అసలు ధావన్‌ ఇక్కడ ఏం చేస్తున్నాడు? రోహిత్‌ చెప్పిన దాన్ని బట్టి జట్టులోనే ఉండొద్దు!

Ind Vs WI: Ajay Jadeja Says Dhawan Does Not Fit Rohit Aggressive Cricket - Sakshi

Ind Vs WI ODI Series- Shikhar Dhawan: టీమిండియా వెటరన్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ గురించి భారత మాజీ క్రికెటర్‌ అజయ్‌ జడేజా సంచలన వ్యాఖ్యలు చేశాడు. అసలు వెస్టిండీస్‌ పర్యటనలో అతడికేం పని అని వ్యాఖ్యానించాడు. ఆరు నెలల క్రితం జట్టు నుంచి తప్పించిన వ్యక్తిని కెప్టెన్‌గా ఎలా నియమిస్తారని ప్రశ్నించాడు. రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మాటలకు.. తాత్కాలిక సారథిగా గబ్బర్‌ నియామకానికి అసలు పొంతనే కుదరడం లేదని పేర్కొన్నాడు.

కాగా గతేడాది శ్రీలంక పర్యటనకు వెళ్లిన భారత జట్టుకు ధావన్‌ సారథ్యం వహించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత జట్టులో స్థానం కోల్పోయిన గబ్బర్‌.. ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు ఎంపికయ్యాడు. ఈ క్రమంలో వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు రోహిత్‌ శర్మ గైర్హాజరీ నేపథ్యంలో మరోసారి కెప్టెన్‌గా ధావన్‌కు అవకాశం ఇచ్చింది బీసీసీఐ.

ఈ నేపథ్యంలో అజయ్‌ జడేజా ఫ్యాన్‌కోడ్‌తో మాట్లాడుతూ.. ‘‘శిఖర్‌ ధావన్‌ విషయంలో నేను అయోమయానికి గురవుతున్నాను. అసలు అతడు ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఆరు నెలల క్రితం అతడిని జట్టు నుంచి తప్పించారు. ఇప్పుడు కెప్టెనా?

నిజానికి కేఎల్‌ రాహుల్‌ సహా పలువురు ఇతర యువ ఆటగాళ్లకు ఇలాంటి అవకాశాలు ఇవ్వాలి. కానీ అకస్మాత్తుగా ధావన్‌ పేరు తెరపైకి వస్తోంది. గతేడాది శ్రీలంక పర్యటనలో కెప్టెన్‌ను చేశారు. ఆ తర్వాత జట్టులో చోటే లేదు. తర్వాత ఇంగ్లండ్‌కు తీసుకువెళ్లారు. అసలు టీమిండియా కెప్టెన్సీ విషయంలో బీసీసీఐ ఏమనుకుంటోంది?’’ అని ప్రశ్నించాడు.

ఇక ఇంగ్లండ్‌తో రెండో వన్డేలో పరాజయం తర్వాత తాము దూకుడైన ఆటకు మారుపేరుగా ఉండాలని భావిస్తున్నట్లు రోహిత్‌ శర్మ చెప్పిన విషయాన్ని అజయ్‌ ఈ సందర్భంగా  ప్రస్తావించాడు. వన్డేలను సైతం టీ20 తరహాలో ఆడతామన్న.. హిట్‌మ్యాన్‌ మాటలను బట్టి చూస్తే ధావన్‌ అసలు జట్టులో ఉండేందుకు అర్హుడు కాదని అజయ్‌ జడేజా అభిప్రాయపడ్డాడు.

కాగా అజయ్‌ వ్యాఖ్యలపై స్పందించిన గబ్బర్‌ అభిమానులు ఐపీఎల్‌-2022లో ధావన్‌ ప్రదర్శనను ఓసారి గుర్తు చేసుకోవాలని సూచిస్తున్నారు. ఈ సీజన్‌లో పంజాబ్‌ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించిన ధావన్‌ 14 ఇన్నింగ్స్‌లో 460 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 88 నాటౌట్‌.

ఇదిలా ఉంటే.. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా 3 పరుగుల తేడాతో గెలుపొందింది. ఇక కెప్టెన్‌ శిఖర్‌ ధావన్‌ 97 పరుగులతో రాణించి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.

చదవండి: Sanju Samson: సంజూ ఆ బంతిని ఆపకపోయి ఉంటే.. టీమిండియా ఓడిపోయేదే! నువ్వు సూపర్‌!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top