ఆపరేషన్‌ సిందూర్ ఎఫెక్ట్‌.. దుబాయ్ వేదిక‌గా పీఎస్ఎల్ మ్యాచ్‌లు? | PSL 2025 disrupted after Operation Sindoor, matches could be shifted to Dubai | Sakshi
Sakshi News home page

ఆపరేషన్‌ సిందూర్ ఎఫెక్ట్‌.. దుబాయ్ వేదిక‌గా పీఎస్ఎల్ మ్యాచ్‌లు?

May 8 2025 9:16 PM | Updated on May 8 2025 9:20 PM

PSL 2025 disrupted after Operation Sindoor, matches could be shifted to Dubai

పహల్గామ్‌ ఉగ్రదాడికి భార‌త్ ప్ర‌తీకారం తీర్చుకుంటోంది. ఆపరేషన్‌ సిందూర్‌ (Operation Sindoor) పేరిట దాయాది పాకిస్తాన్‌ను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. తొలుత మంగళవారం అర్ధరాత్రి తర్వాత ఇండియ‌న్ ఆర్మీ.. పాకిస్తాన్‌, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులతో విరుచుకుపడింది.

ఈ ఆపరేషన్‌ సిందూర్‌లో 100 మంది ఉగ్రవాదులు హ‌త‌మ‌య్యారు. అనంత‌రం బ‌దులుగా పాకిస్తాన్‌ సరిహద్దుల వెంట కాల్పులకు తెగబడటంతో పాటు.. మిసైళ్లతో దాడికి దిగింది. ఇందుకు భార‌త్ సైతం ధీటుగా బ‌దులిస్తోంది. భార‌త బ‌ల‌గాలు పాక్ మిస్సైల్ ను గాల్లోనే పేల్చివేశాయి. పాక్ పై డ్రోన్లతో విరుచుకుపడుతోంది. 

లాహోర్ లోని కీలక ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను ధ్వంసం చేసింది. పాక్ ఆర్మీ హెడ్ క్వార్టర్ ఉండే రావల్పిండిపై కూడా డ్రోన్ దాడులు జ‌రిగిన‌ట్లు తెలుస్తోంది. ఈ క్ర‌మంలో రావ‌ల్పిండి క్రికెట్ స్టేడియం స‌మీపంలో ఓ డ్రోన్ కూలిపోయిన‌ట్లు తెలుస్తోంది.  అయితే ఇదే మైదానంలో గురువారం రాత్రి పాకిస్తాన్‌ సూపర్‌ లీగ్‌ (PSL) మ్యాచ్‌ జరగాల్సి ఉంది.

షెడ్యూల్ ప్ర‌కారం పెషావర్‌ జల్మీ, క‌రాచీ కింగ్స్ త‌ల‌ప‌డాల్సింది. కానీ రావ‌ల్పిండిలో ప్ర‌స్తుత ప‌రిస్థితుల దృష్ట్యా ఈ మ్యాచ్‌ను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వాయిదా వేసింది. అదేవిధంగా ప్ర‌స్తుత పరిస్థితుల‌పై చ‌ర్చించేందుకు పీసీబీ ల‌హోర్‌లో అత్య‌వ‌స‌ర స‌మావేశం ఏర్పాటు చేసింది. 

క్రిక్‌బ‌జ్ రిపోర్ట్ ప్ర‌కారం.. పీఎస్ఎల్‌-2025లో మిగిలిన మ్యాచ్‌ల‌ను వేరో చోట‌కు త‌ర‌లించాల‌ని పీసీబీ నిర్ణ‌యించిన‌ట్లు తెలుస్తోంది. దుబాయ్ లేదా దోహాల‌ను వేదిక‌గా మిగిలిన మ్యాచ్‌ల‌ను నిర్వ‌హించాల‌ని పీసీబీ భావిస్తోందంట‌. దీనిపై ఒక‌ట్రెండు రోజుల్లో పీసీబీ అధికారిక ప్ర‌క‌ట‌న చేసే అవ‌కాశ‌ముంది. అయితే టోర్నీని వేరో చోట‌కు మార్చ‌డం పాకిస్తాన్‌కు అద‌న‌పు ఖర్చుతో కూడుకున్న వ్య‌వ‌హ‌రం. మ‌రి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఏమి చేస్తుందో వేచి చూడాలి.

Advertisement
 
Advertisement
Advertisement