Babar Azam: అంటే మేం టెస్టులు ఆడటం ఆపేయాలా?: పాక్‌ కెప్టెన్‌ అసహనం

Pak Vs Eng 2nd Test: Babar On Loss Shocking Reply To Bizarre Question - Sakshi

Pakistan vs England, 2nd Test- Babar Azam: స్వదేశంలో ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో ఓటమి పాలైన పాకిస్తాన్‌ సిరీస్‌ను 0-2తో కోల్పోయింది. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ 2021-23లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో పర్యాటక జట్టు చేతిలో ఓడిపోయి ఫైనల్‌ రేసు నుంచి నిష్క్రమించింది. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ అనంతరం పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ ఆజం మాట్లాడుతూ.. తొలి ఇన్నింగ్స్‌లో తక్కువ స్కోరుకే పరిమితం కావడం ప్రభావం చూపిందన్నాడు.

రెండో ఇన్నింగ్స్‌లో పుంజుకున్నప్పటికీ.. గెలిచేందుకు తాము చేసిన పోరాటం ఫలించలేదని వాపోయాడు. ఈ టెస్టుతో అరంగేట్రం చేసిన అబ్రార్‌ అహ్మద్‌కు మాత్రం ఈ మ్యాచ్‌ చిరకాలం గుర్తుండిపోతుందని పేర్కొన్నాడు. 

కరాచీ వేదికగా జరుగనున్న మూడో టెస్టులో అత్యుత్తమంగా ఆడి గెలుస్తామంటూ బాబర్‌ ఆజం ధీమా వ్యక్తం చేశాడు. మరోవైపు.. సుదీర్ఘ విరామం తర్వాత పాక్‌ పర్యటనకు వెళ్లిన ఇంగ్లండ్‌ 22 ఏళ్ల తర్వాత అక్కడ సిరీస్‌ గెలిచి చరిత్ర సృష్టించింది. దీంతో స్టోక్స్‌ బృందం సంబరాల్లో మునిగిపోయింది.

టీ20లపై దృష్టి పెట్టండి!
కాగా ముల్తాన్‌ టెస్టులో మొదటి ఇన్నింగ్స్‌లో 75 పరుగులు చేసిన బాబర్‌.. రెండో ఇన్నింగ్స్‌లో ఒక్క పరుగుకే పెవిలియన్‌ చేరాడు. అలాగే వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ మహ్మద్‌ రిజ్వాన్‌ వరుసగా 10, 30 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో వీరిద్దరి ప్రదర్శన తీరుపై విమర్శలు వచ్చాయి.

ఈ క్రమంలో విలేకరుల సమావేశంలో భాగంగా.. బాబర్‌ ఆజంకు ఓ జర్నలిస్టు సంధించిన ప్రశ్న చిరాకు తెప్పించింది. ‘‘అభిమానుల తరఫున నేను ఈ ప్రశ్న అడుగుతున్నా. బాబర్‌, రిజ్వాన్‌ టీ20 ఫార్మాట్‌పై మరింత దృష్టి పెట్టాలని వాళ్లు కోరుకుంటున్నారు’’ అని ఆ జర్నలిస్టు బాబర్‌తో అన్నారు.

అంటే టెస్టులు ఆడొద్దా?!
ఇందుకు స్పందించిన పాక్‌ సారథి.. ‘‘అంటే.. మేము టెస్టులు ఆడటం మానేయాలని మీరు చెబుతున్నారా?’’ అని విసుగు  ప్రదర్శించాడు. టెస్టు మ్యాచ్‌ గురించి మాట్లాడుతుంటే టీ20ల గురించి ప్రశ్న ఎందుకన్నట్లుగా చిరాకుపడ్డాడు. అయితే, సదరు జర్నలిస్టు మాత్రం నేను అలా అనడం లేదు.. టీ20లపై ఫోకస్‌ చేయాలని మాత్రమే చెబుతున్నా అని చెప్పుకొచ్చారు. కాగా టీ20 ఫార్మాట్‌లో పాక్‌ బెస్ట్‌ ఓపెనింగ్‌ జోడీగా పేరొందిన రిజ్వాన్‌- బాబర్‌ ప్రపంచకప్‌-2022 టోర్నీలో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయారు. ఆ టోర్నీలో మొత్తంగా రిజ్వాన్‌ 175, బాబర్‌ 124 పరుగులు చేశారు.

