Rohit Sharma: 'సరైన బౌలర్లు లేరు.. అందుకే ఓడిపోయాం'

IND Vs AUS: No Bowlers-In Match Rohit Sharma Reply Question Mohali Loss - Sakshi

ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టి20లో టీమిండియా చేజేతులా ఓటమిని కొనితెచ్చుకుంది. ఫేలవమైన ఫీల్డింగ్‌, బౌలింగ్‌తో టీమిండియా మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఇటీవలే ముగిసిన ఆసియా కప్‌లో సూపర్‌-4 దశలో పాకిస్తాన్‌, శ్రీలంకతో మ్యాచ్‌ల్లో కేవలం బౌలింగ్‌ వల్లే ఓడిపోయింది. తాజాగా ఆస్ట్రేలియాతో సిరీస్‌లోనూ టీమిండియా అదే దోరణిని కంటిన్యూ చేసింది. మ్యాచ్‌ అనంతరం ఓటమిపై కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మీడియాతో మాట్లాడాడు. మ్యాచ్‌లో ఓటమికి కారణం ఏంటని విలేకరులు రోహిత్‌ శర్మను ప్రశ్నించారు. కొద్దిసేపు ఏం మాట్లాడని రోహిత్‌.. ''ఆ తర్వాత బౌలర్లు లేరు.. అందుకే ఓడిపోయాం.. మీకు కావాల్సిన సమాధానం కూడా ఇదే కదా'' అంటూ బదులిచ్చాడు.

''మ్యాచ్‌లో మేము సరిగ్గా బౌలింగ్‌ చేయలేకపోయాం. వాస్తవానికి 200 పరుగులు అనేవి మంచి స్కోరు.. మ్యాచ్‌ను కాపాడుకోవచ్చు. మా బ్యాటర్స్‌ మంచి ప్రదర్శన కనబరిచారు. కానీ సరైన బౌలింగ్‌ లేకపోవడం వల్ల మ్యాచ్‌ దెబ్బతింది. ఈ లోపాలను రాబోయే మ్యాచ్‌ల్లో సరిచేసుకుంటాం. ఈ గ్రౌండ్‌ భారీ స్కోర్లకు పెట్టింది పేరు. 200 పరుగులు చేసినా మనం రిలాక్స్‌ అవ్వడం తప్పు. కానీ ఆస్ట్రేలియా ఈరోజు చాలా బాగా ఆడింది.

మా ఫేలవమైన ఫీల్డింగ్‌, బౌలింగ్‌ ఓటమిని తెచ్చిపెట్టాయి. మా ప్రధాన బౌలర్లు భువనేశ్వర్‌ కుమార్‌, హర్షల్‌ పటేల్‌లు విఫలమవడం దెబ్బతీసింది. అయితే అక్షర్‌ పటేల్‌ తన మ్యాజిక్‌ బౌలింగ్‌తో మ్యాచ్‌ను చేతుల్లోకి తెచ్చినప్పటికి దానిని కాపాడుకోలేకపోయాం. ఆరో బౌలర్‌ సేవలు మాకు ఉన్నాయి. అవి హార్దిక్‌ రూపంలోనే.. వచ్చే మ్యాచ్‌లో ఇలాంటి పొరపాట్లకు తావు లేకుండా చూసుకుంటాం'' అని చెప్పుకొచ్చాడు.

టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. హార్దిక్‌ పాండ్యా (30 బంతుల్లో 71 నాటౌట్‌; 7 ఫోర్లు, 5 సిక్స్‌లు), కేఎల్‌ రాహుల్‌ (35 బంతుల్లో 55; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు చేయగా, సూర్యకుమార్‌ యాదవ్‌ (25 బంతుల్లో 46; 2 ఫోర్లు, 4 సిక్స్‌లు) రాణించాడు. అనంతరం ఆస్ట్రేలియా 19.2 ఓవర్లలో 6 వికెట్లకు 211 పరుగులు సాధించి గెలిచింది. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ కామెరాన్‌ గ్రీన్‌ (30 బంతుల్లో 61; 8 ఫోర్లు, 4 సిక్స్‌లు), మాథ్యూ వేడ్‌ (21 బంతుల్లో 45 నాటౌట్‌; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), స్టీవ్‌ స్మిత్‌ (24 బంతుల్లో 35; 3 ఫోర్లు, 1 సిక్స్‌) కీలక ఇన్నింగ్స్‌ ఆడారు. ఇరు జట్ల మధ్య రెండో టి20 శుక్రవారం నాగపూర్‌లో జరుగుతుంది.

చదవండి: IND Vs AUS: ఇలాంటి ఫీల్డింగ్‌, బౌలింగ్‌తో కష్టమే.. కప్‌ కాదు కదా కనీసం!

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top