టీమిండియా ఓపెనర్‌ ప్రపంచ రికార్డు.. తొలి ప్లేయర్‌గా | Shafali Verma Goes Past Smriti Mandhana, Sets New World Record In Women’s T20Is | Sakshi
Sakshi News home page

IND vs ZIM: టీమిండియా ఓపెనర్‌ ప్రపంచ రికార్డు.. తొలి ప్లేయర్‌గా

Oct 19 2026 12:33 AM | Updated on Oct 19 2026 12:37 AM

Shafali Verma Goes Past Smriti Mandhana, Sets New World Record In Women’s T20Is

PC: BCCI/X

టీ20 ఫార్మాట్‌లో భారత మహిళల జట్టు ఓపెనర్ షఫాలీ వర్మ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తోంది. ఆదివారం రాయ్‌పూర్ వేదికగా జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో షఫాలీ  విధ్వంసం సృష్టించింది. 103 ప‌రుగుల స్వ‌ల్ప ల‌క్ష్య చేధ‌న‌లో  షఫాలీ  ఆకాశ‌మే హ‌ద్దుగా చెలరేగిపోయింది. ఈ డాషింగ్‌ ఓపెనర్ కేవలం 25 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 55 పరుగులు చేసి ఔటైంది.

షఫాలీ ప్రపంచ రికార్డు
ఈ క్రమంలో 22 ఏళ్ల షఫాలీ ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకుంది. ఒక క్యాలెండర్ ఇయర్‌లో మహిళల టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సార్లు 50 ప్లస్ స్కోర్లు సాధించిన బ్యాటర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఇప్పటివరకు షఫాలీ  ఈ ఏడాది టీ20ల్లో 9 సార్లు ఏభైకి పైగా పరుగులు సాధించింది. ఇంతకుముందు ఈ రికార్డు  భారత  కెప్టెన్ స్మృతి మంధాన పేరిట ఉండేది. . 2024లో మంధాన 8 సార్లు 50 ప్లస్ స్కోర్లు సాధించింది. ఇప్పుడు తాజా ఇన్నింగ్స్‌తో మంధాన ఆల్‌టైమ్ రికార్డును బ్రేక్ చేసింది.

ఒకే క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక 50+ స్కోర్లు చేసిన మహిళా ప్లేయర్లు:
షఫాలీ వర్మ (భారత్) – 9 సార్లు (2026) 
స్మృతి మంధాన (భారత్) – 8 సార్లు (2024)   
నతాషా మైల్స్ (హాంగ్‌కాంగ్) – 8 సార్లు (2026)  
మిథాలీ రాజ్ (భారత్) – 7 సార్లు (2018)

ఇక ఈ మ్యాచ్‌లో షఫాలీతో పాటు కెప్టెన్ మంధాన(47 నాటౌట్‌) కూడా చెలరేగింది. దీంతో 103 పరుగుల లక్ష్యాన్ని భారత్ కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 8.5 ఓవర్లలో ఊదిపడేసింది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో టీ20 మిగిలుండగానే 2-0 తేడాతో టీమిండియా సొంతం చేసుకుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement