శతక్కొట్టిన తిలక్‌ వర్మ | Duleep Trophy 2026 NZONE Vs SZONE: Tilak Varma Slams Century | Sakshi
Sakshi News home page

సెమీ ఫైనల్లో శతక్కొట్టిన తిలక్‌ వర్మ

Aug 31 2026 4:54 PM | Updated on Aug 31 2026 5:57 PM

Duleep Trophy 2026 NZONE Vs SZONE: Tilak Varma Slams Century

Photo Credit: BCCI

నార్త్‌ జోన్‌తో మ్యాచ్‌లో టీమిండియా స్టార్‌, సౌత్‌ జోన్‌ కెప్టెన్‌ తిలక్‌ వర్మ శతక్కొట్టాడు. ఓవైపు వికెట్లు పడుతున్నా పట్టుదలగా నిలబడ్డ ఈ కెప్టెన్‌ సాబ్‌ 218 బంతుల్లో ఎట్టకేలకు వంద పరుగుల మార్కు అందుకున్నాడు. దేశీ రెడ్‌బాల్‌ టోర్నీ దులిప్‌ ట్రోఫీ 2026 రెండో సెమీ ఫైనల్లో భాగంగా సౌత్‌ జోన్‌- నార్త్‌ జోన్‌ బెంగళూరులోని బీసీసీఐ సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌ గ్రౌండ్‌ 2లో తలపడుతున్నాయి.

195 పరుగులకే ఆలౌట్‌ 
ఆదివారం మొదలైన ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన నార్త్‌ జోన్‌ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. ఓపెనర్‌ కమ్రాన్‌ ఇక్బాల్‌ అర్ద శతకం (76)తో ఆకట్టుకోగా.. కెప్టెన్‌ కన్హయ్య వాధ్వాన్‌ 35 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. మిగతా వాళ్లంతా చేతులెత్తేయడంతో నార్త్‌ జోన్‌ తొలి ఇన్నింగ్స్‌లో 195 పరుగులకే ఆలౌట్‌ అయింది.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన సౌత్‌ జోన్‌కు అన్షుల్‌ కాంబోజ్‌ ఆదిలోనే షాకిచ్చాడు. ఓపెనర్‌ రికీ భుయ్‌ను 5 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బౌల్డ్‌ చేశాడు. ఇక వన్‌డౌన్‌లో వచ్చిన షేక్‌ రషీద్‌ డకౌట్‌ అయ్యాడు. గుర్నూర్‌ బ్రార్‌ అతడిని వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు.

 175 పరుగుల భాగస్వామ్యం
ఇలాంటి తరుణంలో మరో ఓపెనర్‌ నారాయణ్‌ జగదీశన్‌ (63 బంతుల్లో 36) కాస్త ఫర్వాలేదనిపించగా.. కెప్టెన్‌ తిలక్‌ వర్మ సౌత్‌ జోన్‌ ఇన్నింగ్స్‌ చక్కదిద్దే బాధ్యత తీసుకున్నాడు. స్మరణ్‌ రవిచంద్రణ్‌ (27)తో కలిసి 37 పరుగులు జోడించిన ఈ లెఫ్టాండర్‌ బ్యాటర్‌.. శ్రేయస్‌ గోపాల్‌తో కలిసి ఏడో వికెట్‌కు ఏకంగా 175 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు.

పాపం శ్రేయస్‌
అయితే, సెంచరీ దిశగా పయనిస్తున్న శ్రేయస్‌ను అర్ష్‌దీప్‌ సింగ్‌ బోల్తా కొట్టించాడు. దీంతో 88 పరుగుల వద్ద శ్రేయస్‌ అవుటయ్యాడు. దీంతో తిలక్‌- శ్రేయస్‌ల భారీ భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత తనయ్‌ త్యాగరాజన్‌ (6).. విద్వత్‌ కావేరప్ప (0), ఎండీ నిధీశ్‌ (0- రనౌట్‌) త్వరత్వరగా పెవిలియన్‌ చేరారు.

ఎట్టకేలకు సెంచరీ
అప్పటికి 91 పరుగుల వద్ద ఉన్న తిలక్‌ వర్మకు కావూరి సాయితేజ తోడయ్యాడు. చేతిలో ఒకే ఒక్క వికెట్‌ ఉండగా.. సాయి తేజ డిఫెన్స్‌ ఆడే ప్రయత్నం చేయగా.. తిలక్‌ వర్మ ఎట్టకేలకు సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఒత్తిడిలోనూ మెరుగ్గా రాణించి శతక మార్కు అందుకున్న తిలక్‌.. జట్టును భారీ ఆధిక్యం దిశగా నడిపిస్తున్నాడు. 

ముగిసిన రెండో రోజు ఆట
ఈ క్రమంలో సోమవారం నాటి ఆట ముగిసే సరికి సౌత్‌ జోన్‌ 94 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 285 పరుగులు చేసింది. తద్వారా తొలి ఇన్నింగ్స్‌లో 90 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. తిలక్‌ వర్మ 106, సాయితేజ సున్నా పరుగులతో అజేయంగా ఉన్నారు.

చదవండి: వైభవ్‌ సూర్యవంశీ వీరవిహారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement