PC: X
రాయ్పూర్ వేదికగా శుక్రవారం జింబాబ్వేతో జరిగిన తొలి టీ20లో భారత మహిళల జట్టు 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో మూడు మ్యాచ్ల సిరీస్లో భారత్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది.
జింబాబ్వే బ్యాటర్లలో కెలిస్ ఎండ్లోవు (44 బంతుల్లో 42), షార్నే మేయర్స్ (33 బంతుల్లో 43 నాటౌట్) రాణించారు. భారత బౌలర్లలో నందిని శర్మ రెండు వికెట్లు పడగొట్టగా.. షెఫాలీ వర్మ, అరుంధతి రెడ్డి, శ్రీచరణి తలా వికెట్ సాధించారు.
అరంగేట్రంలో అదుర్స్
అనంతరం 115 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టుకు జింబాబ్వే రైటార్మ్ స్పిన్నర్ నిషా గ్వాంజురా బిగ్ షాకిచ్చింది. కెప్టెన్ స్మృతి మంధానతో పాటు షెఫాలీ వర్మ, అనుష్కశర్మ(4)లను ఆరంభంలోనే నిషా గ్వాంజురా పెవిలియన్కు పంపింది.
మాజీ కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కూడా కేవలం ఒక్క పరుగు చేసి ఔటయైంది. దీంతో భారత్ కేవలం 19 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో స్టార్ ఆల్రౌండర్ దీప్తి శర్మ (49), అరంగేట్ర బ్యాటర్ నికి ప్రసాద్ (39 నాటౌట్) బాధ్యతాయుతంగా ఆడి జట్టును ఆదుకున్నారు. ఫలితంగా ఈ స్వల్ప లక్ష్యాన్ని ఉమెన్ ఇన్ బ్లూ 15.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి చేధించింది.
చదవండి: మొయిన్ అలీ మెరుపులు.. ఫైనల్లో ఇంగ్లండ్.. ఏబీడీకి షాక్!


