థ్యాంక్యూ యువీ భయ్యా.. ఇదంతా నీ వల్లే

Shumban Gill Thanks Yuvraj Singh Giving Absolute Training Before IPL - Sakshi

ఢిల్లీ: టీమిండియా యువ ఆటగాడు శుబ్‌మన్‌ గిల్‌ భారత మాజీ డాషింగ్‌ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌కు థ్యాంక్స్‌ చెప్పుకున్నాడు. ఆసీస్‌ సిరీస్‌లో రాణించడానికి యువీ ఇచ్చిన ట్రైనింగ్‌ ఎంతగానో ఉపయోగపడిందని తెలిపాడు. ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్య్వూలో గిల్‌ ఈ వ్యాఖ్యలు చేశాడు.

'ఐపీఎల్‌ ప్రారంభానికి ముందు యువీ ఇచ్చిన ట్రైనింగ్‌ ఎంతగానో ఉపయోగపడింది. క్యాంప్‌లో భాగంగా వందల సంఖ్యలో షార్ట్‌ పిచ్‌ బంతులు విసిరి నాతో బ్యాటింగ్‌ ప్రాక్టీస్‌ చేయించాడు. భుజానికి ఎత్తుగా వచ్చే బంతులను ఎలా సమర్థంగా ఆడాలనేది నేర్పించాడు. అంతేగాక వివిధ యాంగిల్స్‌లో బంతులు విసురుతూ బ్యాటింగ్‌ స్కిల్స్‌ను మరింత మెరుగయ్యేలా చేశాడు. యూవీ ట్రైనింగ్‌తోనే ఆసీస్‌ సిరీస్‌లో కమిన్స్‌, హాజిల్‌వుడ్‌, మిచెల్‌ స్టార్క్‌ లాంటి పేసర్ల బంతులను సమర్థంగా ఎదుర్కొగలిగాను. ఐపీఎల్‌కు కూడా యూవీ ఇచ్చిన ట్రైనింగ్‌ ఎంతగానో ఉపయోగపడింది.చదవండి: ఆ ట్రోఫీ గెలవకుంటే కోహ్లి తప్పుకోవాల్సిందే

అరంగేట్రం సిరీస్‌ను ఒక మధురానుభూతిగా మలుచుకోవడంతో మనసు ప్రశాంతంగా ఉంది. నా డెబ్యూ సిరీస్‌లోనే మంచి పరుగులు చేయడం ఆనందాన్నిచ్చింది. ఐపీఎల్‌.. ఆ తర్వాత ఆసీస్‌ సిరీస్‌తో ఆరు నెలల పాటు ఇంటికి దూరంగా ఉండాల్సి వచ్చింది. ఈ ఆరు నెలల్లో ఇంటి ఫుడ్‌ను చాలా మిస్సయ్యాను. ఇంగ్లండ్‌తో టూర్‌ ప్రారంభానికి ముందు కొన్ని రోజులు విశ్రాంతి దొరకడంతో అమ్మ చేతి వంటను ఆస్వాధించాలనుకుంటున్నా. ఇక నా తర్వాతి గోల్‌.. ఇంగ్లండ్‌తో సిరీస్‌.. ఈ సిరీస్‌లో కూడా స్థిరమైన ప్రదర్శన కనబరిచి పరుగులు రాబట్టాలని ఉత్సుకతతో ఉన్నా. జేమ్స్‌ అండర్సన్‌, స్టువర్ట్‌ బ్రాడ్‌, జోఫ్రా ఆర్చర్‌ లాంటి సీమర్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నా.. ఈ సందర్భంగా యువీ భయ్యాకి మరోసారి థ్యాంక్స్‌ చెప్పుకుంటున్నా'అంటూ తెలిపాడు.

కాగా బోర్డర్‌ గవాస్కర్‌ సిరీస్‌లో మూడు టెస్టు మ్యాచ్‌లు కలిపి గిల్‌ 51 యావరేజ్‌తో 259 పరుగులు చేశాడు. టీమిండియా తరపున అత్యధిక పరుగులు సాధించిన రిషబ్‌ పంత్‌(274), పుజారా(271), రహానే(268) తర్వాతి స్థానంలో​ నిలిచాడు. కాగా గబ్బా వేదికగా జరిగిన నాలుగో టెస్టులో రెండో ఇన్నింగ్స్‌లో 91 పరుగులు చేసిన గిల్‌ టీమిండియా విజయంలో కీలకపాత్ర పోషించాడు. అయితే గిల్‌ సెంచరీ మిస్‌ చేసుకోవడంపై అతని తండ్రి లఖ్వీందర్‌ సింగ్‌ నిరాశకు గురైన సంగతి తెలిసిందే.
చదవండి: 'నట్టూ.. నీకు కెప్టెన్‌ అయినందుకు గర్విస్తున్నా'

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top