చెన్నైకి అదనపు బౌలర్‌ కావాలి!  | Sakshi
Sakshi News home page

చెన్నైకి అదనపు బౌలర్‌ కావాలి! 

Published Fri, Oct 2 2020 2:22 AM

Sanjay Manjrekar Speaks About Chennai Super Kings Team Bowling Line Up - Sakshi

సాధారణంగా ఐపీఎల్‌ గ్రూప్‌ దశలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఎప్పుడూ ఒత్తిడిలో కనిపించదు. కానీ ఈ సారి అలా అనిపిస్తోంది. ఆ జట్టు వీరాభిమానులు కూడా సోషల్‌ మీడియాలో పెద్దగా చప్పుడు చేయడం లేదంటే వారూ కొంత ఆందోళన చెందుతున్నట్లు అనిపిస్తోంది. చెన్నై వ్యూహాలు కాస్త భిన్నంగా కనిపిస్తున్నాయి. ప్రతీ ఒక్క ఆటగాడు తన సొంత ప్రదర్శనతోనే జట్టును గెలిపించగలడని అనిపిస్తున్న ముంబై ఇండియన్స్‌తో పోలిస్తే చెన్నై పూర్తి వ్యతిరేకంగా ఉంది. పోలికలు అనవసరం కానీ జట్టుగా చూస్తే మ్యాచ్‌లు గెలిచేందుకు అన్ని రకాల అర్హత ఉంది. అయితే ఇది జరగాలంటే ధోని సమర్థంగా నడిపించాల్సి ఉంది. ఆటగాళ్లనుంచి అత్యుత్తమ ఆటను రాబట్టుకోవడం ధోనికి తెలిసినంతగా మరెవరికీ తెలీదు. ఒక్కసారి ధోని తప్పుకుంటే ఏం జరుగుతుందో ఊహించడం కష్టం. అప్పటికీ ఏదో రూపంలో ధోని జట్టుతో కొనసాగితే తప్ప టీమ్‌ కూర్పు చాలా మారిపోవడం ఖాయం. రాబోయే రోజుల్లో ఇది ఎలా ఉండబోతోందో చూడాలి.

ప్రస్తుతానికి మాత్రం ధోని కొన్ని చిన్న చిన్న సమస్యలు చక్కబెట్టాల్సి ఉంది. పిచ్‌ బాగుంటే ఒక అదనపు బౌలింగ్‌ ప్రత్యామ్నాయం అందుబాటులో ఉంటే మంచిది. అన్ని జట్లూ ఇలాగే చేస్తున్నాయి. చెన్నైలో అయితే జడేజా తన 4 ఓవర్లు పూర్తిగా వేసేవాడు. కానీ ఇక్కడ అతడిని నమ్ముకోలేం. బౌలర్‌ కోసం ఒక బ్యాట్స్‌మన్‌ను తగ్గించుకునే అవకాశం సూపర్‌ కింగ్స్‌కు ఉంది. నేటి మ్యాచ్‌లో విజయ్‌ స్థానంలో రాయుడు ఆడటం దాదాపు ఖాయం కాబట్టి బ్యాటింగ్‌ బలపడుతుంది. మరి బౌలింగ్‌ సంగతి చూసుకుంటే మిడిలార్డర్‌లో ఆడే రుతురాజ్‌ను పక్కన పెట్టి ఒక స్పెషలిస్ట్‌ బౌలర్‌ను తీసుకుంటే మంచిది. ఇలాంటి టోర్నీలో మిడిలార్డర్‌లో ఆడటం ఒక యువ ఆటగాడికి అంత సులువు కాదు. అందుకు బదులుగా 4 ఓవర్లు బాగా వేయగల బౌలర్‌ పనికొస్తాడు. బలహీనంగా కనిపించిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఎట్టకేలకు బలమైన ఢిల్లీని ఓడించింది. అయితే ఇది మరీ పెద్ద విజయమేమీ కాదని నా భావన. విలియమ్సన్‌ ఒక మంచి ఇన్నింగ్స్‌ ఆడకపోయి ఉంటే హైదరాబాద్‌ ఓడిపోయేది.

ఇన్నేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఐపీఎల్‌లో వార్నర్‌ తడబడుతున్నాడు. బెయిర్‌స్టో అర్ధ సెంచరీ చేసినా అతనిలో ఆత్మవిశ్వాసం కనిపించలేదు. విలియమ్సన్‌ రాకతో ప్రస్తుతానికి జట్టు బ్యాటింగ్‌ బలం కాస్త పెరిగింది. సందీప్, కౌల్, థంపిలను కాదని లెఫ్టార్మ్‌ పేసర్‌ నటరాజన్‌కు ఎందుకు అవకాశం ఇచ్చారో ఈ మ్యాచ్‌ చూస్తే అర్థమైంది. చక్కటి నియంత్రణతో పాత కాలం బౌలర్ల తరహాలో నటరాజన్‌ మంచి యార్కర్లు వేయగలడని తెలిసింది. ఇన్నేళ్ళలో బ్యాటింగ్‌లో చాలా మార్పులు వచ్చాయి. 360 డిగ్రీల షాట్లు వచ్చాయి. అయితే కచ్చితత్వంతో, సరిగ్గా బౌలింగ్‌ చేస్తే ఇప్పటికీ బ్యాట్స్‌మెన్‌ల వద్ద సమాధానం లేదని గత మ్యాచ్‌ నిరూపించింది. అంచనా వేయడం కొంత కష్టమే అయినా... నా దృష్టిలో నేటి మ్యాచ్‌లో చెన్నైదే పైచేయిగా కనిపిస్తోంది.

Advertisement
Advertisement