పాక్‌ వర్సెస్‌ ఇంగ్లండ్‌ రెండో టెస్టు.. మ్యాచ్‌ సాగిందిలా!
పాకిస్తాన్‌తో జరిగిన రెండో టెస్టులో ఇంగ్లండ్‌ 26 పరుగుల తేడాతో గెలిచింది. తద్వారా ఇంకో మ్యాచ్‌ ఉండగానే 22 ఏళ్ల తర్వాత పాక్‌ గడ్డపై టెస్టు సిరీస్‌ను 2–0తో కైవసం చేసుకుంది. సీమర్‌ మార్క్‌ వుడ్‌ (4/65) నాలుగోరోజు ఆటను శాసించాడు. క్రీజులో పాతుకుపోయిన బ్యాటర్స్‌ను వైవిధ్యమైన బంతులతో పెవిలియన్‌ చేర్చాడు.

నాలుగో రోజు ఆటలోనే అతను 3 వికెట్లను పడగొట్టాడు. 355 పరుగుల లక్ష్యం ఛేదించేందుకు ఓవర్‌నైట్‌ స్కోరు 198/4తో సోమవారం రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన పాకిస్తాన్‌ 328 పరుగుల వద్ద ఆలౌటైంది. ఓవర్‌నైట్‌ బ్యాటర్స్‌లో ఫహీమ్‌ అష్రఫ్‌ (10; 1 ఫోర్‌) ఆట మొదలైన కాసేపటికే రూట్‌ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. కానీ మరో బ్యాటర్‌ సౌద్‌ షకీల్‌ (94; 8 ఫోర్లు) ఇంగ్లండ్‌ బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టాడు.

నవాజ్‌ (45; 7 ఫోర్లు)తో కలిసి ఆరో వికెట్‌కు 80 పరుగులు జోడించడంతో ఇంగ్లండ్‌ శిబిరంలో ఆందోళన మొదలైంది. షకీల్‌ సెంచరీకి చేరువైన దశలో వుడ్‌ తన వరుస ఓవర్లలో పరుగు తేడాతో మొదట నవాజ్‌ను తర్వాత షకీల్‌ను పెవిలియన్‌ చేర్చడంతో ఇంగ్లండ్‌కు విజయం ఖాయమైంది. 290/5తో పటిష్టంగా కనిపించిన పాకిస్తాన్‌ 291/7 స్కోరు వద్ద కష్టాల్లో పడింది.

లంచ్‌ విరామనంతరం వుడ్, అండర్సన్, రాబిన్సన్‌ టెయిలెండర్ల పనిపట్టారు. జాహిద్‌ మహమూద్‌ (0) వుడ్‌ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. అబ్రార్‌ అహ్మద్‌ (17)ను అండర్సన్, మొహమ్మద్‌ అలీ (0)ని రాబిన్సన్‌ అవుట్‌ చేయడంతో పాక్‌ ఇన్నింగ్స్‌ కూలింది. సిరీస్‌లోని చివరిదైన మూడో టెస్టు శనివారం నుంచి కరాచీలో జరుగుతుంది. 

స్కోర్లు: 
ఇంగ్లండ్‌- 281 & 275
పాకిస్తాన్‌- 202 & 328

చదవండి: Ind Vs Ban: పాక్ అవుట్‌.. మరి టీమిండియా? ఫైనల్‌ రేసులో నిలవాలంటే అదొక్కటే దారి!
ప్రకృతితో ఆటలాడితే అధోగతే! మంచు దుప్పటిలో ప్రసిద్ధ స్టేడియం! గుర్తుపట్టారా?

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top