
టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ బాస్ సౌరవ్ గంగూలీ మరోసారి బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (CAB) అధ్యక్ష పదవి కోసం పోటీ పడనున్నాడు. ఈ విషయాన్ని అతనే స్వయంగా మీడియాకు వెల్లడించాడు. గంగూలీ 2015–2019 మధ్యలో క్యాబ్ అధ్యక్షుడిగా పని చేశాడు.
ఆతర్వాత బీసీసీఐ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాడు. బీసీసీఐ బాస్ హోదాలో గంగూలీ మూడేళ్లు (2019-2022) ఉన్నాడు. తన హయాంలో గంగూలీ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చాడు.
ప్రస్తుతం క్యాబ్ అధ్యక్షుడిగా సౌరవ్ గంగూలీ అన్న స్నేహశిష్ గంగూలీ ఉన్నాడు. అతని పదవీకాలం త్వరలోనే ముగియనుంది. స్నేహశిష్‌కు క్యాబ్ అధ్యక్షుడిగా కొనసాగాలని ఉన్నా, లోథా కమిటీ సిఫార్సుల ప్రకారం అది సాధ్యపడదు. దీంతో సౌరవ్ గంగూలీ బరిలోకి దిగుతున్నాడు.
సౌరవ్ గంగూలీకి క్యాబ్‌లో మంచి పట్టు ఉండటంతో అతని ఎన్నిక ఏకగ్రీవమయ్యే అవకాశం ఉంది. గంగూలీ ఇప్పటికే నామినేషన్ దాఖలు చేసినట్లు తెలుస్తుంది. సెప్టెంబర్ 25న క్యాబ్ వార్షిక సమావేశం జరగనుంది. అంతకుముందే అధ్యక్ష ఎన్నికకు సంబంధించిన షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశం ఉంది.
ప్రస్తుతం సౌరవ్ గంగూలీ ఢిల్లీ క్యాపిటల్స్‌కు (ఐపీఎల్) డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా పని చేస్తున్నాడు. ఒకవేళ క్యాబ్ అధ్యక్షుడిగా ఎన్నికైతే ఈ పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది.