నాదల్‌ @ 1000

Rafael Nadal becomes fourth player to earn 1000 wins - Sakshi

కెరీర్‌లో వేయి విజయాలు అందుకున్న దిగ్గజం

ఈ ఘనత సాధించిన నాలుగో ఆటగాడిగా గుర్తింపు  

పారిస్‌: స్పెయిన్‌ బుల్‌ రాఫెల్‌ నాదల్‌ తన అసమాన కెరీర్‌లో మరో మైలురాయిని దాటాడు. పారిస్‌ మాస్టర్స్‌–1000 టెన్నిస్‌ టోర్నమెంట్‌లో ప్రిక్వార్టర్స్‌కు చేరడం ద్వారా... 1000వ విజయాన్ని నమోదు చేశాడు. భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి దాటాక ముగిసిన రెండో రౌండ్‌ మ్యాచ్‌లో ప్రపంచ రెండో ర్యాంకర్‌ నాదల్‌ 4–6, 7–6 (7/5), 6–4తో ఫెలిసియానో లోపెజ్‌ (స్పెయిన్‌)పై గెలుపొందాడు. తద్వారా ఓపెన్‌ శకం (1968 తర్వాత)లో వేయి విజయాలు సాధించిన నాలుగో ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.

నాదల్‌కంటే ముందు ఈ జాబితాలో జిమ్మీ కానర్స్‌ (1,274), రోజర్‌ ఫెడరర్‌ (1,242), ఇవాన్‌ లెండిల్‌ (1,068) ఉన్నారు. 2002 ఏప్రిల్‌ 29న 16 ఏళ్ల వయసులో రమోన్‌ డెల్గాడో (పరాగ్వే)పై గెలుపుతో.... తన విజయాల వేటను ఆరంభించిన నాదల్‌æ... 2011లో జరిగిన బార్సిలోనా ఓపెన్‌ సెమీఫైనల్లో ఇవాన్‌ డొడిగ్‌ (క్రొయేషియా)పై నెగ్గడంతో కెరీర్‌లో 500వ విజయాన్ని అందుకున్నాడు. ఈ ఏడాది జరిగిన ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో చాంపియన్‌గా నిలవడం ద్వారా 20వ గ్రాండ్‌స్లామ్‌ను సాధించిన నాదల్‌... పురుషుల విభాగంలో ఫెడరర్‌ పేరిట ఉన్న అత్యధిక గ్రాండ్‌స్లామ్‌ రికార్డు (20)ను సమం చేశాడు.

క్వార్టర్స్‌లో బోపన్న జంట
పారిస్‌ మాస్టర్స్‌–1000 టెన్నిస్‌ టోర్నమెంట్‌లో భారత ప్లేయర్‌ రోహన్‌ బోపన్న– ఒలివర్‌    మరాచ్‌ (ఆస్ట్రియా) జంట క్వార్టర్‌ ఫైనల్స్‌లో అడుగు పెట్టింది. పురుషుల డబుల్స్‌                విభాగంలో జరిగిన రెండో రౌండ్‌ మ్యాచ్‌లో బోపన్న–ఒలివర్‌ ద్వయం 3–6, 6–4, 10–8తో తొమ్మిదో సీడ్‌ ఫాబ్రిస్‌ మార్టిన్‌ (ఫ్రాన్స్‌)–జీన్‌ జులియన్‌ రోజెర్‌ (నెదర్లాండ్స్‌) జంటపై  గెలిచింది.

‘వేయి మ్యాచ్‌లు గెలిచానంటే నాకు వయసు మీద పడినట్లే లెక్క. నా కెరీర్‌లో నేను సాధించిన విజయాల పట్ల గర్వపడుతున్నా. అలాగే ఈ మైలురాయిని కూడా. గాయాల రూపంలో అనేక ఇబ్బందులు ఎదురైనా టెన్నిస్‌పై ఉన్న అంకిత భావం నన్ను ముందుకు సాగేలా చేసింది. అందుకే ఇంత కాలం బాగా ఆడగలిగాను. ఇప్పుడు అదే నాకు 1000వ విజయాన్ని అందించింది’      
 – నాదల్‌  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top