
టీమిండియా యువ ఆటగాడు పృథ్వీ షా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. క్రికెటర్‌గా తనకు గుర్తింపునిచ్చిన ముంబైతో బంధాన్ని తెంచుకున్నాడు. తదుపరి (2025-26) దేశవాలీ సీజన్ కోసం మహారాష్ట్రతో ఒప్పందం చేసుకున్నాడు. షా ఇటీవలే NOC (No Objection Certificate) కోసం ముంబై క్రికెట్ అసోసియేషన్‌కు దరఖాస్తు చేసుకోగా, తాజాగా అది జారీ అయ్యింది.
PRITHVI SHAW JOINS MAHARASHTRA...!!!!
- Waiting for Ruturaj × Shaw opening. 💛 pic.twitter.com/UPT4qF9mYv— Johns. (@CricCrazyJohns) July 7, 2025
షా క్రమశిక్షణారాహిత్యం కారణంగా గత సీజన్‌లో ముంబై రంజీ జట్టులో స్థానం కోల్పోయాడు. అయితే డిసెంబర్ 14న జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ ఫైనల్‌లో మాత్రం ఆడాడు. ఆ మ్యాచ్ షా రాణించనప్పటికీ ముంబై ఛాంపియన్‌గా నిలిచింది. ఫైనల్లో మధ్యప్రదేశ్‌పై విజయం సాధించింది. ఇదే షాకు ముంబై తరఫున ఆఖరి మ్యాచ్.
షా ముంబై క్రికెట్ అసోసియేషన్‌కు (MCA) రాసిన లేఖలో ఇలా పేర్కొన్నాడు. MCA క్రికెటర్‌గా తనకు జన్మనిచ్చిందని అన్నాడు. MCA తనకు ఇచ్చిన అవకాశాలకు కృతజ్ఞతలు తెలిపాడు. మహారాష్ట్రకు ఆడే ఆశాజనకమైన అవకాశాన్ని కాదనుకోలేకపోయానని తెలిపాడు.
ఈ మార్పును (ముంబై నుంచి మహారాష్ట్రకు) తన క్రికెట్ ప్రయాణంలో ముందడుగుగా అభివర్ణించాడు. ఇది తన అభివృద్ధికి దోహదపడుతుందని నమ్ముతున్నానని అన్నాడు.
25 ఏళ్ల పృథ్వీ షా కెరీర్ హీన దశలో ఉన్నప్పుడు ఈ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ముంబై తరఫున అవకాశాలు దాదాపుగా కనుమరుగు కావడంతో ఈ సాహసం చేశాడు. సహజంగా క్రికెటర్లకు ముంబై తరఫున ఆడుతుంటేనే జాతీయ జట్టులో అవకాశాలు వస్తుంటాయి.
అలాంటిది షా ముంబైని వీడి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు. 2018లో టీమిండియా తరఫున అరంగేట్రంలోనే సెంచరీ చేసి భవిష్యత్ తారగా కీర్తించబడిన షా.. వివాదాలు, ఫిట్‌నెస్, పేలవ ఫామ్ కారణంగా జాతీయ జట్టుకు దూరమయ్యాడు.
ఇవే కారణాలుగా అతను దేశవాలీ జట్టులోనూ చోటు కోల్పోయాడు. షాను తాజాగా ముగిసిన ఐపీఎల్‌లోనూ ఏ ఫ్రాంచైజీ తీసుకోలేదు. షా కెరీర్ ప్రస్తుతం అగమ్యగోచరంగా ఉంది. ఈ దశలో అతను ముంబైని వీడి మహారాష్ట్రకు ఆడటానికి ఒప్పందం చేసుకున్నాడు.
షా తదుపరి దేశవాలీ సీజన్‌లో మరో టీమిండియా యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్‌తో కలిసి ఆడతాడు. రుతురాజ్ మహారాష్ట్రకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. అన్నీ కుదిరితే షా, రుతురాజ్ మహారాష్ట్ర తరఫున ఇన్నింగ్స్‌ను ప్రారంభిస్తారు.