
టీమిండియా బౌలర్ దీపక్ చహర్ చీలమండ గాయంతో సౌతాఫ్రికాతో జరగనున్న మిగతా రెండు వన్డేలకు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలి వన్డే మ్యాచ్ ప్రారంభానికి ముందు ప్రాక్టీస్ సెషన్‌లో బౌలింగ్ చేసిన దీపక్ చహర్‌కు కాలు బెణికింది. దీంతో తొలి వన్డేకు చహర్ దూరంగా ఉన్నాడు. అయితే గాయం తీవ్రత పెద్దగా లేకపోయినప్పటికి టి20 ప్రపంచకప్ దృశ్యా మిగతా రెండు వన్డేల నుంచి దీపక్ చహర్‌కు విశ్రాంతి ఇచ్చినట్లు జట్టు మేనేజ్‌మెంట్ తెలిపింది.
''కాలు బెణికినప్పటికి పెద్దగా ఆందోళన చెందాల్సిన పని లేదు. కొద్దిరోజులు రెస్ట్ తీసుకుంటే బెటర్ అని మా అభిప్రాయం. అందునా టి20 ప్రపంచకప్‌కు దీపక్ చహర్ స్టాండ్ బై ప్లేయర్‌గా ఉన్నాడు. గాయంతో టి20 ప్రపంచకప్‌కు దూరమైన బుమ్రా స్థానంలో షమీ లేదా దీపక్ చహర్‌లలో ఒకరిని ఆడించాలని చూస్తోంది. ఒకవేళ షమీ ఫిట్‌నెస్ నిరూపించుకుంటే చహర్ స్టాండ్ బై ప్లేయర్‌గానే ఉంటాడు. అలా కాకుండా షమీ ఫిట్‌నెస్‌లో విఫలమైతే మాత్రం అప్పుడు దీపక్ చహర్ అవసరం ఉంటుంది. ఇది దృష్టిలో పెట్టుకొనే చహర్‌కు ప్రస్తుతం విశ్రాంతి ఇచ్చినట్లు'' బీసీసీఐ అధికారి ఒకరు పేర్కొన్నారు.
ఇక దీపక్ చహర్ లేని లోటు స్పష్టంగా కనిపించింది. డెత్ ఓవర్లలో మంచి బౌలింగ్ కనబరిచే చహర్ మ్యాచ్‌కు దూరమవడంతో శిఖర్ ధావన్ నేతృత్వంలోని టీమిండియా విజయానికి తొమ్మిది పరుగుల దూరంలో ఆగిపోయింది. బ్యాటింగ్‌లో సంజూ శాంసన్, శ్రేయాస్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్‌లు రాణించినప్పటికి టాపార్డర్ విఫలం కావడంతో టీమిండియా పరాజయాన్ని మూటగట్టుకోవాల్సి వచ్చింది. ఇక సౌతాఫ్రికా, టీమిండియాల మధ్య రెండో వన్డే ఆదివారం(అక్టోబర్ 9న) రాంచీ వేదికగా జరగనుంది.