దుమ్మురేపుతున్న షమీ.. ప్రొఫెషనల్‌ క్రికెట్‌లో అరుదైన ఫీట్‌ | Shami-Completed-900 Wickets-Professional-Cricket-Duleep-Trophy-2026 | Sakshi
Sakshi News home page

దుమ్మురేపుతున్న షమీ.. ప్రొఫెషనల్‌ క్రికెట్‌లో అరుదైన ఫీట్‌

Aug 31 2026 5:26 PM | Updated on Aug 31 2026 6:17 PM

Shami-Completed-900 Wickets-Professional-Cricket-Duleep-Trophy-2026

భార‌త జ‌ట్టులో చోటు కోల్పోయిన‌ప్ప‌టికీ సీనియ‌ర్ బౌల‌ర్ మ‌హ్మ‌ద్ ష‌మీ దేశ‌వాళీ క్రికెట్‌లో త‌న బౌలింగ్‌తో దుమ్మురేపుతున్నాడు. తాజాగా దులీప్ ట్రోఫీ సెమీఫైనల్లో ఈస్ట్ జోన్ తరఫున ఆడుతున్న షమీ.. సెంట్రల్ జోన్‌పై రెండు వికెట్లు తీసి ప్రొఫెషనల్ క్రికెట్‌లో 900 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. 

ప్రస్తుతం ఫస్ట్‌క్లాస్, లిస్ట్-ఎ, టీ20 ఫార్మాట్లలో కలిపి షమీ  900 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా భారత్ తరఫున ప్రొఫెషనల్ క్రికెట్‌లో 900 వికెట్లు సాధించిన ఆరో బౌలర్‌గా షమీ రికార్డులకెక్కాడు. ఇక షమీ ఖాతాలో ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో 379 వికెట్లు, లిస్ట్-ఏ క్రికెట్‌లో 283 వికెట్లు, టీ20ల్లో 238 వికెట్లు పడగొట్టాడు.

ఇక ప్రొఫెషనల్ క్రికెట్‌లో భారత పేసర్లలో కపిల్ దేవ్ అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా తొలి స్థానంలో ఉన్నాడు. కపిల్‌దేవ్ ఖాతాలో 1170 వికెట్లు ఉన్నాయి. రెండో స్థానంలో జహీర్ ఖాన్ (1168 వికెట్లు), జయదేవ్ ఉనద్కత్ (941 వికెట్లతో) మూడవ స్థానంలో ఉన్నాడు. జవగల్ శ్రీనాథ్ 940 వికెట్లతో నాలుగవ స్థానం, వినయ్ కుమార్ 923 వికెట్లతో ఐదో స్థానంలో కొనసాగుతున్నాడు.

షమీ చివరిసారిగా గతేడాది ఛాంపియన్స్ ట్రోఫీలో భారత జెర్సీలో ఆడాడు. అప్పటి నుంచి అతనికి జాతీయ జట్టులో అవకాశం రాలేదు. గాయం నుంచి కోలుకున్నప్పటికీ.. హెడ్‌కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్‌ అజిత్ అగార్కర్ యువ ఆటగాళ్లపైనే దృష్టి సారించడంతో షమీని పట్టించుకోవడం లేదు.

ఇక బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ 900 వికెట్ల మార్క్ అందుకున్న షమీకి కృతజ్ఞతలు తెలిపింది. "మహ్మద్ షమీకి అభినందనలు. ప్రొఫెషనల్ క్రికెట్‌లో 900 వికెట్లు తీసిన ఆరో భారత పేసర్‌గా నిలవడం అంత సులభం కాదు. షమీ ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో 379 వికెట్లు, లిస్ట్ ఎ క్రికెట్‌లో 283, టీ20లలో 238 వికెట్లు పడగొట్టాడు. అతని ఈ ఘనతకు బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ గర్విస్తోంది." అని పేర్కొంది.

Read: జ‌కోవిచ్.. ప్లీజ్ రిటైరవ్వు; ఇలా చూడ‌లేక‌పోతున్నాం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement