Shahid Hakeem: ప్రముఖ ఫుట్‌బాల్‌ దిగ్గజం కన్నుమూత

Rome Olympic Footballer Shahid Hakeem Passes Away At 82 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: భారత్‌ ఫుట్‌బాల్‌లో ‘స్వర్ణయుగం’లాంటి గత తరానికి ప్రతినిధిగా నిలిచిన ఆటగాళ్లలో మరొకరు నిష్క్రమించారు. నగరానికి చెందిన ప్రముఖ ఫుట్‌బాలర్, 1960 రోమ్‌ ఒలింపిక్స్‌లో భారత జట్టు సభ్యుడిగా ఉన్న సయ్యద్‌ షాహిద్‌ హకీమ్‌ ఆదివారం గుల్బర్గాలో కన్ను మూశారు. ఆయన వయసు 82 సంవత్సరాలు. డెంగీ సోకడంలో ఆయనను ఆస్పత్రిలో చేర్చామని, చికిత్స పొందుతుండగానే గుండెపోటుతో హకీమ్‌ మృతి చెందారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. గత ఏడాది జూలైలో కోవిడ్‌ బారిన పడిన ఆయన అనం తరం కోలుకున్నారు. భారత ఫుట్‌బాల్‌లో దిగ్గజ కోచ్‌ అయిన ఎస్‌ఏ రహీమ్‌ కుమారుడైన హకీమ్‌... ఆటకు అందించిన సేవలకుగాను 2017లో కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక ‘ధ్యాన్‌చంద్‌ అవార్డు’ అవార్డును కూడా అందుకున్నారు.  

క్రమశిక్షణకు మారుపేరుగా... 
తండ్రి రహీమ్‌ అడుగుజాడల్లో ఫుట్‌బాల్‌లోకి అడుగు పెట్టిన హకీమ్‌ సుమారు 25 ఏళ్ల పాటు ఆటతో తన అనుబంధాన్ని కొనసాగించారు. హకీమ్‌ అద్భుత ప్రదర్శనతోనే హైదరాబాద్‌ జట్టు 1956, 1957 లలో వరుసగా రెండు సార్లు ప్రఖ్యాత సంతోష్‌ ట్రోఫీని గెలుచుకోవడం విశేషం. సెంట్రల్‌ మిడ్‌ఫీల్డర్‌గా, హాఫ్‌ బ్యాక్‌ స్థానంలో ఆయన తన ప్రతిభను ప్రదర్శించారు. 1950వ, 60వ దశకాల్లో భారత కీలక ఆటగాడిగా నిలిచిన హకీమ్‌...1960 రోమ్‌ ఒలింపిక్స్‌లో ఆరో స్థానంలో నిలిచిన మన టీమ్‌లో భాగంగా ఉన్నారు. రిటైర్మెంట్‌ తర్వాత రిఫరీగా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన హకీమ్‌...1989 వరకు 33 అంతర్జాతీయ మ్యాచ్‌లకు రిఫరీగా వ్యవహరించారు. అనంతరం తండ్రి బాటలో కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన హకీమ్‌...శిక్షకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 

ఆయన శిక్షణలో మహీంద్రా అండ్‌ మహీంద్రా జట్టు 1988లో అత్యంత పటిష్టమైన ఈస్ట్‌ బెంగాల్‌ను ఓడించి ప్రతిష్టాత్మక డ్యురాండ్‌ కప్‌ను గెలుచుకోవడం హకీమ్‌ కెరీర్‌లో మరచిపోలేని ఘట్టం. సాల్గావ్‌కర్, బెంగాల్‌ ముంబై ఎఫ్‌సీ జట్లకు కూడా ఆయన కోచ్‌గా వ్యవహరించారు. 1982లో ఢిల్లీలో జరిగిన ఆసియా క్రీడల్లో భారత జట్టుకు అసిస్టెంట్‌ కోచ్‌గా ఆయన పని చేశారు. ఆపై స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సాయ్‌)లో రీజినల్, ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌గా దశాబ్ద కాలం పాటు సేవలందించారు. ఎయిర్‌ఫోర్స్‌లో సుదీర్ఘ కాలం స్క్వాడ్రన్‌ లీడర్‌ హోదాలో పని చేసిన హకీమ్‌ అదే క్రమశిక్షణ, నిజాయితీని అన్ని చోట్లా చూపించేవారు. ఫుట్‌బాలర్లకు మేలు చేసేందుకు ‘ఆఖరి విజిల్‌’ వరకు పోరాడేందుకు సిద్ధమని చెబుతూ ఉండే హకీమ్‌...తన ఆటగాళ్లకు సరైన సౌకర్యాలు కల్పించమంటూ ఒక దశలో ‘సాయ్‌’ అధికారులతో తలపడేందుకు సిద్ధమయ్యారు. దాంతో సుదీర్ఘ కాలం పాటు ప్రభుత్వం ఆయన పెన్షన్, ఇతర సౌకర్యాలనూ నిలిపివేసింది. అయినా తగ్గకుండా తాను నమ్మిన బాటలోనే చివరి వరకు నడిచారు. 
చదవండి: ఇంగ్లండ్‌ ఆటగాళ్లు అతి చేస్తుంటే కోచ్‌ ఏం చేస్తున్నాడు..?

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top