటిల్‌ రూపంలో చేరింది. అయితే ఆ తర్వాత అంతా ఒక్కసారిగా మారిపోయింది. 

పరాజయాల బాటను వీడి..
నాలుగేళ్ల పాటు నగాల్‌ కెరీర్‌ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. దాదాపు రెండేళ్లు కోవిడ్‌ సమయంలోనే వెళ్లిపోగా.. మిగిలిన రెండేళ్లలో అతనికి గాయాలు, వాటికి శస్త్రచికిత్సలు. ఫామ్‌ కోల్పోయి మానసికంగా కూడా కుంగుబాటుకు గురైన స్థితి. టోక్యో ఒలింపిక్స్‌లోనూ ప్రభావం చూపలేకపోయాడు. వీటికి తోడు అఖిల భారత టెన్నిస్‌ సంఘం (ఏఐటీఏ) నుంచి క్రమశిక్షణరాహిత్యం ఆరోపణలు. ఇలాంటివాటిని దాటి గత ఏడాది నగాల్‌ మళ్లీ సరైన దారిలో పడ్డాడు. అప్పటి వరకు ఉన్న పరిస్థితులను బట్టి చూస్తే  2023లో నగాల్‌ సాధించిన విజయాలు అతని కెరీర్‌లో ఎంతో విలువైనవిగా కనిపిస్తాయి.  ఇటలీ, ఫిన్లండ్‌ చాలెంజర్‌ టోర్నీ టైటిల్స్, మరో రెండు టోర్నీలు ఆస్ట్రియా, హెల్సింకీలలో రన్నరప్‌ నగాల్‌కు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చాయి.

ఇక ఈ ఏడాదికి వచ్చే సరికి అతని ఆట మరింత పదునెక్కింది. గ్రాండ్‌స్లామ్‌ టోర్నీ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ తొలి రౌండ్‌లో అలెగ్జాండర్‌ బబ్లిక్‌పై సంచలన విజయం సాధించిన నగాల్‌.. 1989 (రమేశ్‌ కృష్ణన్‌) తర్వాత గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో ఒక సీడెడ్‌æఆటగాడిని ఓడించిన తొలి భారతీయుడిగా నిలవడం విశేషం. ఆపై కొద్దిరోజులకే చెన్నై ఓపెన్‌ చాలెంజర్‌ టోర్నీలో చాంపియన్‌గా సొంతగడ్డపై తొలి టైటిల్‌తో నగాల్‌ విజయనాదం చేశాడు. కొన్నాళ్ల క్రితం ఆటనే వదిలేయాలనుకున్న వ్యక్తి.. ప్రతికూలతలపై పోరాడి ఇప్పుడు సాధిస్తున్న విజయాలను చూస్తుంటే.. ఆ పట్టుదలకున్న పదును అర్థమవుతోంది. ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే రాబోయే రోజుల్లో కూడా నగాల్‌ తన ప్రదర్శనతో మరిన్ని అద్భుతాలు చేయగలడని భారత టెన్నిస్‌ ప్రపంచం విశ్వసిస్తోంది. 

Advertisement
Advertisement