Hyd Vs DEL: దంచికొట్టిన ఆయుశ్‌.. 7 వికెట్లతో చెలరేగిన హర్షిత్‌.. ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లోనూ హైదరాబాద్‌ ఓటమి

Ranji Trophy HYD Vs DEL: Delhi Beat Hyderabad By 9 Wickets - Sakshi

Ranji Trophy 2022-23 - Hyderabad vs Delhi: రంజీ ట్రోఫీ 2022-23ని హైదరాబాద్‌ క్రికెట్‌ జట్టు మరో ఓటమితో ముగించింది. గ్రూప్‌ ‘బి’లో భాగంగా ఢిల్లీ జట్టుతో ఉప్పల్‌లో జరిగిన చివరి లీగ్‌ మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. కాగా ఆట మూడో రోజు(గురువారం) ఓవర్‌నైట్‌ స్కోరు 223/5తో తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన ఢిల్లీ జట్టు ఆయుశ్‌ బదోని వీరోచిత సెంచరీతో భారీ స్కోరు నమోదు చేసింది. 

అదరగొట్టిన ఆయుశ్‌ బదోని
నిజానికి 277 పరుగులకు 8 వికెట్లు కోల్పోయి 300 పరుగుల్లోపే ఆలౌట్‌ అయ్యేలా కనిపించింది. అయితే ఆయుశ్‌ బదోని (191; 24 ఫోర్లు, 6 సిక్స్‌లు) అసాధారణరీతిలో ఆడి భారీ సెంచరీ సాధించాడు. పదో నంబర్‌ బ్యాటర్‌ హర్షిత్‌ రాణా (58; 8 ఫోర్లు, 1 సిక్స్‌)తో కలిసి ఆయుశ్‌ ఢిల్లీ జట్టుకు తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యాన్ని అందించాడు. ఆయుశ్, హర్షిత్‌ తొమ్మిదో వికెట్‌కు 122 పరుగులు జోడించారు.

‘డబుల్‌ సెంచరీ’కి చేరువైన దశలో.. అనికేత్‌ రెడ్డి బౌలింగ్‌లో ఆయుశ్‌ బౌల్డయ్యాడు. ఆ తర్వాత దివిజ్‌ మెహ్రా (8 నాటౌట్‌)తో కలిసి హర్షిత్‌ చివరి వికెట్‌కు 34 పరుగులు జత చేశాడు. అజయ్‌దేవ్‌ గౌడ్‌ బౌలింగ్‌లో హర్షిత్‌ ఎల్బీగా వెనుదిరగడంతో ఢిల్లీ ఇన్నింగ్స్‌ ముగిసింది. హైదరాబాద్‌ బౌలర్లలో అనికేత్‌ రెడ్డి 143 పరుగులిచ్చి 5 వికెట్లు, అజయ్‌దేవ్‌ గౌడ్‌ 87 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టారు.    

ఢిల్లీ భారీ స్కోరు
ఈ నేపథ్యంలో 433 పరుగులకు ఆలౌటైన ఢిల్లీ 78 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం సంపాదించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన హైదరాబాద్‌ మూడో రోజు ఆట ముగిసే సమయానికి 5 వికెట్లు కోల్పోయి 90 పరుగులు చేసి కేవలం 12 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఈ క్రమంలో శుక్రవారం నాటి నాలుగో రోజు ఆటలో భాగంగా 124 వద్ద రెండో ఇన్నింగ్స్‌ ముగించింది.

7 వికెట్లతో చెలరేగిన హర్షిత్‌ రాణా
ఇక తొలి ఇన్నింగ్స్‌లో 153 పరుగులతో అజేయంగా నిలిచిన రోహిత్‌ రాయుడు.. రెండో ఇన్నింగ్స్‌లో 32 పరుగులతో హైదరాబాద్‌ బ్యాటర్లలో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. మిగిలిన వాళ్లలో తోల్కంటి గౌడ్‌ (21), ప్రణీత్‌ రాజ్‌ మాత్రమే (27) 20 పైగా పరుగులు చేశారు. మిగతా వాళ్లంతా చేతులెత్తేశారు. ఢిల్లీ బౌలర్‌ హర్షిత్‌ రాణా ధాటికి బెంబేలెత్తి పెవిలియన్‌కు క్యూ కట్టారు. దీంతో 124 పరుగులకే హైదరాబాద్‌ ఆలౌట్‌ అయింది.

ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఢిల్లీ ఒక వికెట్‌ కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో హైదరాబాద్‌ ఓటమి ఖాయమైంది. కాగా 12 ఓవర్లలో 45 పరుగులు ఇచ్చి 7 వికెట్లు కూల్చి హైదరాబాద్‌ జట్టు పతనాన్ని శాసించిన హర్షిత్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు. మరో ఢిల్లీ బౌలర్‌ దివిజ్‌ మెహ్రా 3 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. 

‘ప్లేట్‌’ డివిజన్‌కు పడిపోయిన హైదరాబాద్‌
హైదరాబాద్‌ కేవలం ఒక్క పాయింట్‌తో గ్రూప్‌ ‘బి’లోనే కాకుండా ఎలైట్‌ లీగ్‌లోని నాలుగు గ్రూప్‌ల్లో కలిపి చివరి స్థానంలో నిలిచింది. కాగా ఎలైట్‌ గ్రూప్‌ల్లో ఓవరాల్‌గా చివరి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు వచ్చే సీజన్‌కు ‘ప్లేట్‌’ డివిజన్‌కు పడిపోతాయి.  

రంజీ ట్రోఫీ 2022-23 హైదరాబాద్‌ వర్సెస్‌ ఢిల్లీ మ్యాచ్‌ స్కోర్లు
హైదరాబాద్‌- 355 & 124
ఢిల్లీ- 433 & 47/1

చదవండి: Sania Mirza: సానియా మీర్జా భావోద్వేగం.. ఓటమితో ముగింపు! కెరీర్‌లో ఎన్ని గ్రాండ్‌స్లామ్‌ టైటిళ్లు అంటే?
Axar Patel: పెళ్లి పీటలెక్కిన టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌.. ఫొటోలు వైరల్‌

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top