కోహ్లి, గిల్ కాదు.. అతడే సైలెంట్ హీరో: రోహిత్‌ శర్మ | Rohit Sharma Called Shreyas Iyer Indias Silent Hero After Winning Champions Trophy 2025 Title, More Details Inside | Sakshi
Sakshi News home page

కోహ్లి, గిల్ కాదు.. అతడే సైలెంట్ హీరో: రోహిత్‌ శర్మ

Mar 10 2025 9:55 AM | Updated on Mar 10 2025 10:50 AM

Rohit Sharma called Shreyas Iyer Indias silent hero after winning Champions Trophy 2025 title

భార‌త క్రికెట్ జ‌ట్టు ఏడాది తిరగక‌ముందే మ‌రో ఐసీసీ టైటిల్‌ను త‌మ ఖాతాలో వేసుకుంది. ఐసీసీ ఛాంపియ‌న్స్ ట్రోఫీ-2025 విజేత‌గా టీమిండియా నిలిచింది. దుబాయ్ వేదిక‌గా న్యూజిలాండ్‌తో జ‌రిగిన ఫైన‌ల్లో 4 వికెట్ల తేడాతో విజ‌యం సాధించిన భార‌త జ‌ట్టు.. ముచ్చటగా మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా అవ‌త‌రించింది.

 అయితే ఈ  మెగా టోర్నీలో భారత తరపున అత్యంత కీలకమైన ప్రదర్శన చేసిన‌ ఆటగాడు ఎవరంటే?  కొంత‌మంది ఫైన‌ల్లో 76 ప‌రుగులు చేసిన రోహిత్ శ‌ర్మ పేరు చెబుతుంటే.. మ‌రి కొంత‌మంది పాక్‌పై సెంచ‌రీ, సెమీస్‌లో హాఫ్ సెంచ‌రీ చేసిన విరాట్ కోహ్లి పేరు చెబుతున్నారు. 

వీరిద్ద‌రూ కాక‌పోతే కేవ‌లం మూడు మ్యాచ్‌ల్లో 9 వికెట్ల వికెట్లు ప‌డ‌గొట్టిన మిస్ట‌రీ స్పిన్న‌ర్ వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి పేరును ఎంచుకుంటున్నారు.. కానీ కెప్టెన్ రోహిత్ శ‌ర్మ మాత్రం.. మిడిలార్డ‌ర్ బ్యాట‌ర్ శ్రేయ‌స్ అయ్య‌ర్(Shreyas Iyer) అంద‌రికంటే అద్బుతంగా ఆడాడ‌ని ప్ర‌శించాడు. అయ్య‌ర్ ఒక సైలెంట్ హీరో అని హిట్‌మ్యాన్ కొనియాడాడు.

సూప‌ర్ శ్రేయ‌స్‌..
అవును.. ఈ మెగా టోర్నీ అసాంతం శ్రేయ‌స్ అయ్య‌ర్ అద్బుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు. ఈ టోర్నీలో జ‌ట్టు క‌ష్టాల్లో ఉన్న ప్ర‌తీసారి అత‌డు ముందుకు వ‌చ్చి ఆదుకున్నాడు. మిడిలార్డ‌ర్‌లో భార‌త జ‌ట్టు వెన్నెముకగా నిలిచాడు. న్యూజిలాండ్‌తో జ‌రిగిన ఫైన‌ల్ మ్యాచ్‌లోనూ అయ్య‌ర్ కీల‌క ఇన్నింగ్స్ ఆడాడు. 

రోహిత్ శ‌ర్మ ఔటయ్యాక అక్షర్ పటేల్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 61 ప‌రుగుల మ్యాచ్ విన్నింగ్ భాగస్వామ్యం నెల‌కొల్పాడు. ఒక‌వేళ ఈ  భాగస్వామ్యం రాక‌పోయింటే ప‌రిస్థితి మ‌రో విధంగా ఉండేది. ఓవ‌రాల్‌గా శ్రేయ‌స్ 5 మ్యాచ్‌ల్లో 243 పరుగులు చేశాడు. ఈ టోర్న‌మెంట్‌లో భార‌త్ త‌ర‌పున అత్య‌ధిక ప‌రుగుల చేసిన ఆట‌గాడిగా అయ్య‌ర్ నిలిచాడు.

"శ్రేయ‌స్ అయ్య‌ర్ మాకు సైలెంట్ హీరో. అత‌డు మిడిలార్డ‌ర్‌లో చాలా కీల‌క‌మైన ఆట‌గాడు. ఈ మ్యాచ్‌లో నేను ఔట‌య్యాక అయ్య‌ర్ అద్భుత‌మైన ఇన్నింగ్స్ ఆడాడు. అక్షర్‌తో భాగస్వామ్యం నెలకొల్పాడు. ప్రతీ మ్యాచ్‌లోనూ తన వంతు పాత్ర పోషించాడు. అతడు ఒత్తిడిలో ఇంకా అద్బుతంగా ఆడుతాడని" రోహిత్‌ శర్మ పేర్కొన్నాడు.

అప్పుడు వేటు.. ఇప్పుడు ప్ర‌మోష‌న్‌
కాగా గ‌తేడాది అయ్య‌ర్ త‌న కెరీర్‌లో క‌ఠిన పరిస్థితుల‌ను ఎదుర్కొన్నాడు. దేశవాళీ క్రికెట్‌లో ఆడాల‌న్న త‌మ ఆదేశాల‌ను ధిక్క‌రించ‌డంతో అయ్య‌ర్‌ను సెంట్ర‌ల్ కాంట్రాక్ట్ నుంచి బీసీసీఐ త‌ప్పించింది. అంతేకాకుండా అత‌డు జాతీయ జ‌ట్టుకు కూడా దూర‌మ‌య్యాడు. ఈ క్ర‌మంలో అత‌డి ప‌ని అయిపోయింది అంతా భావించారు. కానీ అయ్య‌ర్ మాత్రం ప‌డిలేచిన కేర‌టంలా తిరిగొచ్చాడు.

దేశవాళీ క్రికెట్‌లో అద్బుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రచ‌డంతో అత‌డిని సెల‌క్ట‌ర్లు తిరిగి జాతీయ జ‌ట్టులోకి తీసుకున్నారు. త‌న రీ ఎంట్రీలో అయ్య‌ర్ దుమ్ములేపుతున్నాడు. ఈ క్ర‌మంలో అత‌డికి తిరిగి సెంట్ర‌ల్ కాంట్రాక్ట్ ఇవ్వాల‌ని బీసీసీఐ నిర్ణయించుకుంది. త్వ‌ర‌లోనే బీసీసీఐ అధికారికంగా ప్ర‌క‌టించ‌నుంది.
చదవండి: ఛాంపియ‌న్స్ ట్రోఫీ విజేతగా భార‌త్.. ప్రైజ్‌ మనీ ఎన్ని కోట్లంటే?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement