నైట్‌వాచ్‌మన్‌గా వచ్చి..గోల్డెన్‌ డక్‌

Night Watchman Jack Leach Gone For a Golden Duck - Sakshi

చెన్నై: ఇంగ్లండ్‌తో ఇక్కడ చెపాక్‌ స్టేడియంలో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియాను విజయం ఊరిస్తోంది. ఇంగ్లండ్‌కు 482 పరుగుల భారీ టార్గెట్‌ను నిర్దేశించిన టీమిండియా..ఆపై వికెట్ల వేటలో పడింది. మూడో రోజు ఆటలో భాగంగా రెండో ఇన్నింగ్స్‌ చేపట్టిన ఇంగ్లండ్‌.. టీమిండియా స్పిన్‌ మాయాజాలానికి మూడు వికెట్లు కోల్పోయింది.  ఓపెనర్‌ డొమినిక్‌ సిబ్లే(3)ను అక్షర్‌ పటేల్‌ ఎల్బీగా పెవిలియన్‌ పంపి శుభారంభాన్ని అందించాడు. ఆ తర్వాత మరో ఓపెనర్‌ రోరీ బర్న్స్‌(25)ను అశ్విన్‌ ఔట్‌ చేశాడు.  ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ 16 ఓవర్‌ ఆఖరి బంతికి కోహ్లి క్యాచ్‌ పట్టడంతో బర్న్స్‌ ఔటయ్యాడు. అనంతరం ఓవర్‌ వ్యవధిలో జాక్‌ లీచ్‌ డకౌట్‌ అయ్యాడు. అక్షర్‌ పటేల్‌ వేసిన 17 ఓవర్‌ చివరి బంతికి లీచ్‌ పెవిలియన్‌ చేరాడు. తాను ఆడిన తొలి బంతికి లీచ్‌ గోల్డెన్‌ డక్‌గా ఔటయ్యాడు. స్లిప్‌లో రోహిత్‌ క్యాచ్‌ పట్టడంతో నైట్‌వాచ్‌మన్‌గా వచ్చిన లీచ్‌ పెవిలియన్‌ చేరాడు. 

సింపుల్‌ క్యాచ్‌ ఇచ్చిన లీచ్‌ ఇలా వచ్చి అలా వెళ్లిపోవడంతో ఇంగ్లండ్‌ నైట్‌వాచ్‌మన్‌ వ్యూహం ఫలించలేదు. మూడోరోజు ఆట కొద్దిసేపట్లో ముగుస్తుందనగా క్రీజ్‌లోకి వచ్చిన లీచ్‌ ఆడిన మొదటి బంతికి ఔట్‌ కావడంతో రూట్‌ క్రీజ్‌లోకి రాకతప్పలేదు. ఈ రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్‌ మూడు వికెట్ల నష్టానికి 53 పరుగులు చేసింది. ఇంకా ఇంగ్లండ్‌ విజయానికి 429 పరుగులు అవసరం కాగా చేతిలో ఏడు వికెట్లు మాత్రమే ఉన్నాయి. మరో రెండు రోజులు ఆట మిగిలి ఉండగా, రేపు(నాల్గో రోజు) టీమిండియా బౌలింగ్‌ను ఇంగ్లండ్‌ ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. ప్రస్తుతం టీమిండియాదే పైచేయిగా ఉంది. అద్భుతం ఏమైనా జరిగితే తప్ప టీమిండియా విజయాన్ని అడ్డుకోవడం కష్టం.

ఇక్కడ చదవండి:

వారెవ్వా అశ్విన్‌.. వీరోచిత సెంచరీ.. మరో రికార్డు

ఇప్పుడేమంటారు: అశ్విన్‌ భార్య

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top