నిఖత్‌ శుభారంభం | Nikhat makes a good start in elite womens boxing tournament | Sakshi
Sakshi News home page

నిఖత్‌ శుభారంభం

Jun 29 2025 3:38 AM | Updated on Jun 29 2025 3:38 AM

Nikhat makes a good start in elite womens boxing tournament

తొలి రౌండ్‌లో అలవోక విజయం 

మనీషా మౌన్‌కు షాక్‌

ఎలైట్‌ మహిళల బాక్సింగ్‌ టోర్నీ

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ స్టార్‌ మహిళా బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ జాతీయ ఎలైట్‌ మహిళల బాక్సింగ్‌ టోర్నమెంట్‌లో శుభారంభం చేసింది. రెండు సార్లు ప్రపంచ చాంపియన్‌ అయిన తెలంగాణ తేజం ధాటికి ఉత్తర ప్రదేశ్‌ ప్రత్యర్థి రాశి శర్మ చేతులెత్తేసింది. సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో శనివారం జరిగిన 48–51 కేజీ కేటగిరీ తొలిరౌండ్‌ బౌట్‌లో నిఖత్‌ జరీర్‌ 4–1తో రాశిపై ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది. మొత్తం ఐదుగురు జడ్జిల్లో నలుగురు జడ్జిలు నిఖత్‌ విసిరిన పంచ్‌లకు 10 పాయింట్లు ఇచ్చారు. 

ప్రత్యర్థికి 9 పాయింట్లు ఇవ్వగా... ఒకే ఒక జడ్జి మాత్రం తెలంగాణ బాక్సర్‌కు 9 పాయింట్లు, రాశి శర్మకు 10 పాయింట్లు కేటాయించడంతో 4–1తో గెలిచింది. లేదంటే 5–0తో స్వీప్‌ చేసేది! హరియాణా బాక్సర్‌ అంజలి తొలిరోజే అనూహ్య ఫలితాన్ని సాధించింది. 57–60 కేజీ కేటగిరీలో ఆమె 3–1తో ప్రపంచ చాంపియన్‌షిప్‌ కాంస్య పతక విజేత మనీషా మౌన్‌ (టాప్స్‌)ను కంగు తినిపించింది. 45–48 కేజీ కేటగిరీలో  2023 ప్రపంచ చాంపియన్‌ నీతు (హరియాణా) 5–0తో రజనీ సింగ్‌ (ఉత్తరప్రదేశ్‌)పై గెలుపొందగా, 60–65 కేజీల కేటగిరీలో తెలంగాణ బాక్సర్‌ యశి శర్మ 5–0తో మోనిషా (తమిళనాడు)పై ఘన విజయం సాధించింది. 

65–70 కేజీల కేటిగిరీలో పూజ (తెలంగాణ) 5–0తో గితిమోని గగొయ్‌ (సాయ్‌)పై నెగ్గగా... 75–80 కేజీల కేటగిరీలో బండి కీర్తి (తెలంగాణ)... ప్రత్యర్థి గరిమా (రాజస్తాన్‌) వాకోవర్‌ ఇవ్వడంతో ముందంజ వేసింది. 51–54 కేజీల కేటగిరీలో ‘టాప్స్‌’ బాక్సర్‌ లక్ష్మి 5–0తో రాగిని (ఉత్తరప్రదేశ్‌)పై గెలిచింది. నేడు జరిగే క్వార్టర్‌ ఫైనల్లో నిఖత్‌ జరీన్‌... ‘సాయ్‌’ బాక్సర్‌ కల్పనతో తలపడుతుంది.   

Advertisement
 
Advertisement
Advertisement