
ఆండర్సన్ టెండూల్కర్ ట్రోఫీ-2025లో పరుగుల వరద పారింది. భారత్, ఇంగ్లండ్ జట్లు కలిపి 7000 కంటే ఎక్కువ పరుగులు సాధించారు. టెస్టు క్రికెట్ చరిత్రలో ఒకే సిరీస్‌లో 7000 పైగా పరుగులు చేయడం ఇది రెండో సారి మాత్రమే. కానీ టీమిండియా తరపున మూడో స్దానంలో బ్యాటింగ్‌కు వచ్చిన వారు మాత్రం ఈ రన్ ఫీస్ట్‌లో తమ మార్క్ చూపించలేకపోయారు. సాయి సుదర్శన్, కరుణ్ నాయర్ ఆ స్ధానంలో బ్యాటింగ్ చేసి 241 పరుగులు మాత్రమే సాధించారు.
నిరాశపరిచిన నాయర్..
ఎనిమిదేళ్ల తర్వాత భారత టెస్టు జట్టులోకి పునరాగమనం చేసిన కరుణ్ నాయర్ ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. ఈ సిరీస్‌లో నాయర్ రెండు వేర్వేరు స్థానాల్లో బ్యాటింగ్ చేసాడు. మొత్తంగా నాలుగు మ్యాచ్‌లు ఆడి కేవలం 205 పరుగులు మాత్రమే చేశాడు.
మరోవైపు సుదర్శన్ కూడా పెద్దగా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. కానీ ఇది అతడికి తొలి టెస్టు సిరీస్. మొత్తంగా మూడు మ్యాచ్‌లు ఆడిన సుదర్శన్ 23.33 సగటుతో 140 పరుగులు మాత్రమే చేశాడు. కానీ అనుభవజ్ఞుడైన కరుణ్ నుంచి మాత్రం అభిమానులు మెరుగైన ప్రదర్శనను ఆశించారు.
ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ వీరిద్దరి ప్రదర్శనకు మార్క్‌లు వేశాడు. కరుణ్ నాయర్ కంటే సాయిసుదర్శన్‌కు ఇర్ఫాన్ పఠాన్ మెరుగైన రేటింగ్ ఇచ్చాడు.
పదికి నాలుగు..
"ఇంగ్లండ్ పర్యటనలో కరుణ్ నాయర్ ప్రదర్శనకు పదికి నాలుగు మార్కులు వేస్తాను. సిరీస్ అంతటా అతడు మరీ అంత పేలవమైన ప్రదర్శనలు కనబరచలేదు. అతడు తనకు లభించిన ఆరంభాలను భారీ స్కోర్లగా మలుచుకోలేకపోయాడు. ఒకే ఒక హాఫ్ సెంచరీతో సిరీస్‌ను ముగించాడు.
ఈ సిరీస్‌లో అతడికి చాలా అవకాశాలు లభించాయి. క్రికెట్ అతడికి ఖచ్చితంగా రెండవ అవకాశమిచ్చేందని చెప్పాలి. కానీ దానిని అతడు ఉపయోగించుకోలేకపోయాడు. ముఖ్యంగా లార్డ్స్ టెస్టులో భారత్‌ను గెలిపించే ఛాన్స్ అతడికి ఉండేది. కానీ అక్కడ కూడా అవకాశాన్ని చేజార్చుకున్నాడు. ఆ మ్యాచ్‌లో అతడు క్రీజులో కుదురుకున్నట్లు కన్పించాడు. కానీ సడన్‌గా పేలవ షాట్ ఆడి ఔటయ్యాడు. బౌన్సర్ బంతులకు అతడు కొంచెం ఇబ్బంది పడుతున్నాడు.
పదికి ఐదు..
"సాయిసుదర్శన్‌కు పదికి ఐదు మార్క్‌లు ఇవ్వాలనుకుంటున్నాను. అతడి బ్యాటింగ్ టెక్నిక్ అద్బుతంగా ఉంటుంది. అతడు తన బ్యాటింగ్‌లో బలహీనతలను అధిగమించాడు. తొలి టెస్టులో కంటే మిగితా మ్యాచ్‌ల్లో కాస్త మెరుగ్గా కన్పించాడు.
అతడికి లభించిన ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకునేవాడు. కానీ ఈసారి అలా చేయలేకపోయాడు. అయితే సాయి అన్ని మ్యాచ్‌లు ఆడి ఉంటే పరిస్థితులు భిన్నంగా ఉండేవని నేను అనుకుంటున్నాను తన యూట్యూబ్ ఛానల్‌లో పఠాన్ పేర్కొన్నాడు.