
తమిళనాడు ప్రీమియర్ లీగ్-2025లో దిండిగల్ డ్రాగన్స్ జట్టు క్వాలిఫయర్-2కు ఆర్హత సాధించింది. బుధవారం ఎన్‌పీఆర్ కాలేజీ గ్రౌండ్ వేదికగా జరిగిన ఎలిమినేటర్‌లో ట్రిచీ గ్రాండ్ చోళస్‌పై 6 వికెట్ల తేడాతో దిండిగల్ ఘన విజయం సాధించింది. దీంతో శుక్రవారం జరగనున్న క్వాలిఫయర్-2లో చెపాక్ సూపర్ గిల్లీస్‌తో దిండిగల్ డ్రాగన్స్ అమీతుమీ తెల్చుకోనుంది.
కాగా ఎలిమేనటర్‌లో టీమిండియా స్పిన్ లెజెండ్, దిండిగల్ కెప్టెన్ రవిచంద్రన్ ఆశ్విన్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టాడు. తొలుత బౌలింగ్‌లో మూడు వికెట్లు పడగొట్టి ప్రత్యర్ధి పతనాన్ని శాసించిన ఆశ్విన్.. ఆ తర్వాత బ్యాటింగ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 141 పరుగుల లక్ష్య చేధనలో ప్రత్యర్ధి బౌలర్లను ఆశూ ఉతికారేశాడు.
కేవలం 48 బంతుల్లోనే 11 ఫోర్లు, మూడు భారీ సిక్సర్లతో 83 పరుగులు చేశాడు. ఆశ్విన్‌తో పాటు బాబా ఇంద్రజిత్(27) ఆజేయంగా నిలిచి మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. ట్రిచీ బౌలర్లలో ఈశ్వరన్ రెండు వికెట్లు పడగొట్టగా.. శర్వన్ కుమార్, డేవిడ్‌సన్ తలా వికెట్ సాధించారు.
అంతకుముందు బ్యాటింగ్ చేసిన ట్రిచీ గ్రాండ్ చోళస్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేసింది. ట్రిచీ బ్యాటర్లలో జాఫర్ జమాల్(33), వసీం అహ్మద్(36) రాణించారు. డ్రాగన్స్ బౌలర్లలో ఆశ్విన్‌తో పాటు జి పెరియస్వామి, వరుణ్ చక్రవర్తి తలా రెండు వికెట్లు సాధించారు.
చదవండి: గిల్.. నిన్ను చూసి గ్రేమ్ స్మిత్ గర్వపడుతుంటాడు: యువరాజ్