సచిన్‌ అంతటి వాడవుతాడు.. పోలికలే కొంపముంచుతున్నాయి! ఇప్పుడు.. | Sakshi
Sakshi News home page

సచిన్‌ అంతటి వాడవుతాడు.. పోలికలే కొంపముంచుతున్నాయి! తొందరపడి ముందే ఎందుకు?

Published Tue, Nov 28 2023 6:44 PM

Is Rinku Singh playing like MS Dhoni Stop Comparisons He Need Backing - Sakshi

ఓ ప్లేయర్‌ అద్భుతంగా ఆడుతూ ఉంటే.. ఆ క్రీడలో దిగ్గజాలతో పోలిక పెట్టి మాట్లాడుతూ విశ్లేషణలు సహజం. అయితే, కొన్నిసార్లు ఆ పోలిక వాళ్లకు చేకూర్చే మేలు కంటే.. నష్టమే ఎక్కువగా ఉంటుందని చెప్పవచ్చు. కొంతమంది టీమిండియా యువ క్రికెటర్ల విషయంలో ఇలాగే జరిగింది.

ప్రస్తుతం.. అంతర్జాతీయ టీ20లలో రింకూ సింగ్‌ అదరగొడుతున్న తరుణంలో దిగ్గజ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోనితో అతడి ఆట తీరును పోలుస్తున్నారు విశ్లేషకులు. ధోని స్టైల్లో మ్యాచ్‌ ముగిస్తున్న తీరుకు ఫిదా అవుతూ నయా ఫినిషర్‌ వచ్చేశాడంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

అయితే, మరికొందరు మాత్రం ఇప్పుడే ధోని వారసుడిగా ట్యాగ్‌ వేసి రింకూపై ఒత్తిడి పెంచొద్దనే అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. విధ్వంసకర బ్యాటింగ్‌తో ప్రత్యర్థి జట్టు బౌలర్లపై విరుచుకుపడుతున్న రింకూపై ఇలాంటి ప్రశంసలు ఒత్తిడి పెంచే అవకాశం ఉందని పేర్కొంటున్నారు.

హార్దిక్‌ వారసుడంటూ..
గతంలో వెంకటేశ్‌ అయ్యర్‌, పృథ్వీ షా విషయంలో ఇలాంటి పోలికలు కొంపముంచాయంటూ వారి పేర్లను ఉదాహరిస్తున్నారు. కాగా ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న వెంకటేశ్‌ అయ్యర్‌.. ఐపీఎల్‌ 2021లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న విషయం తెలిసిందే.

ఈ క్రమంలో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన ఈ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా స్థానాన్ని భర్తీ చేయగలడంటూ ప్రశంసల వర్షం కురిసింది. గాయాల బెడదతో సతమతమవుతున్న పాండ్యా కెరీర్‌ సందిగ్దంలో పడిన సమయంలో వెంకటేశ్‌ అతడి వారసుడిగా భారత జట్టులో చోటు ఖాయం చేసుకోవడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

జట్టులో చోటే కరువు
కానీ.. పాండ్యా రీఎంట్రీ ఇచ్చి.. వైస్‌ కెప్టెన్‌ స్థాయికి ఎదిగిన తర్వాత వెంకటేశ్‌ అయ్యర్‌కు జట్టులో స్థానమే కరువైంది. గతేడాది ఫిబ్రవరిలో చివరగా వెంకటేశ్‌ టీమిండియా తరఫున ఆడాడు.

సచిన్‌ అంతటి వాడవుతాడు
ఇక పృథ్వీ షా.. ఈ ముంబై బ్యాటర్‌ దేశవాళీ క్రికెట్‌లో రాణిస్తున్న సమయంలోనే దిగ్గజ బ్యాటర్‌ సచిన్‌ టెండుల్కర్‌తో పోలిక తెచ్చారు విశ్లేషకులు. భవిష్యత్తులో కచ్చితంగా టీమిండియా ఓపెనర్‌గా అద్భుతాలు చేస్తాడని ఈ అండర్‌-19 వరల్డ్‌కప్‌ విన్నింగ్‌ కెప్టెన్‌ను కొనియాడారు.

తన కెప్టెన్సీలో ఆడిన వాళ్లు స్టార్లు.. అతడేమో ఇలా
కానీ.. సీన్‌ రివర్స్‌ అయింది.. పృథ్వీ కెప్టెన్సీలో ఆడిన శుబ్‌మన్‌ గిల్‌, ఇషాన్‌ కిషన్‌ భారత జట్టులో తమ స్థానం సుస్థిరం చేసుకున్నారు. ముఖ్యంగా శుబ్‌మన్‌ ఇప్పటికే మూడు ఫార్మాట్లలో ఓపెనర్‌గా పాతుకుపోయి.. భావి భారత జట్టు కెప్టెన్‌గా, తదుపరి సూపర్‌స్టార్‌గా నీరాజనాలు అందుకుంటున్నాడు.

