source: X
పాకిస్తాన్ టీ20 జట్టు తాజా మాజీ కెప్టెన్ సల్మాన్ అఘా చెలరేగిపోయాడు. వన్డే ట్రై సిరీస్‌లో (స్వదేశంలో) భాగంగా శ్రీలంకతో ఇవాళ జరుగుతున్న మ్యాచ్‌లో కేవలం 82 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. తద్వారా తన వన్డే కెరీర్లో ఫాస్టెస్ట్ సెంచరీని నమోదు చేశాడు.
అఘాను ఇటీవలే టీ20 కెప్టెన్సీ నుంచి తప్పించారు. కెప్టెన్సీ కోల్పోయిన తర్వాత ఆడిన తొలి మ్యాచ్‌లోనే ఈ ఘనత సాధించడం విశేషం. ఈ మ్యాచ్‌లో అఘా మొత్తంగా 90 బంతులు ఎదుర్కొని 10 ఫోర్లు, సిక్సర్ సాయంతో 107 పరుగులు చేశాడు. అతడికి వన్డేల్లో ఇది నాలుగో శతకం.
తాజా సెంచరీ తర్వాత ఆఘా ప్రత్యేక సంబరాలు చేసుకున్నాడు. గ్లౌవ్ తీసి కుడి కంటి పక్కన వేలును ఉంచుతూ తనదైన శైలిలో సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ సంబరాలు తన కెప్టెన్సీ తొలగింపుకు సమాధానమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
దేశవాళీ క్రికెట్లోనూ అదరగొట్టాడు
ఇటీవలికాలంలో ఆఘాకు పరిస్థితులు అనుకూలంగా లేవు. ఇంగ్లండ్ పర్యటన మధ్యలోనే అతడిని స్వదేశానికి పంపించారు. ఆ తర్వాత టీ20 జట్టు కెప్టెన్సీ నుంచి తొలగించి, ఆ బాధ్యతలను సాహిబ్జాదా ఫర్హాన్‌కు అప్పగించారు.
అయినప్పటికీ ఆఘా నిరాశ చెందకుండా దేశవాళీ క్రికెట్‌పై దృష్టి పెట్టాడు. ప్రెసిడెంట్స్ ట్రోఫీలో ఎనిమిది ఇన్నింగ్స్‌ల్లో 95.33 సగటుతో 572 పరుగులు సాధించాడు. ఇందులో ట్రిపుల్ సెంచరీ, ఒక సెంచరీ, ఒక అర్ధ సెంచరీ ఉన్నాయి.
మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ భారీ స్కోర్ (49.5 ఓవర్లలో 305 ఆలౌట్) చేసింది. సల్మాన్ అఘా (107) సెంచరీతో కదంతొక్కగా.. బాబర్ ఆజం (45), సాద్ బేగ్ (39), హసన్ నవాజ్ (37) ఓ మోస్తరు స్కోర్లు చేశారు.
లంక బౌలర్లలో ఎషాన్ మలింగ 4, అశిత ఫెర్నాండో 3, దిల్షన్ మధుషంక 2 వికెట్లు తీశారు. కాగా, ఈ ట్రై సిరీస్‌లో ఇదే తొలి మ్యాచ్. ఈ టోర్నీలో పాక్, శ్రీలంకతో పాటు ఇంగ్లండ్ పాల్గొంటుంది.
ఇదీ చదవండి: ODI Tri Series: చరిత్ర సృష్టించిన బాబర్ ఆజం


