ఇంతకంటే చెత్తగానే ప్రవర్తించారు.. అతడు చేసిన తప్పేంటి? | Seen Senior Players Do way Worse: Simon Doull Backs Digvesh Celebrations | Sakshi
Sakshi News home page

ఇంతకంటే చెత్తగానే ప్రవర్తించారు.. అతడు చేసిన తప్పేంటి?.. ఎందుకు ఈ ‘శిక్ష’లు?

Apr 9 2025 1:29 PM | Updated on Apr 9 2025 1:39 PM

Seen Senior Players Do way Worse: Simon Doull Backs Digvesh Celebrations

Photo Courtesy: BCCI/LSG

లక్నో సూపర్‌ జెయింట్స్‌ బౌలర్‌ దిగ్వేశ్‌ సింగ్‌ రాఠీ (Digvesh Singh Rathi)కి న్యూజిలాండ్‌ మాజీ క్రికెటర్‌ సైమన్‌ డౌల్‌ అండగా నిలిచాడు. రాఠీ విషయంలో భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (BCCI) వ్యవహరిస్తున్న తీరు సరికాదని విమర్శించాడు. కాగా ఢిల్లీకి చెందిన దిగ్వేశ్‌ను ఐపీఎల్‌-2025 (IPL 2025) మెగా వేలంలో లక్నో రూ. 30 లక్షల ధరకు కొనుగోలు చేసింది.

25 ఏళ్ల ఈ రైటార్మ్‌ లెగ్‌ బ్రేక్‌ స్పిన్నర్‌పై నమ్మకంతో సీజన్‌లో తమ తొలి మ్యాచ్‌లోనే తుదిజట్టులో అవకాశం ఇచ్చింది. ఈ క్రమంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌ సందర్భంగా అరంగేట్రంలోనే దిగ్వేశ్‌ రెండు వికెట్లు తీసి మేనేజ్‌మెంట్‌ అంచనాలు నిజం చేశాడు.

‘నోట్‌బుక్‌’ సంబరాలు
ఆ తర్వాత కూడా రాణించిన దిగ్వేశ్‌ పంజాబ్‌ కింగ్స్‌తో మ్యాచ్‌ సందర్భంగా సెలబ్రేషన్స్‌ చేసుకున్న తీరు వైరల్‌ అయింది. బ్యాటర్‌ను అవుట్‌ చేయగానే.. అతడి దగ్గరికి వెళ్లి నోట్‌బుక్‌లో వికెట్‌ నంబర్‌ రాసుకుంటున్నట్లుగా కాస్త అతిగా సెలబ్రేట్‌ చేసుకున్నాడు. దీంతో ఐపీఎల్‌ పాలక మండలి.. ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా వ్యవహరించాడంటూ జరిమానా విధించింది.

మ్యాచ్‌ ఫీజులో 25 శాతం కోత విధించడంతో పాటు.. ఓ డీమెరిట్‌ పాయింట్‌ జత చేసింది. ఇక ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌ సందర్భంగా కూడా దిగ్వేశ్‌ రాఠీ మరోసారి ఇదే రీతిలో వికెట్‌ తీసిన సంబరాన్ని సెలబ్రేట్‌ చేసుకోగా.. ఈసారి మ్యాచ్‌ ఫీజులో యాభై శాతం కోత విధించడంతో పాటు మరో డీమెరిట్‌ పాయింట్‌ అతడి ఖాతాలో చేరింది. మూడోసారి ఇది రిపీట్‌ అయితే.. మ్యాచ్‌ నిషేధం ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది.

 పచ్చిక మీద సంతకం
ఈ నేపథ్యంలో తాజాగా కోల్‌కతా నైట్‌ రైడర్స్‌తో మ్యాచ్‌లో మాత్రం దిగ్వేశ్‌ తన శైలిని మార్చుకున్నాడు. గత రెండు మ్యాచ్‌ల్లో వికెట్‌ తీసిన అనంతరం ‘నోట్‌ బుక్‌’ సంబరాలతో జరిమానా ఎదుర్కొన్న అతడు.. ఈ మ్యాచ్‌లో తన ఆరాధ్య ప్లేయర్‌ సునీల్‌ నరైన్‌ వికెట్‌ తీసిన అనంతరం భిన్నంగా సంబరాలు జరుపుకొన్నాడు. ఏడో ఓవర్‌ రెండో బంతికి నరైన్‌ను అవుట్‌ చేసిన అనంతరం నేల మీద కూర్చొని పచ్చిక మీద సంతకం పెట్టాడు.

ఇంతకంటే చెత్తగానే ప్రవర్తించారు.. అతడు చేసిన తప్పేంటి?
ఈ పరిణామాలపై కామెంటేటర్‌ సైమన్‌ డౌల్‌ స్పందించాడు. ‘‘ఇలాంటి జరిమానాలను జట్టు యాజమాన్యం కడుతుంది. నాకైతే ఇదేమీ నచ్చడం లేదు. నిజానికి అతడు సెలబ్రేషన్స్‌ చేసుకున్న తీరు చూసి నాకు ముచ్చటేసింది. అసలు అతడు చేసిన తప్పేంటి?

ఇంతకంటే చెత్తగానే ప్రవర్తించారు.. అతడు చేసిన తప్పేంటి?భారత క్రికెటర్లలో చాలా మంది సీనియర్లు ఇంతకంటే అధ్వానంగా సెలబ్రేట్‌ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ వాళ్లకు మాత్రం ఎప్పుడూ జరిమానా వేయలేదు. కానీ ఈ యువ ఆటగాడి పట్ల మాత్రం ఎందుకు ఈ వివక్ష?.. 

నోట్‌బుక్‌ సంబరాలను తప్పుపట్టడం ఎంత మాత్రం సరికాదు’’ అని డౌల్‌ క్రిక్‌బజ్‌ షోలో తన అభిప్రాయాలు పంచుకున్నాడు. కాగా ఇప్పటి వరకు ఐపీఎల్‌లో ఐదు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న దిగ్వేశ్‌ సింగ్‌ రాఠీ ఏడు వికెట్లతో సత్తా చాటాడు. మరోవైపు.. లక్నో జట్టు ఇప్పటిదాకా ఆడిన ఐదు మ్యాచ్‌లలో మూడు గెలిచింది.

చదవండి: ఎగిరి గంతేసిన ప్రీతి జింటా.. కోపం పట్టలేక ధోని.. రియాక్షన్స్‌ వైరల్‌
 

Advertisement
 
Advertisement
Advertisement