Pak Vs Eng: బాబర్‌ చెత్త కెప్టెన్‌.. జీరో.. కోహ్లితో పోల్చడం ఆపేయండి: పాక్‌ మాజీ క్రికెటర్‌ ఫైర్‌

Pak Vs Eng: Danish Kaneria Slams Babar Big Zero Stop Comparing Kohli - Sakshi

Pakistan vs England Test Series 2022: పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజంపై ఆ జట్టు మాజీ క్రికెటర్‌ దానిష్‌ కనేరియా మండిపడ్డాడు. సారథిగా బాబర్‌ ఓ సున్నా అని, ఇకనైనా అతడిని టీమిండియా స్టార్‌ విరాట్‌ కోహ్లితో పోల్చడం ఆపేయాలని కోరాడు. కోహ్లితో పోల్చదగిన క్రికెటర్లెవరూ పాక్‌ జట్టులో లేరంటూ ఘాటు విమర్శలు చేశాడు. కాగా ఇంగ్లండ్‌తో స్వదేశంలో జరిగిన మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో బాబర్‌ ఆజం బృందం వైట్‌వాష్‌కు గురైన విషయం తెలిసిందే.

ఇప్పటికే వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్‌ రేసు నుంచి నిష్క్రమించిన పాక్‌... సొంతగడ్డపై దారుణ వైఫల్యం కారణంగా విమర్శలు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో ఆ జట్టు మాజీ లెగ్‌ స్పిన్నర్‌ దానిష్‌ కనేరియా పాక్‌ ఆట తీరుపై మండిపడ్డాడు. బాబర్‌ ఆజంకు కెప్టెన్‌గా ఉండే అర్హత లేదంటూ విమర్శించాడు.


దానిష్‌ కనేరియా

పాక్‌ జట్టులో అలాంటి వాళ్లు లేరు
ఈ మేరకు తన యూట్యూబ్‌ చానెల్‌ వేదికగా కనేరియా మాట్లాడుతూ.. ‘‘దయచేసి ఇప్పటికైనా బాబర్‌ ఆజంను కోహ్లితో పోల్చడం ఆపేయండి. విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మ గొప్ప ఆటగాళ్లు. వాళ్లతో పోల్చదగిన క్రికెటర్లెవరూ పాక్‌ జట్టులో లేరు. 

ఒకవేళ ఎవరైనా వాళ్లలా ప్రశంసలు అందుకోవాలంటే ఆటలో రారాజై ఉండాలి. మెరుగైన ప్రదర్శన కనబరచాలి. లేదంటే జీరోలు అవుతారు. ఇక బాబర్‌ ఆజం కెప్టెన్‌గా ఓ పెద్ద సున్నా. అతడికి నాయకుడిగా ఉండే అర్హత లేదు. ముఖ్యంగా టెస్టు క్రికెట్‌లో జట్టును ముందుకు నడిపే సామర్థ్యం, నాయకత్వ ప్రతిభ అతడికి లేవు’’ అని బాబర్‌ ఆజంపై విమర్శలు గుప్పించాడు. 

ఇగో పక్కన పెడితేనే
ఇక ఇంగ్లండ్‌తో సిరీస్‌ ద్వారా కెప్టెన్‌ బెన్‌ స్టోక్స్‌, కోచ్‌ బ్రెండన్‌ మెకల్లమ్‌ నుంచి కెప్టెన్సీ మెళకువలు నేర్చుకునే అవకాశం బాబర్‌కు దక్కిందన్న కనేరియా.. ఇకనైనా ఇగోను పక్కనపెట్టి పాక్‌ మాజీ కెప్టెన్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ సలహాలు తీసుకోవాలని సూచించాడు. కాగా ఇంగ్లండ్‌ చేతిలో ఓటమితో బాబర్‌ ఆజం ఓ చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. స్వదేశంలో వరుసగా నాలుగు టెస్టు మ్యాచ్‌లు ఓడిన మొదటి పాక్‌ కెప్టెన్‌గా నిలిచాడు.

చదవండి: FIFA WC 2022: పోర్చుగల్‌ స్టార్‌ రొనాల్డోకు అవమానం.. అర్జెంటీనా ఆటగాడు కూడా
FIFA WC 2022: విజేతకు రూ. 347 కోట్లు.. మిగతా జట్ల ప్రైజ్‌మనీ, అవార్డులు, ఇతర విశేషాలు

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top