పోర్చుగల్‌ కోచ్‌ సంచలన నిర్ణయం | Roberto Martinez Steps Down As Portugal Boss After World Cup Exit To Spain, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

పోర్చుగల్‌ కోచ్‌ సంచలన నిర్ణయం

Jul 7 2026 7:43 AM | Updated on Jul 7 2026 9:45 AM

Roberto Martinez steps down as Portugal boss after World Cup exit to Spain

ఫిఫా వరల్డ్‌కప్ 2026 ప్రీ క్వార్టర్‌లో పోర్చుగల్‌ స్పెయిన్ చేతిలో 0-1 గోల్స్‌ తేడాతో ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ ఓటమి అనంతరం పోర్చుగల్ ప్రధాన కోచ్ రాబర్టో మార్టినెజ్ తన పదవికి రాజీనామా చేశారు. స్పెయిన్‌పై పరాజయంతో తన ఒప్పందం ముగిసిందని, కొత్త కోచ్‌ను ఎంపిక చేసే అవకాశం పోర్చుగీస్ ఫుట్‌బాల్ సమాఖ్యకు ఉందని ఆయన తెలిపారు.

మ్యాచ్ అనంతరం మార్టినెజ్ మాట్లాడుతూ.. "నేను పోర్చుగల్‌కు ప్రపంచకప్ గెలిపించాలనే లక్ష్యంతో వచ్చాను. ఆ లక్ష్యాన్ని సాధించలేకపోయిన తర్వాత పదవిలో కొనసాగడంలో అర్థం లేదు. నా ఒప్పందం ఈరోజుతో ముగుస్తోంది. ఇక కొత్త కోచ్‌ను ఎంపిక చేసే బాధ్యత సమాఖ్యదే" అని చెప్పారు.

అలాగే, "ఇది జాతీయ జట్టుకు కోచ్‌గా నా చివరి మ్యాచ్. పోర్చుగల్ ప్రజలు నన్ను తమలో ఒకరిగా ఆదరించారు. ఈ జట్టుకు కోచ్‌గా పనిచేయడం గర్వకారణం, గొప్ప బాధ్యతగా భావిస్తున్నాను" అని పేర్కొన్నారు.

క్రిస్టియానో రొనాల్డోపై కూడా మార్టినెజ్ ప్రశంసలు కురిపించారు. "రొనాల్డో ఆదర్శప్రాయమైన కెప్టెన్. అతని గోల్స్ మాత్రమే కాదు, అసిస్టులు కూడా జట్టుకు ఎంతో ఉపయోగపడ్డాయి. ముఖ్యంగా ఫుట్‌బాల్ పట్ల అతని అంకితభావం ప్రతి ఆటగాడికి ఆదర్శం. అతని సేవలను ఎప్పటికీ గుర్తుంచుకోవాలి" అని అన్నారు.

2023లో పోర్చుగల్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన మార్టినెజ్‌కు దేశానికి తొలి ప్రపంచకప్ టైటిల్ అందించాలనే లక్ష్యం ఉన్నప్పటికీ అది నెరవేరలేదు. బ్రూనో ఫెర్నాండెస్, బెర్నార్డో సిల్వా, విటిన్హా, రఫాయెల్ లియావో, క్రిస్టియానో రొనాల్డో వంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నా, అతడు జట్టుకు తగిన గుర్తింపు తీసుకురాలేకపోయారనే విమర్శలు ఉన్నాయి.

ముఖ్యంగా 40 ఏళ్లు దాటిన తర్వాత కూడా రొనాల్డో చుట్టూనే దాడి వ్యూహాన్ని నిర్మించడం మార్టినెజ్‌ వైఫల్యానికి నిదర్శనమన్నది చాలామంది అభిప్రాయం. తాజాగా స్పెయిన్‌తో జరిగిన మ్యాచ్‌లోనూ పోర్చుగల్ డిఫెన్స్‌ బాగనే ఉన్నా, బంతిపై ఆధిపత్యం చెలాయించలేక చివరకు మెరినో గోల్‌కు తలవంచాల్సి వచ్చింది.

మ్యాచ్‌ విషయానికొస్తే.. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌లో అదనపు సమయంలో (91వ నిమిషం) మికెల్ మెరినో చేసిన ఏకైక గోల్‌తో స్పెయిన్ విజయం సాధించింది. ఈ పరాజయంతో పోర్చుగల్ ప్రపంచకప్ ప్రయాణం ముగియగా, స్టార్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డోకు ఇదే చివరి ప్రపంచకప్ మ్యాచ్‌గా మిగిలిపోయే అవకాశం ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement