
పాకిస్తాన్ ప్రీమియర్ లీగ్ 2025లో ఆ దేశ జాతీయ జట్టు వికెట్‌కీపర్ సాహిబ్జాదా ఫర్హాన్ విధ్వంసకర శతకంతో విరుచకుపడ్డాడు. పెషావర్ జల్మీతో నిన్న (ఏప్రిల్ 14) జరిగిన మ్యాచ్‌లో అతను 49 బంతుల్లోనే శతకొట్టాడు. ఓవరాల్‌గా 52 బంతులు ఎదుర్కొన్న ఫర్హాన్ 13 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 106 పరుగులు చేశాడు. ఫర్హాన్ రెచ్చిపోవడంతో ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన డిఫెండింగ్ ఛాంపియన్ ఇస్లామాబాద్ యునైటెడ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది.
ఇస్లామాబాద్ ఇన్నింగ్స్‌లో కొలిన్ మున్రో (27 బంతుల్లో 40; 6 ఫోర్లు, సిక్స్), సల్మాన్ అఘా (15 బంతుల్లో 30; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. ఆండ్రియస్ గౌస్ 0, ఆజమ్ ఖాన్ 16, జేసన్ హోల్డర్ 20 నాటౌట్, డ్వార్షుయిస్ 18 నాటౌట్ పరుగులు చేశారు. పెషావర్ బౌలర్లలో అల్జరీ జోసఫ్, తలాత్ తలో రెండు వికెట్లు తీశారు.
అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన పెషావర్.. ఇస్లామాబాద్ బౌలర్లు ఇమాద్ వసీం (4-0-26-3), షాదాబ్ ఖాన్ (4-0-29-2), డ్వార్షుయిస్ (2.2-0-23-2), నసీం షా (3-0-14-1), జేసన్ హోల్డర్ (2-0-20-1), షాన్ మసూద్ (3-0-25-1) కలిసికట్టుగా రాణించడంతో 18.2 ఓవర్లలో 141 పరుగులకే కుప్పకూలింది.
పెషావర్ ఇన్నింగ్స్‌లో మహ్మద్ హరీస్ (47 బంతుల్లో 87; 12 ఫోర్లు, 4 సిక్సర్లు) ఒంటరిపోరాటం చేసినప్పటికీ ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. హరీస్‌తో పాటు పెషావర్ జట్టులో మిచెల్ ఓవెన్ (10), తలాత్ (13) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. పెషావర్ కెప్టెన్ బాబర్ ఆజమ్ (1) వరుసగా రెండో మ్యాచ్‌లోనూ విఫలమయ్యాడు.
విధ్వంసకర ఇన్నింగ్స్‌లకు పెట్టింది పేరు
ఫర్హాన్.. పాక్ దేశవాలీ క్రికెట్‌లో పలు విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఈ ఏడాది అతను పాక్ నేషనల్ టీ20 కప్‌లో 72 బంతుల్లో 14 ఫోర్లు, 11 సిక్సర్ల సాయంతో 162 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. పాక్ టీ20 క్రికెట్ చరిత్రలోనే ఇది అత్యధిక స్కోర్‌గా రికార్దైంది. ఓవరాల్‌గా చూసినా టీ20ల్లో ఇది మూడో అత్యధిక స్కోర్.
టీ20ల్లో తొలి రెండు అత్యధిక స్కోర్లు క్రిస్ గేల్ (175 నాటౌట్), ఆరోన్ ఫించ్ (172) పేరిట ఉన్నాయి. ఫర్హాన్.. హ్యామిల్టన్ మసకద్జ (162 నాటౌట్), హజ్రతుల్లా జజాయ్‌తో కలిసి (162 నాటౌట్) సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నాడు.
పీఎస్‌ఎల్ 2025లో భాగంగా పెషావర్‌పై ఫర్హాన్ చేసిన చేసిన 49 బంతుల సెంచరీ ఈ సీజన్‌లో మొదటిది. ఇస్లామాబాద్ తరఫున ఇదే ఫాస్టెస్ట్ సెంచరీ. 2019 సీజన్‌లో సౌతాఫ్రికా ఆటగాడు కెమరూన్ డెల్‌పోర్డ్ కూడా ఇస్లామాబాద్‌కు ఆడుతూ లాహోర్ ఖలందర్స్‌పై 49 బంతుల్లోనే శతక్కొట్టాడు.