
దుబాయ్: ప్రపంచ టెస్టు చాంపియన్‌షషిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ మ్యాచ్‌ను పర్యవేక్షించే అధికారుల వివరాలను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) శుక్రవారం ప్రకటించింది. భారత జట్టు మాజీ పేస్ బౌలర్, అనుభవజ్ఞుడైన జవగళ్ శ్రీనాథ్‌కు గొప్ప గౌరవం లభించింది. జూన్ 11 నుంచి 15వ తేదీ వరకు లండన్‌లోని విఖ్యాత లార్డ్స్ మైదానంలో డిఫెండింగ్ చాంపియన్ ఆ్రస్టేలియా, తొలిసారి తుది పోరుకు చేరిన దక్షిణాఫ్రికా జట్ల మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
ఈ ప్రతిష్టాత్మక పోరుకు శ్రీనాథ్ మ్యాచ్ రిఫరీగా వ్యవహరిస్తాడని ఐసీసీ తెలిపింది. ఆన్ ఫీల్డ్ అంపైర్లుగా రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ (ఇంగ్లండ్), క్రిస్ గాఫెనె (న్యూజిలాండ్)... టీవీ అంపైర్‌గా రిచర్డ్ కెటెల్‌బొరో (ఇంగ్లండ్)... ఫోర్త్ అంపైర్‌గా నితిన్ మీనన్ (భారత్) పేర్లను ఐసీసీ ఖరారు చేసింది. మూడు డబ్ల్యూటీసీ ఫైనల్స్‌లో ఆన్ ఫీల్డ్ అంపైర్‌గా వ్యవహరించిన తొలి అంపైర్‌గా ఇల్లింగ్‌వర్త్ గుర్తింపు పొందనున్నాడు. 2021, 2023 డబ్ల్యూటీసీ ఫైనల్స్‌లోనూ ఇల్లింగ్‌వర్త్ అంపైర్‌గా వ్యవహరించాడు.