
అన్షుల్ కంబోజ్ (PC: BCCI)
ఊహించిందే జరిగింది.. ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టు సందర్భంగా భారత యువ పేసర్ అన్షుల్ కంబోజ్ అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేశాడు. ఆకాశ్ దీప్ స్థానంలో తుదిజట్టులో చోటు దక్కించుకున్నాడు. తద్వారా మాంచెస్టర్‌లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన రెండో భారత ఆటగాడిగా అన్షుల్ రికార్డులకెక్కాడు.
కుంబ్లే తర్వాత అన్షులే
అంతకుముందు స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే 1990లో ఇదే వేదికపై భారత్ తరఫున తన తొలి టెస్టు మ్యాచ్ ఆడాడు. అయితే, ఇక్కడ ఇంకో ఆసక్తికర అంశం ఏమిటంటే..
ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అనిల్ కుంబ్లే, అన్షుల్ కంబోజ్ ఇద్దరూ 10 వికెట్ల హాల్ కలిగి ఉండటం విశేషం. ఓ ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లో ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్ల ప్రదర్శన నమోదు చేసిన అతి కొద్ది మంది బౌలర్ల జాబితాలో ఉన్న వీరు.. ఒకే వేదికపై టెస్టులో అడుగుపెట్టడం గమనార్హం.
ఎవరీ అన్షుల్ కంబోజ్?
కాగా భారత్ తరఫున టెస్టుల్లో అరంగేట్రం చేసిన ఆటగాళ్లలో అన్షుల్ 318వ ప్లేయర్. 24 ఏళ్ల ఈ రైటార్మ్ పేసర్ స్వస్థలం హర్యానాలోని కర్నాల్. గతేడాది రంజీ ట్రోఫీలో భాగంగా రోహ్‌తక్ వేదికగా కేరళతో మ్యాచ్‌లో అన్షుల్ అదరగొట్టాడు. కేరళ ఇన్నింగ్స్‌లో పది వికెట్లు కూల్చి సత్తా చాటాడు.
తాజాగా ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టుతో అన్షుల్ కంబోజ్ అరంగేట్రం సందర్భంగా... భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేసింది. కాగా 2022లో ఢిల్లీ వేదికగా త్రిపురతో మ్యాచ్ సందర్భంగా అన్షుల్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో అడుగుపెట్టాడు.
గత మూడేళ్లకాలంలో ఓవరాల్‌గా ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 24 మ్యాచ్‌లు ఆడిన అన్షుల్ కంబోజ్ 79 వికెట్లు పడగొట్టాడు. అంతేకాదు.. ఈ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ ఖాతాలో 486 పరుగులు కూడా ఉన్నాయి. గతేడాది దులిప్ ట్రోఫీలో భాగంగా ఇండియా-సి తరఫున మూడు మ్యాచ్‌లు ఆడిన కంబోజ్ 16 వికెట్లు తీశాడు.
ఇంగ్లండ్ గడ్డ మీద
ఇక ఇటీవల ఇంగ్లండ్ లయన్స్‌తో భారత్-ఎ ఆడిన అనధికారిక టెస్టు సిరీస్‌లోనూ అన్షుల్ కంబోజ్ భాగమయ్యాడు. నార్తాంప్టన్‌లో జరిగిన రెండో అనధికారిక టెస్టులో నాలుగు వికెట్లు కూల్చడంతో పాటు.. తొమ్మిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి 51 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడి కెరీర్‌లో ఇదే అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు.
ఇక ఐపీఎల్‌లో గతేడాది ముంబై ఇండియన్స్‌కు ఆడిన అన్షుల్.. ఈసారి చెన్నై సూపర్ కింగ్స్ తరఫున బరిలోకి దిగాడు. క్యాష్ రిచ్ లీగ్‌లో ఇప్పటి వరకు మొత్తంగా పదకొండు మ్యాచ్‌లు ఆడి పది వికెట్లు కూల్చాడు.
వెనుకబడిన టీమిండియా
ఇదిలా ఉంటే.. టెండుల్కర్- ఆండర్సన్ ట్రోఫీ ఆడేందుకు టీమిండియా ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లింది. ఇందులో భాగంగా ఆతిథ్య జట్టుతో ఐదు టెస్టులు ఆడుతోంది. ఈ సిరీస్‌తో భారత టెస్టు జట్టు కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టాడు శుబ్‌మన్ గిల్. అతడి సారథ్యంలో లీడ్స్‌లో తొలి టెస్టు ఓడిన టీమిండియా.. ఎడ్జ్‌బాస్టన్‌లో గెలిచి చారిత్రాత్మక విజయం నమోదు చేసింది.
అయితే, లార్డ్స్‌లో చివరి వరకు పోరాడి టీమిండియా 22 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో ఇంగ్లండ్ ప్రస్తుతం 2-1తో ఆధిక్యంలో ఉండగా.. మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రఫోర్డ్ మైదానంలో నాలుగో టెస్టు జరుగుతోంది. ఈ వేదికపై ఒక్కసారి కూడా టెస్టు మ్యాచ్ గెలవని టీమిండియా.. ఈసారి అసాధ్యాన్ని సుసాధ్యం చేయాలని పట్టుదలగా ఉంది.
ఇక ఈ మ్యాచ్‌కు ముందే ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి, ఆకాశ్ దీప్ గాయాల వల్ల దూరం కాగా.. వీరి స్థానాల్లో శార్దూల్ ఠాకూర్, అన్షుల్ కంబోజ్ తుదిజట్టులోకి వచ్చినట్లు కెప్టెన్ గిల్ వెల్లడించాడు. మరోవైపు.. వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న కరుణ్ నాయర్‌పై వేటు పడగా.. సాయి సుదర్శన్ రీఎంట్రీ ఇచ్చాడు.
ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టుకు భారత తుదిజట్టు
యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, అన్షుల్ కంబోజ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.
Shine on, young lad 🙌🙌#TeamIndia #ENGvIND https://t.co/BLDRZz8Gu7
— BCCI (@BCCI) July 23, 2025