చరిత్ర సృష్టించిన రిషబ్‌ పంత్‌.. 'ఆ ఘనత' సాధించిన తొలి మొనగాడు | Rishabh Pant Becomes The First Indian Wicket Keeper Batter To Have 800 Rating Points In Test History | Sakshi
Sakshi News home page

చరిత్ర సృష్టించిన రిషబ్‌ పంత్‌.. 'ఆ ఘనత' సాధించిన తొలి మొనగాడు

Jun 25 2025 2:40 PM | Updated on Jun 25 2025 3:01 PM

Rishabh Pant Becomes The First Indian Wicket Keeper Batter To Have 800 Rating Points In Test History

టీమిండియా వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ రిషబ్‌ పంత్‌ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐసీసీ టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో 800 రేటింగ్‌ పాయింట్లు సాధించిన తొలి భారత వికెట్‌కీపర్‌ బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. భారత టెస్ట్‌ క్రికెట్‌ చరిత్రలో ఇప్పటివరకు ఏ వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ 800 రేటింగ్‌ పాయింట్లు సాధించలేదు. టీమిండియా దిగ్గజ వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ మహేంద్ర సింగ్‌ ధోనికి కూడా ఇది సాధ్యపడలేదు.

ఐసీసీ తాజాగా (జూన్‌ 25) విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో పంత్‌ 800 రేటింగ్‌ పాయింట్ల మార్కును (801) తాకాడు. అలాగే ర్యాంకింగ్స్‌లో ఓ స్థానం మెరుగపర్చుకొని ఏడో స్థానానికి ఎగబాకాడు. ప్రస్తుతమున్న వికెట్‌కీపర్లలో పంత్‌దే అత్యుత్తమ ర్యాంకింగ్‌. ఇంగ్లండ్‌తో నిన్న (జూన్‌ 24) ముగిసిన తొలి టెస్ట్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు చేయడంతో పంత్‌ ఈ ఘనతలను సాధించాడు.

తాజా ర్యాంకింగ్స్‌లో టాప్‌-10లో పంత్‌తో పాటు మరో భారత బ్యాటర్‌ కూడా ఉన్నాడు. ఇంగ్లండ్‌తో తొలి టెస్ట్‌లో (తొలి ఇన్నింగ్స్‌లో) సెంచరీ చేసిన యశస్వి జైస్వాల్‌ నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. మరో తొలి ఇన్నింగ్స్‌ సెంచరీ హీరో, టీమిండియా నయా కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ ఐదు స్థానాలు మెరుగుపర్చుకొని 20వ స్థానానికి చేరాడు. సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో అద్బుతమైన సెంచరీ చేసిన కేఎల్‌ రాహుల్‌ ఏకంగా 10 స్థానాలు మెరుగుపర్చుకొని 38వ స్థానానికి ఎగబాకాడు.

ఈ వారం ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్‌ ఓపెనర్‌ బెన్‌ డకెట్‌ గణనీయంగా లబ్ది పొందాడు. భారత్‌పై అద్భుతమైన సెంచరీ (149) చేసినందుకు గానూ ఐదు స్థానాలు ఎగబాకి ఎనిమిదో స్థానానికి చేరాడు. ఇంగ్లండ్‌ ఆటగాళ్లలో జో రూట్‌, హ్యారీ బ్రూక్‌ మొదటి రెండు స్థానాల్లో కొనసాగుతుండగా.. ఓలీ పోప్‌ 3 స్థానాలు మెరుగుపర్చుకొని 19వ స్థానానికి ఎగబాకాడు. కేన్‌ విలియమ్సన్‌ 3, స్టీవ్‌ స్మిత్‌ 5, టెంబా బవుమా 6, కమిందు మెండిస్‌ 9, సౌద్‌ షకీల్‌ 10 స్థానాల్లో ఉన్నారు.

మిగతా బ్యాటర్ల విషయానికొస్తే.. ఇటీవల శ్రీలంకతో జరిగిన తొలి టెస్ట్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు చేసిన బంగ్లాదేశ్‌ కెప్టెన్‌ నజ్ముల్‌ షాంటో ఏకంగా 21 స్థానాలు మెరుగుపర్చుకొని 29వ స్థానానికి చేరగా.. అదే మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన మరో బంగ్లాదేశీ ముష్ఫికర్‌ రహీం 11 స్థానాలు మెరుగుపర్చుకొని 28వ స్థానానికి ఎగబాకాడు. అదే మ్యాచ్‌లో భారీ సెంచరీ చేసిన శ్రీలంక ఆటగాడు పథుమ్‌ నిస్సంక కూడా 21 స్థానాలు మెరుగుపర్చుకొని 31వ స్థానానికి ఎగబాకాడు. ఈ వారం​ బ్యాటింగ్‌ ర్యాంకింగ్స్‌లో ఇవే చెప్పుకోదగ్గ మార్పులు.

బౌలర్ల ర్యాంకింగ్స్‌ విషయానికొస్తే.. టాప్‌-10 పెద్దగా మార్పులేమీ లేవు. బుమ్రా, రబాడ, కమిన్స్‌, నౌమన్‌ అలీ, హాజిల్‌వుడ్‌, నాథన్‌ లియోన్‌, జన్సెన్‌, మ్యాట్‌ హెన్రీ టాప్‌-8లో కొనసాగుతున్నారు. మిచెల్‌ స్టార్క్‌ ఓ స్థానం ఎగబాకి తొమ్మిదో స్థానానికి చేరాడు. భారత్‌తో తాజాగా జరిగిన టెస్ట్‌లో రాణించిన బ్రైడన్‌ కార్స్‌ 8 స్థానాలు, జోష్‌ టంగ్‌ 16 స్థానాలు మెరుగుపర్చుకొని 32, 64 స్థానాలకు ఎగబాకారు. ఇంగ్లండ్‌తో తొలి టెస్ట్‌లో పర్వాలేదనిపించిన భారత పేసర్‌ ప్రసిద్ద్‌ కృష్ణ 21 స్థానాలు మెరుగుపర్చుకొని 72వ ప్లేస్‌కు చేరాడు. ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో రవీంద్ర జడేజా, మెహిది హసన్‌ మిరాజ్‌, జన్సెన్‌ టాప్‌-3లో కొనసాగుతున్నారు.   

Advertisement
 
Advertisement
Advertisement