శుభారంభంపై సింధు దృష్టి | Sindhu, Lakshya aim to make amends after poor run since Olympics | Sakshi
Sakshi News home page

శుభారంభంపై సింధు దృష్టి

Nov 12 2024 8:53 AM | Updated on Nov 12 2024 8:53 AM

Sindhu, Lakshya aim to make amends after poor run since Olympics

నేటి నుంచి జపాన్‌ మాస్టర్స్‌ టోర్నీ  

కుమమొటో: భారత స్టార్‌ షట్లర్లు పూసర్ల వెంకట (పీవీ) సింధు, లక్ష్యసేన్‌ వైఫల్యాలను అధిగమించి టైటిళ్ల వేటలో పడాలనే పట్టుదలతో జపాన్‌ ఓపెన్‌ టోర్నీ బరిలోకి దిగుతున్నారు. నేటి నుంచి జపాన్‌ మాస్టర్స్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–500 టోర్నమెంట్‌ జరగనుంది. ఇద్దరు భారత అగ్రశ్రేణి షట్లర్లు పారిస్‌ ఒలింపిక్స్‌ తర్వాత బరిలోకి దిగిన ఏ టోర్నీలోనూ చెప్పుకోదగ్గ ప్రదర్శనే చేయలేకపోయారు. 

గతంలో ఒక సీజన్‌లో వరుస టైటిల్స్‌ సాధించిన వారు ఇప్పుడు కనీసం క్వార్టర్‌ ఫైనల్‌ దశను దాటలేకపోవడం ఇబ్బందికరంగా మారింది. రెండు ఒలింపిక్‌ పతకాల విజేత, ఆంధ్రప్రదేశ్‌ వెటరన్‌ స్టార్‌ పీవీ సింధు ఫిన్‌లాండ్‌లో జరిగిన ఆర్క్‌టిక్‌ ఓపెన్‌లో తొలి రౌండ్లోనే విఫలమైనా... డెన్మార్క్‌ ఓపెన్‌లో మాత్రం క్వార్టర్‌ ఫైనల్‌ చేరింది. 

కానీ లక్ష్యసేన్‌ మాత్రం ఈ రెండు టోర్నీల్లో ఆరంభ రౌండ్లలోనే కంగుతిని ఇంటిదారి పట్టాడు. బుధవారం జరిగే మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్లో 29 ఏళ్ల సింధు... థాయ్‌లాండ్‌కు చెందిన ఎనిమిదో సీడ్‌ బుసానన్‌తో తలపడనుండగా, పురుషుల ఈవెంట్‌లో 23 ఏళ్ల లక్ష్యసేన్‌ మలేసియాకు చెందిన లియోంగ్‌ జున్‌ హవొను ఎదుర్కొంటాడు. తొలి రౌండ్‌ అడ్డంకిని అధిగమిస్తే... అతను రెండో రౌండ్లో ఎనిమిదో సీడ్‌ ఆంథోనీ గిన్‌టింగ్‌ (ఇండోనేసియా)తో పోటీపడే అవకాశముంది. ఇక డబుల్స్‌లో ఒకే ఒక్క భారత జోడీ బరిలో ఉంది. 

పుల్లెల గాయత్రి గోపీచంద్‌–ట్రెసా జాలీ జంట మహిళల డబుల్స్‌ మొదటి రౌండ్లో చైనీస్‌ తైపీకి చెందిన సూ యిన్‌ హూ–లిన్‌ జి యున్‌ జోడీతో తలపడుతుంది. కొత్త కోచ్‌ల మార్గదర్శనంలో టోర్నీ కోసం సిద్ధమైనట్లు సింధు చెప్పింది. ‘నేనిపుడు బాగా ఆడుతున్నాను. శారీరకంగా, మానసికంగానూ దృఢంగా ఉన్నాను. కొన్ని లోపాలపై కసరత్తు చేశాం. కోర్టులో డిఫెన్స్, స్పీడ్‌ మెరుగుపర్చుకునేందుకు ఇటీవల బాగా శ్రమించాను. జపాన్‌తో పాటు త్వరలో చైనాలో జరిగే టోరీ్నలోనూ రాణిస్తాను’ అని సింధు ఆశాభావం వ్యక్తం చేసింది. ప్రస్తుతం కొరియన్‌ దిగ్గజం, కోచ్‌ లీ స్యూన్, అనూప్‌ శ్రీధర్‌లతో ఆమె శిక్షణ తీసుకుంటుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement