
ముంబై: ఆసియా రగ్బీ ఎమిరేట్స్ సెవెన్స్ ట్రోఫీలో భారత మహిళల జట్టు రజత పతకం కైవసం చేసుకుంది. నేపాల్‌లో జరిగిన ఈ టోర్నీ ఫైనల్లో భారత్ 5–7 పాయింట్ల తేడాతో ఫిలిప్పీన్స్ చేతిలో ఓటమి పాలైంది. శిఖా యాదవ్ సారథ్యంలోని భారత జట్టు అంతకుముందు సెమీఫైనల్లో 24–7 తేడాతో గువామ్‌పై గెలిచి పట్టికలో అగ్రస్థానంతో తుదిపోరుకు చేరింది.
లీగ్ దశలో భారత్ 29–10 తేడాతో శ్రీలంకపై... 17–10తో ఇండోనేసియాపై గెలిచి సంపూర్ణ ఆధిపత్యం కనబర్చింది. ఈ టోర్నీలో మరోసారి రజతం గెలవడం ఆనందంగా ఉందని శిఖా యాదవ్ పేర్కొంది.
‘ప్లేయర్లంతా సమష్టిగా సత్తా చాటారు. కఠిన ప్రత్యర్థులపై చక్కటి ప్రదర్శన కనబర్చడం వల్లే రజత పతకం సాధించగలిగాం. సహచరుల ఆటతీరుతో గర్వపడుతున్నా. ఈ విజయంలో కోచ్‌లతోపాటు సహాయక సిబ్బంది పాత్ర ఎంతో ఉంది’అని శిఖా యాదవ్ చెప్పింది.