మొయిన్‌ అలీ మెరుపులు.. ఫైనల్లో ఇంగ్లండ్‌.. ఏబీడీకి షాక్‌! | WCL 2026: Moeen Ali Shines England Beat South Africa Enters Final | Sakshi
Sakshi News home page

మొయిన్‌ అలీ మెరుపులు.. ఫైనల్లో ఇంగ్లండ్‌.. ఏబీడీకి షాక్‌!

Oct 16 2026 9:30 PM | Updated on Oct 16 2026 9:30 PM

WCL 2026: Moeen Ali Shines England Beat South Africa Enters Final

PC: WCL X

వరల్డ్‌ చాంపియన్స్‌ ఆఫ్‌ లెజెండ్స్‌-2026 టీ20 టోర్నమెంట్‌ లీగ్‌ దశలో అజేయంగా నిలిచిన సౌతాఫ్రికా చాంపియన్స్‌ అసలు పోరులో తుస్సుమంది. ఇంగ్లండ్‌ చాంపియన్స్‌తో జరిగిన సెమీ ఫైనల్లో 46 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

గ్రూప్‌ దశలో ఐదింట ఐదు గెలిచి
షార్జా వేదికగా అక్టోబరు 3న మొదలైన ఈ టీ20 లీగ్‌లో గ్రూప్‌ దశలో సౌతాఫ్రికా ఐదింట ఐదు మ్యాచ్‌లు గెలిచి.. అజేయంగా సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది. మరోవైపు.. ఇంగ్లండ్‌ ఐదింట కేవలం రెండు గెలిచినా.. ఇండియా చాంపియన్స్‌, బంగ్లాదేశ్‌ చాంపియన్స్‌ పేలవ ప్రదర్శన కారణంగా ఎలాగోలా సెమీస్‌ చేరింది.

ఈ క్రమంలో తొలి సెమీ ఫైనల్లో సౌతాఫ్రికా- ఇంగ్లండ్‌ శుక్రవారం తలపడ్డాయి. షార్జా క్రికెట్‌ స్టేడియంలో టాస్‌ గెలిచిన సౌతాఫ్రికా తొలుత బౌలింగ్‌ ఎంచుకోగా.. ఇంగ్లండ్‌ బ్యాటింగ్‌కు దిగింది. టాపార్డర్‌లో ఓపెనర్లు కెప్టెన్‌ రవి బొపారా (8), డేవిడ్‌ మలన్‌ (2) విఫలం కాగా.. జేసన్‌ రాయ్‌ (17) కూడా నిరాశపరిచాడు.

మొయిన్‌ అలీ, జో డెన్లీ ధనాధన్‌ అర్ధ శతకాలు
ఇలాంటి తరుణంలో నాలుగు, ఐదు స్థానాల్లో వచ్చిన మొయిన్‌ అలీ, జో డెన్లీ ధనాధన్‌ దంచికొట్టి అర్ధ శతకాలు సాధించారు. అలీ 41 బంతుల్లో మూడు ఫోర్లు, ఆరు సిక్సర్లు బాది 70 పరుగులు చేయగా.. డెన్లీ 30 బంతుల్లోనే ఐదు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 59 పరుగులు చేశాడు. మిగిలిన వారిలో టోబీ రొలాండ్‌-జోన్స్‌ (13 బంతుల్లో 22) రాణించాడు.

ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో ఇంగ్లండ్‌ చాంపియన్స్‌ ఎనిమిది వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. సౌతాఫ్రికా బౌలర్లలో రోబీ ఫ్రైలింక్‌ మూడు వికెట్లు తీయగా.. హార్డస్‌ విల్‌జోయిన్‌, ఆరోన్‌ ఫంగిసో చెరో రెండు.. వేన్‌ పార్నెల్‌ ఒక వికెట్‌ పడగొట్టారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన సౌతాఫ్రికా చాంపియన్స్‌ 16.5 ఓవర్లలో కేవలం 143 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది.

కుప్పకూలిన ప్రొటిస్‌ బ్యాటింగ్‌  ఆర్డర్‌
ఓపెనర్లు కెప్టెన్‌ ఏబీ డివిలియర్స్‌ (13 బంతుల్లో 25), ఫాఫ్‌ డుప్లెసిస్‌ (13 బంతుల్లో 25) వేగంగా ఆడి శుభారంభం అందించగా.. మిగిలిన వారు దానిని కొనసాగించలేకపోయారు. గత మ్యాచ్‌లలో అదరగొట్టిన జేపీ డుమిని (4) ఈసారి విఫలం కాగా.. కోలిన్‌ ఇంగ్రామ్‌ డకౌట్‌ అయ్యాడు.

వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ మోర్నే వాన్‌ విక్‌ (25 బంతుల్లో 31) కాసేపు పోరాడగా మిగిలిన వారు చేతులెత్తేశారు. దీంతో సౌతాఫ్రికా 46 పరుగుల తేడాతో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించగా.. ఇంగ్లండ్‌ ఫైనల్‌కు దూసుకువెళ్లింది. 

ఇంగ్లండ్‌ బౌలర్లలో టైమల్‌ మిల్స్‌, అజ్మత్‌ షాజాద్‌ చెరో మూడు వికెట్లతో చెలరేగి సౌతాఫ్రికా బ్యాటింగ్‌ ఆర్డర్‌ పతనాన్ని శాసించగా.. సమిత్‌ పటేల్‌ రెండు, టోబీ రోలండ్‌, రవి బొపార తలా ఒక వికెట్‌ పడగొట్టారు. కాగా ఆస్ట్రేలియా- వెస్టిండీస్‌ మధ్య రెండో సెమీ ఫైనల్లో గెలిచిన జట్టుతో ఆదివారం జరిగే టైటిల్‌ పోరులో ఇంగ్లండ్‌ తలపడుతుంది.

చదవండి: IND vs WI: విండీస్‌తో ఐదో టీ20.. భువీకి చోటు: బీసీసీఐ ప్రకటన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement