
లివర్‌పూల్ మహిళా ఫుట్‌బాలర్ కోసం రూ. 11 కోట్ల 55 లక్షలు చెల్లించిన అర్సెనల్ క్లబ్
మహిళల ఫుట్‌బాల్ చరిత్రలో ఇదే అత్యధిక బదిలీ మొత్తం
లండన్: మహిళల ఫుట్‌బాల్‌లో ఒలీవియా స్మిత్ కొత్త చరిత్ర సృష్టించింది. కెనడాకు చెందిన ఈ స్టార్ ప్లేయర్ కోసం... ఇంగ్లండ్‌కు చెందిన అర్సెనల్ ఫుట్‌బాల్ క్లబ్ రికార్డు ధర చెల్లించింది. గత సీజన్‌లో లివర్‌పూల్ క్లబ్ కోసం ఆడిన ఒలీవియా వచ్చే నాలుగేళ్లపాటు అర్సెనల్ క్లబ్ తరఫున బరిలోకి దిగుతుంది. ట్రాన్స్‌ఫర్ ఫీజు కింద అర్సెనల్ క్లబ్ 10 లక్షల పౌండ్లను (రూ. 11 కోట్ల 55 లక్షలు) లివర్‌పూల్‌కు చెల్లించింది.
మహిళల ఫుట్‌బాల్ చరిత్రలో ఇదే అత్యధిక బదిలీ మొత్తం కాగా... ఈ ఏడాది జనవరిలో అమెరికా ప్లేయర్ నవోమీ గిర్మా కోసం చెల్సీ క్లబ్... సాన్ డియెగో వేవ్ జట్టుకు చెల్లించిన 9 లక్షల పౌండ్ల (రూ. 9 కోట్ల 47 లక్షలు) ధర రెండో స్థానానికి చేరింది. ‘ఒలీవియ స్మిత్ ప్రతిభావంతురాలు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించగల సత్తా ఆమెలో ఉంది. క్లబ్ అభివృద్ధికి అది దోహదపడుతుంది’ అని అర్సెనల్ మహిళల ఫుట్‌బాల్ క్లబ్ డైరెక్టర్ క్లేర్ వీట్లీ తెలిపారు. 15 ఏళ్ల వయసులోనే కెనడా తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేసి ఆకట్టుకున్న ఒలీవియా... 2023 సీజన్‌లో స్పోరి్టంగ్ లిస్బన్ క్లబ్ తరఫున 28 మ్యాచ్‌ల్లో 16 గోల్స్‌తో మెరిసింది. ఇక గతేడాది లివర్‌పూల్‌కు ప్రాతినిధ్యం వహించిన 20 ఏళ్ల ఒలీవియా 25 మ్యాచ్‌ల్లో 9 గోల్స్ చేసింది.
‘ఒలీవియాలో అపార నైపుణ్యం ఉంది. అర్సెనల్ తరఫున ఆమె అద్భుతాలు చేయగలదనే నమ్మకముంది. చిన్న వయసులోనే గత రెండు యూరోపియన్ లీగ్‌ల్లో తన నైపుణ్యంతో అందరినీ ఆకట్టుకుంది’ అని అర్సెనల్ హెడ్ కోచ్ రెనీ స్లెగెర్స్ అన్నాడు. 15 సార్లు ఇంగ్లిష్ చాంపియన్‌గా నిలిచిన అర్సెనల్ క్లబ్... గత సీజన్‌లో రెండోసారి చాంపియన్స్ లీగ్ టైటిల్ గెలుచుకుంది. ‘ఇది నా కల. అత్యున్నత స్థాయిలో ఇంగ్లండ్, యూరప్ లీగ్‌ల్లో రాణించాలనుకుంటున్నా. అర్సెనల్ జట్టు తరఫున ఆడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. క్లబ్ విజయం కోసం నా వంతు కృషి చేస్తా’అని ఒలీవియా పేర్కొంది.
గతంలో మహిళా ఫుట్‌బాల్ ప్లేయర్లకు పెద్దగా డిమాండ్ లేకపోగా... ఇటీవలి కాలంలో వారి కోసం వెచ్చిస్తున్న మొత్తం భారీగా పెరుగుతూ వస్తోంది. ఈ ఏడాది ఆరంభంలో గిర్మాకు కేటాయించిన ధరే అత్యధికం అనుకుంటే... ఆరు నెలలు తిరిగేసరికి ఒలీవియా ఆ రికార్డును బద్దలు కొట్టింది. పురుషుల విభాగంతో పోల్చుకుంటే ఇది తక్కువే అయినా... మహిళల ఆటకు దక్కుతున్న ఆదరణకు ఈ గణాంకాలు తాజా ఉదాహరణ.
పురుషుల ఫుట్‌బాల్‌లో బ్రెజిల్‌కు చెందిన నెమార్ కోసం పారిస్ సెయింట్ జెర్మయిన్ (పీఎస్‌జీ) క్లబ్... 2017లో బార్సిలోనా క్లబ్‌కు 262 మిలియన్ల అమెరికా డాలర్లు (రూ. 2255 కోట్లు) చెల్లించింది. ఫ్రాన్స్ స్టార్ కిలియాన్ ఎంబాపె కోసం పీఎస్‌జీ క్లబ్... 216 మిలియన్ల అమెరికా డాలర్లు (రూ. 1859 కోట్లు) వెచ్చించింది.