వారెవ్వా అశ్విన్‌.. వీరోచిత సెంచరీ.. మరో రికార్డు

Ravichandran Ashwin Slams 5th Test century - Sakshi

చెన్నై: ఇంగ్లండ్‌తో​ జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఆటగాడు రవిచంద్రన్‌ అశ్విన్‌ అదుర్స్‌ అనిపించాడు. తొలుత అటు బౌలింగ్‌లోనూ రాణించిన అశ్విన్‌.. ఆపై బ్యాటింగ్‌లో కూడా రాణించాడు. రెండో ఇన్నింగ్స్‌లో శతకం సాధించి శభాష్‌ అనిపించాడు. 135 బంతుల్లో 14 ఫోర్లు, 1 సిక్స్‌ సాయంతో అశ్విన్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇది అశ్విన్‌కు టెస్టుల్లో ఐదు సెంచరీ. సోమవారం మూడో రోజు ఆటలో భాగంగా కోహ్లితో కలిసి 96 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని సాధించి జట్టు స్కోరును గాడిలో పెట్టిన అశ్విన్‌.. అటు తర్వాత శతకంతో మెరిశాడు.

ఒకవైపు వికెట్లు పడుతున్నప్పటికీ అశ్విన్‌ మాత్రం ఆత్మవిశ్వాసంతో ఆడి వీరోచిత సెంచరీ సాధించాడు. ముందుగా హాఫ్‌ సెంచరీని ఆడుతూ పాడుతూ పూర్తి చేసుకున్న అశ్విన్‌ దాన్ని సెంచరీగా మలుచుకున్నాడు. ఒకానొక సమయంలో అశ్విన్‌ సెంచరీ చేస్తాడా.. లేదా అనే సందిగ్థం నెలకొంది. కాగా, పదకొండో బ్యాట్స్‌మన్‌గా క్రీజ్‌లోకి వచ్చిన సిరాజ్‌ను జాగ్రత్తగా ఆడిస్తూనే మరొకవైపు సెంచరీ నమోదు చేశాడు. మొయిన్‌ అలీ వేసిన ఇన్నింగ్స్‌  82 ఓవర్‌ ఐదో బంతికి ఫోర్‌తో శతకాన్ని సాధించాడు అశ్విన్‌. ఇది ఇంగ్లండ్‌పై అశ్విన్‌కు తొలి టెస్టు సెంచరీ కాగా, అంతకుముందు చేసిన నాలుగు సెంచరీలు వెస్టిండీస్‌పైనే సాధించాడు. 

అశ్విన్‌ అరుదైన ఘనత
అశ్విన్‌ సెంచరీ పూర్తి చేయడంతో అరుదైన జాబితాలో చేరిపోయాడు. ఒక టెస్టు మ్యాచ్‌లో ఐదు వికెట్లను, సెంచరీని అత్యధికంగా సాధించిన ఆటగాళ్లలో రెండో స్థానంలో నిలిచాడు. ఒక టెస్టు మ్యాచ్‌లో ఐదు వికెట్లను, సెంచరీని అత్యధికంగా సాధించిన జాబిజాతాలో ఇయాన్‌ బోధమ్‌(ఇంగ్లండ్‌ మాజీ ఆల్‌ రౌండర్‌) ముందు వరుసలో ఉన్నాడు.

ఈ ఘనతను బోథమ్‌ ఐదుసార్లు సాధించగా, ఆ తర్వాత స్థానాన్ని అశ్విన్‌ ఆక్రమించాడు. అశ్విన్‌ ఈ ఫీట్‌ను మూడుసార్లు సాధించాడు.  ఈ క్రమంలోనే  గ్యారీ సోబర్స్‌, ముస్తాక్‌ అహ్మద్‌, జాక్వస్‌ కల్లిస్‌, షకిబుల్‌ హసన్‌లను వెనక్కి నెట్టాడు. వీరంతా దీన్ని రెండుసార్లు మాత్రమే సాధించారు. అశ్విన్‌ 148 బంతుల్లో 14 ఫోర్లు, 1 సిక్స్‌తో 106 పరుగులు సాధించి చివరి వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. భారత తన రెండో ఇన్నింగ్స్‌ను 286 పరుగుల వద్ద ముగించగా,  481 పరుగుల ఓవరాల్‌ ఆధిక్యం లభించించింది. ఫలితంగా ఇంగ్లండ్‌ 482 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగనుంది.

ఇక్కడ చదవండి: ఇప్పుడేమంటారు: అశ్విన్‌ భార్య

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top