భారత జట్టుకు ఎంపిక కాకపోతే అది నా నష్టం కాదు..! | Not My Loss: Mohammed Shami Issues Fresh Statement On India Exclusion | Sakshi
Sakshi News home page

భారత జట్టుకు ఎంపిక కాకపోతే అది నా నష్టం కాదు..!

Oct 10 2026 6:40 PM | Updated on Oct 10 2026 6:55 PM

Not My Loss: Mohammed Shami Issues Fresh Statement On India Exclusion

source: X

టీమిండియాలో పునరాగమనం కోసం ఎదురుచూస్తున్న భారత సీనియర్ పేసర్ మహ్మద్‌ షమీ మరోసారి తన ఎంపికపై స్పందించాడు. భారత జట్టుకు ఎంపిక కాకపోవడం తనకు నష్టం కాదని అన్నాడు. ఎక్కడ ఆడే అవకాశం వచ్చినా అత్యుత్తమ ప్రదర్శన చేయడమే తన లక్ష్యమని తెలిపాడు. ప్రస్తుతం రంజీ ట్రోఫీ మ్యాచ్‌పైనే తన దృష్టి ఉందని పేర్కొన్నాడు.

న్యూజిలాండ్‌తో జరగనున్న టీ20 సిరీస్ కోసం అక్టోబర్ 6న 16 మందితో కూడిన భారత జట్టును ప్రకటించారు. ఈ జట్టులో సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్‌కు చోటు దక్కగా (నాలుగేళ్ల తర్వాత).. షమీకి మరోసారి మొండిచెయ్యే ఎదురైంది. భువీ చాలాకాలం తర్వాత టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చిన నేపథ్యంలో షమీ అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది.

గత రెండుమూడేళ్లుగా ఇదే జరుగుతోంది..!
షమీ తాజాగా రెవ్‌స్పోర్ట్జ్‌తో మాట్లాడుతూ టీమిండియా పునరాగమనంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భువనేశ్వర్ కుమార్‌కు జట్టులో చోటు దక్కడం సంతోషకరమని చెప్పాడు. అతడి ఎంపికతో తనకు సంబంధం లేదని అన్నాడు.

తన విషయంలో గత రెండుమూడేళ్లుగా ఇదే జరుగుతోందని వాపోయాడు. నిలకడగా రాణిస్తున్నా, ప్రతిసారి ఫిట్‌నెస్‌ నిరూపించుకున్నా భారత జట్టులో అవకాశం రాకపోతే అది నా నష్టం కాదని భావోద్వేగ వ్యాఖ్యలు చేశాడు.

కాగా, 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ తరఫున చివరిసారిగా ఆడిన షమీ.. ఆ టోర్నీలో ఐదు ఇన్నింగ్స్‌ల్లో తొమ్మిది వికెట్లు పడగొట్టాడు. బంగ్లాదేశ్‌పై ఐదు వికెట్లు తీసి సత్తా చాటడంతో పాటు ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లోనూ మూడు వికెట్లు సాధించాడు.

అయితే, ఆ తర్వాత ఐపీఎల్ 2025లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. దాని తర్వాత జరిగిన దేశవాళీ సీజన్‌లో తిరిగి ఆకట్టుకున్నాడు. విజయ్ హజారే ట్రోఫీలో ఏడు మ్యాచ్‌ల్లో 15 వికెట్లు,  రంజీ ట్రోఫీలో 13 ఇన్నింగ్స్‌ల్లో 37 వికెట్లు తీసి సత్తా చాటాడు. ఇంత రాణించినా షమీకి భారత జట్టులో చోటు దక్కకపోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. 

ఇదీ చదవండి: ఏబీ డివిలియర్స్ ఊచకోత.. 37 బంతుల్లో మెరుపు సెంచరీ


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement