లబుషేన్‌కు ఊహించని షాక్‌.. ప్రపంచ నంబర్‌ 1 అతడే! వారెవ్వా పంత్‌.. కోహ్లి మాత్రం..

Root Topples Labuschagne As World No 1 Batter Pant In Top 10 - Sakshi

ICC Test Batting Rankings: ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్‌ స్టార్‌ బ్యాటర్‌ జో రూట్‌ సత్తా చాటాడు. ఆస్ట్రేలియా క్రికెటర్‌ మార్నస్‌ లబుషేన్‌ను వెనక్కి నెట్టి అగ్రస్థానానికి చేరుకున్నాడు. దీంతో గత ఆరు నెలలుగా నంబర్‌ 1 హోదాలో కొనసాగుతున్న లబుషేన్‌ మూడో స్థానానికి పడిపోయాడు. ఇక న్యూజిలాండ్‌ మాజీ కెప్టెన్‌ రూట్‌ తర్వాతి స్థానాన్ని ఆక్రమించాడు. 

అజేయ సెంచరీతో
కాగా ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక యాషెస్‌ సిరీస్‌ తొలి టెస్టులో రూట్‌ అద్భుత ఆట తీరుతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన అతడు తొలి ఇన్నింగ్స్‌లో 118 పరుగులతో అజేయంగా నిలిచాడు. రెండో ఇన్నింగ్స్‌లోనూ 46 పరుగులతో రాణించాడు. అదే సమయంలో లబుషేన్‌ వరుసగా 0, 13 పరుగులతో పూర్తిగా నిరాశపరిచాడు.

వారెవ్వా పంత్‌
ఈ నేపథ్యంలో 887 రేటింగ్‌ పాయింట్లు సాధించిన జో రూట్‌కు అగ్రపీఠం దక్కింది. ఇక టీమిండియా నుంచి యువ వికెట్‌ బ్యాటర్‌ రిషభ్‌ పంత్‌ ఒక్కడే టాప్‌-10లో కొనసాగుతున్నాడు. రోడ్డు ప్రమాదం కారణంగా ఈ ఏడాది ఆరంభం నుంచి ఆటకు దూరంగా ఉన్నప్పటికీ పంత్‌ ఈ మేరకు పదో ర్యాంకు(758 పాయింట్లు)లో కొనసాగడం విశేషం.

ఒక స్థానం దిగజారిన కోహ్లి
మరోవైపు.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్లో నిరాశపరిచిన స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లి ఒక స్థానం కోల్పోయి 14వ ర్యాంకుకు పడిపోయాడు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ 12వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇదిలా ఉంటే.. పాకిస్తాన్‌ సారథి బాబర్‌ ఆజం ఐదో ర్యాంకును నిలుపుకొన్నాడు. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్‌ మండలి బుధవారం తాజా టెస్టు బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌ విడుదల చేసింది. ఇక బౌలింగ్‌ ర్యాంకింగ్స్‌లో టీమిండియా వెటరన్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ అగ్రస్థానం నిలబెట్టుకున్నాడు.

ఐసీసీ తాజా టెస్టు ర్యాంకింగ్స్‌ టాప్‌-5లో ఉన్నది వీళ్లే
1. జో రూట్‌- ఇంగ్లండ్‌- 887 పాయింట్లు
2. కేన్‌ విలియమ్సన్‌- న్యూజిలాండ్‌- 883 పాయింట్లు
3. మార్నస్‌ లబుషేన్‌- ఆస్ట్రేలియా- 877 పాయింట్లు
4. ట్రవిస్‌ హెడ్‌- ఆస్ట్రేలియా- 873 పాయింట్లు
5. బాబర్‌ ఆజం- పాకిస్తాన్‌- 862 పాయింట్లు.

చదవండి: IND vs WI: కిషన్‌, భరత్‌కు నో ఛాన్స్‌.. భారత జట్టులోకి యువ వికెట్‌ కీపర్‌!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top