World Cup 2023: అందుకే గబ్బర్‌ కెప్టెన్‌ అయ్యాడు! రోహిత్‌ శర్మ కోరుకుంటున్నది అదే!

WC 2023: Pragyan Ojha Feels Rohit Sharma Wants Shikhar Dhawan In Squad - Sakshi

ICC ODI World Cup 2023: టీమిండియాలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు శిఖర్‌ ధావన్‌. ముఖ్యంగా వన్డే ఫార్మాట్‌లో ఓపెనర్‌గా జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. రోహిత్‌ శర్మకు జోడీగా బరిలోకి అనేక రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు. గత రెండేళ్లలో వన్డేల్లో ధావన్‌ నమోదు చేసిన అర్ధ శతకాల సంఖ్య తొమ్మిది. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ ఫార్మాట్‌లో గబ్బర్‌ నిలకడ ఏమిటో!

శ్రీలంక పర్యటన తర్వాత జట్టుకు దూరమైన శిఖర్‌ ధావన్‌.. ఇటీవల ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు ఎంపికైన సంగతి తెలిసిందే. బట్లర్‌ బృందంతో మొదటి వన్డేలో 31 పరుగులు చేసిన ధావన్‌.. రెండు(9), మూడో వన్డే(1)ల్లో పూర్తిగా నిరాశపరిచాడు.

అయినప్పటికీ వెస్టిండీస్‌ పర్యటన నేపథ్యంలో వన్డే జట్టుకు సారథిగా గబ్బర్‌ అవకాశం దక్కించుకోవడం విశేషం. ఈ నేపథ్యంలో వన్డే వరల్డ్‌కప్‌-2023 సన్నాహకాల్లో భాగంగానే ధావన్‌కు మరిన్ని అవకాశాలు ఇవ్వాలని యాజమాన్యం భావిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

అందుకే అతడు కెప్టెన్‌ అయ్యాడు!
ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ స్పిన్నర్‌ ప్రజ్ఞాన్‌ ఓజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వెటరన్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ ప్రపంచకప్‌ జట్టులో ఉంటే ఉపయుక్తంగా ఉంటుందని రోహిత్‌ శర్మ భావిస్తున్నట్లు అనిపిస్తోందని పేర్కొన్నాడు. ఈ మేరకు ఓజా మాట్లాడుతూ.. ‘‘ఒక సీనియర్‌ ప్లేయర్‌ను ఎలా ఉపయోగించుకోవాలో అలాగే ఉపయోగించుకుంటున్నారు. ఇది సరైన విధానమే! 

ముఖ్యంగా మెగా టోర్నీకి ముందు బెంచ్‌ను మరింత స్ట్రాంగ్‌ చేసుకోవడం ముఖ్యం. నిజానికి ధావన్‌ జట్టులో సీనియర్‌. వన్డే ఫార్మాట్‌లో మాత్రమే ఆడుతున్నాడు. అందుకే ద్వితీయ శ్రేణి జట్టుకు అతడు కెప్టెన్‌గా ఎంపికవుతున్నాడు.

రోహిత్‌ కోరుకుంటున్నది అదే!
అతడిలో నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. బ్యాటర్‌గా కూడా రాణించగల సత్తా ఉంది. ఇంగ్లండ్‌లో కాస్త నిరాశపరిచినా.. మళ్లీ తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. శిఖర్‌ ధావన్‌ తనకు జోడీగా ఉండాలని రోహిత్‌ శర్మ బలంగా కోరుకుంటున్నాడన్న విషయం స్పష్టంగా అర్థమవుతోంది. నిజానికి వీరిద్దరి భాగస్వామ్యం జట్టుకు ఎన్నో విజయాలు అందించింది కూడా!’’ అని చెప్పుకొచ్చాడు. శిఖర్‌ ధావన్‌ కచ్చితంగా ప్రపంచకప్‌ జట్టులో ఉంటాడని ప్రజ్ఞాన్‌ ఓజా విశ్వాసం వ్యక్తం చేశాడు. 

తన ఆటతో తానేమిటో ఇప్పటికే నిరూపించుకున్నాడని 36 ఏళ్ల గబ్బర్‌కు మద్దతుగా నిలిచాడు. కాగా ఇటీవల అజయ్‌ జడేజా మాట్లాడుతూ.. రోహిత్‌ శర్మ కోరుకున్నట్లుగా ధావన్‌ దూకుడైన ఆట కనబరచలేడంటూ పెదవి విరిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజ్ఞాన్‌ ఓజా.. గబ్బర్‌కు అండగా నిలవడం విశేషం.

ఇక విండీస్‌ పర్యటనలో భాగంగా ధావన్‌ సారథ్యంలోని టీమిండియ ఇప్పటికే సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. ఇరు జట్ల మధ్య మూడో వన్డే బుధవారం(జూలై 27) జరుగనుంది. ఈ సిరీస్‌లో ధావన్‌ ఇప్పటి వరకు వరుసగా 97, 13 పరుగులు సాధించాడు.
చదవండి: Ajay Jadeja-ODI: మూడు గంటల్లోనే ఫలితం.. ఏడు గంటలు ఎవరు ఆడుతారు?

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top