Ind Vs WI T20I- Rohit Sharma: ధావన్‌పై ఓజా వ్యాఖ్యలు! తనదైన శైలిలో స్పందించిన రోహిత్‌ శర్మ

Rohit Sharma: Pragyan Commentary Karne Laga Hai Kya On Dhawan Remarks - Sakshi

Rohit Sharma- Pragyan Ojha- Shikhar Dhawan: శిఖర్‌ ధావన్‌ విషయంలో మాజీ స్పిన్నర్‌ ప్రజ్ఞాన్‌ ఓజా చేసిన వ్యాఖ్యలపై టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తనదైన శైలిలో స్పందించాడు. ఓజా కామెంటేటర్‌గా మారాడన్న సంగతి తనకు తెలియదన్న హిట్‌మ్యాన్‌.. మైదానం లోపల, వెలుపల ఆటగాళ్ల మధ్య స్నేహ బంధం జట్టుకు కచ్చితంగా మేలు చేస్తుందని తెలిపాడు. కాగా ఇంగ్లండ్‌ పర్యటనలో విఫలమైన శిఖర్‌ ధావన్‌ను వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు సారథిగా బీసీసీఐ ఎంపిక చేసిన విషయం తెలిసిందే.

అందుకేనేమో ధావన్‌కు అవకాశాలు!
ఈ నేపథ్యంలో ప్రజ్ఞాన్‌ ఓజా మాట్లాడుతూ.. వెటరన్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ వన్డే ప్రపంచకప్‌ జట్టులో ఉంటే ఉపయుక్తంగా ఉంటుందని, అందుకే బహుశా అతడికి అవకాశాలు వస్తున్నాయని అభిప్రాయపడ్డాడు. తనకు జోడీగా ధావన్‌ వంటి అనుభవజ్ఞుడు ఉంటే బాగుంటుందని రోహిత్‌ శర్మ  కోరుకుంటున్నాడని తాను భావిస్తున్నట్లు తెలిపాడు. 

సచిన్‌ టెండుల్కర్‌, సౌరవ్‌ గంగూలీ మాదిరి రోహిత్‌- ధావన్‌ మధ్య కూడా ఫ్రెండ్‌షిప్‌ ఉందని పేర్కొన్న ఓజా.. ఇప్పటికే వీరిద్దరి జోడీ జట్టుకు ఎన్నో విజయాలు కూడా అందించిందని పేర్కొన్నాడు. అందుకే వరల్డ్‌కప్‌-2023 భారత జట్టులో అతడికి చోటు ఉంటుందని భావిస్తున్నట్లు పేర్కొన్నాడు.

అవునా.. నిజమా?
ఈ క్రమంలో విండీస్‌ టీ20 సిరీస్‌ ఆరంభానికి ముందు రోహిత్‌ శర్మ.. ఓజా వ్యాఖ్యలపై సరాదాగా స్పందించాడు. ‘‘అవునా...! ప్రజ్ఞాన్‌.. ఇప్పుడు కామెంటేటర్‌గా ఉన్నాడా? మంచిది. ఏదేమైనా.. మనతో కలిసి బ్యాటింగ్‌ చేస్తున్న ఆటగాడు ఎవరైనా సరే.. అది శిఖర్‌ లేదంటే మరొకరు.. ఎవరైనా.. పరస్పర అవగాహనతో ముందుకు వెళ్తాం.

అదే సమయంలో స్నేహ బంధం పెంపొందుతుంది. మైదానం వెలుపల కూడా ఆ ఫ్రెండ్‌షిప్‌ కొనసాగుతుంది. నిజానికి ఆటగాళ్ల మధ్య ఇలాంటి బంధం ఉంటే డ్రెస్సింగ్‌రూమ్‌లో వాతావరణం బాగుంటుంది’’ అని పేర్కొన్నాడు. ఆటలో భాగంగానే జట్టు అవసరాలను బట్టి ప్లేయర్లకు అవకాశాలు ఇస్తామే తప్ప వారితో ఉన్న అనుబంధం కారణంగా కాదని రోహిత్‌ శర్మ చెప్పకనే చెప్పాడు. 

కాగా ప్రజ్ఞాన్‌ ఓజా, రోహిత్‌ శర్మ మధ్య కూడా మంచి అనుబంధం ఉంది. వీరిద్దరు టీమిండియాతో పాటు ఐపీఎల్‌ ఫ్రాంఛైజీలు దక్కన్‌ చార్జర్స్‌, ముంబై ఇండియన్స్‌కు కలిసి ఆడారు. ఇదిలా ఉంటే శుక్రవారం నుంచి వెస్టిండీస్‌- టీమిండియా మధ్య ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ ఆరంభం కానుంది. ఇక రోహిత్‌ గైర్హాజరీతో ధావన్‌ సారథ్యంలోని వన్డే జట్టు కరేబియన్‌ గడ్డపై విండీస్‌ను మట్టికరిపించి తొలిసారి 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసిన విషయం తెలిసిందే.

చదవండి: India Probable XI: ఓపెనర్‌గా పంత్‌.. అశ్విన్‌కు నో ఛాన్స్‌! కుల్దీప్‌ వైపే మొగ్గు!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top