రెడ్‌ ఫర్‌ రూత్‌... 

Red For Ruth Test Match Conducted By England Cricket Board - Sakshi

ఓల్డ్‌ట్రాఫోర్డ్‌ టెస్టును ఇంగ్లండ్‌ బోర్డు ‘రూత్‌ స్ట్రాస్‌ ఫౌండేషన్‌ టెస్ట్‌’గా వ్యవహరిస్తోంది. అరుదైన ఊపిరితిత్తుల క్యాన్సర్‌ (పొగ తాగనివారిలో వస్తుంది)తో రెండేళ్ల క్రితం మరణించిన మాజీ కెప్టెన్‌ ఆండ్రూ స్ట్రాస్‌ భార్య రూత్‌ స్మారకార్థం ఏర్పాటు చేసిన ట్రస్ట్‌ కోసం నిధుల సేకరణ దీని ఉద్దేశం. ఈ మ్యాచ్‌కు ముందు ఎరుపు రంగు జెర్సీలు, క్యాప్‌లు ధరించి ‘రెడ్‌ ఫర్‌ రూత్‌’ అంటూ తమ సంఘీభావాన్ని ప్రకటించిన ఇంగ్లండ్, వెస్టిండీస్‌ ఆటగాళ్లు ఆ తర్వాత వాటిపై తమ సంతకాలు చేసి వేలం కోసం స్ట్రాస్‌ కుమారులకు తిరిగి అందజేశారు.

మ్యాచ్‌ రెండో రోజు శనివారం స్టంప్స్, బౌండరీ బోర్డులు సహా మైదానమంతా ఎరుపు రంగును ప్రదర్శిస్తారు. ‘రెడ్‌ ఫర్‌ రూత్‌’ అంటూ విరాళాల సేకరించడం ఇది రెండోసారి. 2019లో యాషెస్‌ సిరీస్‌లో భాగంగా జరిగిన లార్డ్స్‌ టెస్టు ద్వారా సుమారు 5.5 లక్షల పౌండ్లు వచ్చాయి. క్యాన్సర్‌తో మరణించిన వారి పిల్లల సంక్షేమం కోసం ఈ నిధులను ఉపయోగిస్తారు. ఈసారి కోవిడ్‌ కారణంగా మైదానంలో ప్రేక్షకులు లేకపోవడం వెలితిగా అనిపించినా... ఆన్‌లైన్‌ ద్వారా పెద్ద మొత్తంలో టీ షర్ట్‌లు, క్యాప్‌లు కొని అభిమానులు అండగా నిలిచారు. ఇంగ్లండ్‌ తరఫున 100 టెస్టుల్లో 7,037 పరుగులు చేసిన స్ట్రాస్‌ 50 టెస్టుల్లో జట్టుకు నాయకత్వం వహించాడు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top