
స్వాతంత్య్ర దినోత్సవ సందేశంలో రాష్ట్రపతి
న్యూఢిల్లీ: ప్రపంచ చెస్‌లో భారత్ ఆధిపత్యం కనబరుస్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కితాబిచ్చారు. దేశ పౌరులకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన ఆమె తన సందేశంలో భారత చెస్ క్రీడాకారుల ఘనతను ప్రస్తావించారు. క్రీడల్లో భారత్ గణనీయమైన విజయాలను సాధిస్తోందని ప్రశంసించారు. ‘దేశ యువత సరికొత్త ఆత్మవిశ్వాసంతో క్రీడల్లో ముందడుగు వేస్తోంది.
చెస్ ఈవెంట్‌ను చూసుకుంటే... భారత యువ చదరంగ క్రీడాకారులదే హవా! మునుపెన్నడూ లేని విధంగా అంతర్జాతీయ చెస్‌లో ఆధిపత్యాన్ని మన గ్రాండ్‌మాస్టర్లు చలాయిస్తున్నారు. ఇక మీదట అమలయ్యే కొత్త క్రీడా పాలసీతో ప్రపంచ క్రీడాశక్తిగా భారత్ ఆవిర్భవించే అవకాశలున్నాయి. మన అమ్మాయిలు మనకు గర్వకారణంగా నిలుస్తున్నారు. ప్రతి రంగంలోనూ మహిళలు సత్తా చాటుకుంటున్నారు. రక్షణ, భద్రత, క్రీడలు ఇలా ఏ రంగమైనా సరే ఎవరికీ తీసిపోని విధంగా సాటిలేని విజయాలు సాధిస్తున్నారు.
పురుషుల్లో 18 ఏళ్ల దొమ్మరాజు గుకేశ్ ప్రపంచ చాంపియన్‌షిప్ సాధించడం, మహిళల్లో 19 ఏళ్ల టీనేజ్ అమ్మాయి దివ్య దేశ్‌ముఖ్, 38 ఏళ్ల వెటరన్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి ‘ఫిడే’ మహిళల ప్రపంచకప్ ఫైనల్స్‌కు అర్హత సాధించడం చెస్‌లో మన సత్తా ప్రపంచానికి చాటినట్లయ్యింది’ అని రాష్ట్రపతి తన సందేశంలో ప్రముఖంగా ప్రస్తావించడం విశేషం. తరాలు మారుతున్నా... మన మహిళలు స్థిరంగా ప్రతిభ చాటుకుంటున్నారని, ప్రపంచంతో పోటీ పడేందుకు సై అంటున్నారని ప్రశంసించారు.
మహిళా సాధికారత కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన ‘నారీశక్తి వందన్ అధినియమ్’ ఇకపై నినాదం మాత్రమే కాదు... నిజమైన సార్థకతగా అభివర్ణించారు. గత కొన్నేళ్లుగా అంతర్జాతీయ చెస్‌లో భారత క్రీడాకారులు విశేషంగా రాణిస్తున్నారు. గుకేశ్, దివ్యలతో పాటు తెలంగాణ తేజం ఇరిగేశి అర్జున్, ప్రజ్ఞానంద, విదిత్, వైశాలి ఇంటా బయటా విజయకేతనం ఎగురవేస్తున్నారు.