అయితే, పృథ్వీ షాకు టీమిండియాలో ఎంట్రీ కాదు.. కనీసం ఐపీఎల్‌లో అయినా స్టార్‌ బ్యాటర్‌గా గుర్తింపు దక్కడం లేదు. వరుస వైఫల్యాలతో చతికిలపడ్డ పృథ్వీని గాయాలు వేధిస్తుండటంతో దెబ్బమీద దెబ్బ పడుతోంది. అతడు మళ్లీ భారత జట్టులో పునరాగమనం చేయడం దాదాపు అసాధ్యంగా కనిపిస్తోంది.

ఇప్పుడు రింకూ విషయంలో ఇలా..
ఉత్తరప్రదేశ్‌కు చెందిన లెఫ్టాండ్‌ బ్యాటర్‌ రింకూ సింగ్‌. అనేక కష్టనష్టాలకోర్చి క్రికెటర్‌గా తన ప్రయాణం మొదలుపెట్టాడు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మేనేజ్‌మెంట్‌ దృష్టిలో పడటంతో అతడి దశ తిరిగింది.

అంచెలంచెలుగా ఎదిగి టీమిండియా స్థాయికి
ఇంటింటికీ సిలిండర్లు మోస్తూ తండ్రి సంపాదిస్తే.. తాను స్వీపర్‌గా పనిచేసేందుకు కూడా సిద్ధపడి కుటుంబాన్ని ఆదుకోవాలని నిర్ణయించుకున్న రింకూ.. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఆటను మాత్రం వీడలేదు.

అంచెలంచెలుగా ఎదిగి తాజా ఐపీఎల్‌ సీజన్‌లో గుజరాత్‌ టైటాన్స్‌తో మ్యాచ్‌లో వరుసగా ఆరు సిక్సర్లు బాది కేకేఆర్‌ను గెలపించిన తీరు నభూతో అనిపించింది. ఈ క్రమంలో.. 2023, ఆగష్టులో ఐర్లాండ్‌తో టీ20 సందర్భంగా అతడు టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు.

నయా ఫినిషర్‌గా కితాబులు
ప్రస్తుతం స్వదేశంలో ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌తో బిజీగా ఉన్న రింకూ.. మొత్తంగా 7 మ్యాచ్‌లు ఆడి 216.95 స్ట్రైక్‌రేటుతో 128 పరుగులు సాధించాడు. ఆరో స్థానంలో బ్యాటింగ్‌ చేస్తూ తనదైన శైలిలో ఫినిషింగ్‌ టచ్‌ ఇస్తూ జట్టుకు విజయాలు అందిస్తున్నాడు.

ఈ నేపథ్యంలోనే ధోనితో పోలిక తెస్తూ రింకూ ఆట తీరును కొనియాడుతూ తాత్కాలిక కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ సహా పలువురు మాజీ క్రికెటర్లు కామెంట్లు చేస్తున్నారు. త్వరలోనే వన్డే క్రికెట్‌లోనూ అతడు అడుగుపెడతాడని జోస్యం చెబుతున్నారు.

పోలికలు వద్దు.. మద్దతు ముఖ్యం
అయితే, మరికొంత మంది మాత్రం.. రింకూను ఇప్పుడు ప్రశంసిస్తున్న వాళ్లు కష్టకాలంలో అతడికి అండగా నిలబడితే చాలని.. పోలికలకు బదులు నైతికంగా మద్దతునివ్వడం అతి ముఖ్యమని పేర్కొంటున్నారు.

రింకూ ధోని స్థాయికి ఎదిగే సత్తా ఉన్నవాడే అయినా కెరీర్‌ ఆరంభంలోనే పోలికలు తెచ్చి అతడిపై అనవసరపు ఒత్తిడి పెంచొద్దని హితవు పలుకుతున్నారు. కాగా పటిష్ట ఆసీస్‌తో ఇప్పటి వరకు ఆడిన రెండు టీ20లలో రింకూ ధనాధన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు.  వరుసగా.. 22(14 బంతుల్లో), 31(9 బంతుల్లో) పరుగులు సాధించాడు.

చదవండి: క్రికెటర్లు అలా ఎందుకు మాట్లాడతారో అర్థం కాదు.. నేనైతే 2011లో: గంభీర్‌

Advertisement
Advertisement