source: X
పాకిస్తాన్ స్టార్ బ్యాటర్ బాబర్ ఆజం సరికొత్త చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ క్రికెట్లో మూడో స్థానంలో 8000 పరుగులు (మూడు ఫార్మాట్లలో) పూర్తి చేసుకున్న తొలి పాకిస్తానీ బ్యాటర్గా అవతరించాడు. స్వదేశంలో జరుగుతున్న వన్డే ట్రై సిరీస్లో భాగంగా శ్రీలంకతో ఇవాళ జరుగుతున్న మ్యాచ్లో ఈ ఘనత సాధించాడు.
ఈ మ్యాచ్లో 45 పరుగులు చేసి ఔటైన బాబర్, పాక్ తరఫున మూడో స్థానంలో తన పరుగుల సంఖ్యను 8002కు పెంచుకున్నాడు. బాబర్ తర్వాత ఈ స్థానంలో పాక్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లుగా యూనిస్ ఖాన్ (7717), అజర్ అలీ (5615) ఉన్నారు.
16000 పరుగులు పూర్తి
ఈ ఇన్నింగ్స్తో బాబర్ మరో అరుదైన మైలురాయిని కూడా తాకాడు. అంతర్జాతీయ క్రికెట్లో 16000 పరుగులు పూర్తి చేసుకున్న ఐదో పాకిస్తాన్ క్రికెటర్గా నిలిచాడు. ఇంతకుముందు ఇంజమామ్ ఉల్ హక్, యూనిస్ ఖాన్, మహమ్మద్ యూసుఫ్, జావెద్ మియాందాద్ పాక్ తరఫున ఈ ఘనత సాధించారు.
బాబర్ తన 355వ అంతర్జాతీయ ఇన్నింగ్స్లో ఈ మైలురాయిని చేరుకున్నాడు. ఇప్పటివరకు అతడి ఖాతాలో 32 సెంచరీలు, 111 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఓవరాల్గా అంతర్జాతీయ క్రికెట్లో 16 వేల పరుగులు పూర్తి చేసిన 35వ ఆటగాడిగా బాబర్ రికార్డుల్లోకెక్కాడు.
పాక్ తరఫున అత్యధిక అంతర్జాతీయ పరుగులు
ఇంజమామ్ ఉల్ హక్ – 20541 పరుగులు
యూనిస్ ఖాన్ – 17790 పరుగులు
మహమ్మద్ యూసుఫ్ – 17134 పరుగులు
జావెద్ మియాందాద్ – 16213 పరుగులు
బాబర్ ఆజమ్ – 16007 పరుగులు
మూడు ఫార్మాట్లలోనూ సత్తా
2015లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన బాబర్.. 11 ఏళ్లలోనే పై ఘనత సాధించాడు. వన్డేల్లో 144 మ్యాచ్ల్లో 6633 పరుగులు.. టెస్టుల్లో 66 మ్యాచ్ల్లో 4771 పరుగులు.. టీ20 అంతర్జాతీయాల్లో 145 మ్యాచ్ల్లో 4596 పరుగులు చేశాడు.
మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన పాకిస్తాన్ 37 ఓవర్లు ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. ఫకర్ జమాన్ (6), సైమ్ అయూబ్ (7), బాబర్ ఆజం (45), సాద్ బేగ్ (39) ఔట్ కాగా.. హసన్ నవాజ్ (37), సల్మాన్ అఘా (57) క్రీజ్లో ఉన్నారు. కాగా, ఈ ట్రై సిరీస్లో పాక్, శ్రీలంకతో పాటు ఇంగ్లండ్ జట్టు బరిలో ఉంది.
ఇదీ చదవండి: వరుసగా రెండో మ్యాచ్లో శతక్కొట్టిన రింకూ


