Rohit Vs Dinesh Karthik: దినేశ్‌ కార్తిక్‌పై రోహిత్‌ శర్మ ఆగ్రహం.. వీడియో వైరల్‌

Rohit Sharma Aggressive Gesture-Towards Dinesh Karthik Not Appeal DRS - Sakshi

ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టి20లో టీమిండియా ఓటమి పాలైన సంగతి తెలిసిందే. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. హార్దిక్‌ పాండ్యా (30 బంతుల్లో 71 నాటౌట్‌; 7 ఫోర్లు, 5 సిక్స్‌లు), కేఎల్‌ రాహుల్‌ (35 బంతుల్లో 55; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు చేయగా, సూర్యకుమార్‌ యాదవ్‌ (25 బంతుల్లో 46; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) రాణించాడు.

అనంతరం ఆస్ట్రేలియా 19.2 ఓవర్లలో 6 వికెట్లకు 211 పరుగులు సాధించి గెలిచింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ కామెరాన్‌ గ్రీన్‌ (30 బంతుల్లో 61; 8 ఫోర్లు, 4 సిక్స్‌లు), మాథ్యూ వేడ్‌ (21 బంతుల్లో 45 నాటౌట్‌; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), స్టీవ్‌ స్మిత్‌ (24 బంతుల్లో 35; 3 ఫోర్లు, 1 సిక్స్‌) కీలక ఇన్నింగ్స్‌ ఆడారు. ఇరు జట్ల మధ్య రెండో టి20 శుక్రవారం నాగపూర్‌లో జరుగుతుంది.

ఇక ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ సమయంలో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కీపర్ దినేశ్ కార్తీక్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ మ్యాచ్ లో రివ్యూల విషయంలో టీమిండియా మొదట్లో కాస్త అలసత్వం ప్రదర్శించింది. తద్వారా కామెరున్ గ్రీన్ బతికిపోయాడు. చహల్ బౌలింగ్ లో గ్రీన్ స్వీప్ షాట్ కు ప్రయత్నించాడు. అయితే బాల్ ప్యాడ్లను తగలగా.. అటు బౌలర్ ఇటు కీపర్ ఎల్బీ కోసం అపీల్ చేయలేదు. ఆ తర్వాత టీవీ రీప్లేలో బంతి వికెట్లను తగులుతుందని తేలింది.

ఆ తర్వాత 12వ ఓవర్ వేయడానికి ఉమేశ్ యాదవ్ రాగా.. స్టీవ్ స్మిత్ కీపర్ షాట్ కు ప్రయత్నించగా బంతి బ్యాట్ ను తాకుతూ దినేశ్ కార్తీక్ చేతిలో పడింది. వెంటనే కార్తీక్ అప్పీల్ చేయగా అంపైర్ నాటౌట్ గా ప్రకటించాడు. అయితే రివ్యూకు వెళ్లిన భారత్ వికెట్ సాధించింది.  అదే ఓవర్లో మరోసారి బంతి మ్యాక్స్ వెల్ బ్యాట్ కు సమీపంగా వెళ్తూ కీపర్ చేతుల్లోకి వెళ్లింది. బ్యాట్ కు సమీపంగా వెళ్లిన సమయంలో చిన్నపాటి సౌండ్ కూడా వచ్చింది. కానీ కార్తిక్‌ అప్పీల్‌ చేయలేదు.. అయితే ఇదే సమయంలో భారత ఆటగాళ్లు అప్పీల్ చేయగా అంపైర్ నాటౌట్గా ప్రకటించాడు. దీంతో రోహిత్ వెంటనే రివ్యూకు వెళ్లాడు. అందులో బ్యాట్ కు బంతి తాకినట్లు స్పష్టంగా కనిపించడంతో అంపైర్‌ ఔట్‌ ఇచ్చాడు.

ఆ తర్వాత రోహిత్ శర్మ ''నీకెన్ని సార్లు చెప్పాలి గట్టిగా అప్పీల్ చేయమని.. రివ్యూకు వెళ్లు అని నాకెందుకు చెప్పవు'' అంటూ సరదాగా కార్తీక్  మొహాన్ని పట్టుకున్నాడు.  ఆ తర్వాత రోహిత్‌.. అభిమానుల వైపు తిరిగి కన్నుకొట్టడంతో ఇదంతా సరదా కోసం చేశాడని తెలిసింది. నిజానికి దినేశ్‌ కార్తిక్‌, రోహిత్‌ శర్మలు మంచి స్నేహితులు. దాదాపు 2007 నుంచి ఇద్దరు టీమిండియాకు కలిసి ఆడుతున్నారు. తమ స్నేహం ఎంత బలంగా ఉందో చూపించడానికే రోహిత్‌.. కార్తిక్‌తో అలా ప్రవర్తించాడని అభిమానులు కామెంట్స్‌ చేశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

చదవండి: 'సరైన బౌలర్లు లేరు.. అందుకే ఓడిపోయాం'

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top