WTC Final: ఐపీఎల్‌ మధ్యలోనే ఆటగాళ్లను ఇంగ్లండ్‌కు పంపిస్తాం: రోహిత్‌ శర్మ

Rohit-Sharma-Hints-Few-Players-Leaving-Early-England For WTC Final - Sakshi

ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని వరుసగా నాలుగో సారి టీమిండియా కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. సోమవారం నాడు నాలుగో టెస్టు డ్రాగా ముగియడంతో సిరీస్‌ను భారత్ 2-1 తేడాతో సొంతం చేసుకుంది. అంతేకాకుండా న్యూజిలాండ్‌పై శ్రీలంక ఓడిపోవడంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ బెర్తును కూడా ఖారారు చేసుకుంది. దీంతో ఫైనల్లో ఆసీస్‌తో తలపడనుంది.

అయితే వెంటనే ఐపీఎల్, ఆ తర్వాత డబ్ల్యూటీసీ ఫైనల్ ఉండటంతో ఆటగాళ్లపై వర్క్ లోడ్ పడనుంది. ఈ విషయంపై కెప్టెన్ రోహిత్ శర్మ కూడా స్పందించాడు. ప్లేయర్లపై భారం పడకుండా ఉండేందుకు జట్టు మేనేజ్మెంట్ ఐపీఎల్ 2023 జరుగుతున్నప్పుడే డబ్ల్యూటీసీ సన్నాహాల్లో భాగంగా కొంతమందిని ముందే ఇంగ్లండ్‌కు పంపిస్తామని తెలిపాడు.

"ఇది మాకు కాస్త ఇబ్బందైన విషయమే. మేము డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడబోయే ఆటగాళ్లందరితోనూ నిరంతరం టచ్‌లో ఉంటాము. వారి వర్క్ లోడ్‌ను పర్యవేక్షించి వారికి ఎలా ఉందో చూస్తాం. మే 21 నాటికి లీగ్ మ్యాచ్‌లు ముగుస్తాయి. ఐపీఎల్ ప్లే ఆఫ్ నుంచి ఆరు జట్లు తప్పుకుంటాయి. కాబట్టి ఎవరెవరు అందుబాటులో ఉంటారో వారిని వీలైనంత వరకు ఇంగ్లండ్‌కు పంపిస్తాము. వీలైనంత వరకు కొంత సమయం వారిని పర్యవేక్షిస్తాం." అని రోహిత్ శర్మ అన్నాడు.

డబ్ల్యూటీసీలో జట్టు ఎంపిక తను పెద్ద సమస్యని అనుకోవట్లేదని హిట్ మ్యాన్ తెలిపాడు. "ఐపీఎల్ ఫైనల్‌లో ఆడే ఆటగాళ్లు డబ్ల్యూటీసీలో ఉండేవాళ్లు కాదనే అనుకుంటున్నా. ఒకవేళ ఉన్నా ఒకరు లేదా ఇద్దరు మాత్రమే. మిగిలినవారంతా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్లో ఆడతారు. ఇది పెద్ద సమస్య అని నేను అనుకోవట్లేదు." అని రోహిత్ శర్మ స్పష్టం చేశాడు.

సోమవారం నాడు న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్టులో శ్రీలంక ఓడిపోయింది. డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో లంకేయులు ఓడిపోవడంతో భారత్‌కు మార్గం సుగమమైంది. దీంతో టీమిండియా డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్తును ఖరారు చేసుకుంది. జూన్ 9న ఇంగ్లండ్‌లోని ఓవల్ వేదికగా జరగనున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆస్ట్రేలియాతో తలపడనుంది.

చదవండి: రీల్‌లైఫ్‌లో హీరో నాని.. రియల్‌ లైఫ్‌లో కేన్‌ మామ

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top